[1] ఆ జన సమూహాలను చూచినప్పుడు ఆయన కొండమీదికి వెళ్ళి కూర్చున్నాడు. అప్పుడు ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చారు.
[2] ఆయన నోరార వారికి ఇలా ఉపదేశించసాగాడు:
[3] “తమ ఆధ్యాత్మిక దరిద్య్రాన్ని గుర్తించినవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
[4] దుఃఖించేవారు ధన్యులు. వారికి ఓదార్పు కలుగుతుంది.
[5] సాధుగుణం గలవారు ధన్యులు. భూలోకానికి వారు వారసులు.
[6] నీతిన్యాయాల కోసం ఆకలిదప్పులు గలవారు ధన్యులు. వారికి తృప్తి కలుగుతుంది.
[7] కరుణ చూపేవారు ధన్యులు. వారికి కరుణ దొరుకుతుంది.
[8] శుద్ధ హృదయులు ధన్యులు. వారు దేవుణ్ణి చూస్తారు.
[9] సమాధానం చేకూర్చేవారు ధన్యులు. వారు దేవుని సంతానం అనిపించుకొంటారు.
[10] నీతి న్యాయాల కోసం హింసలకు గురి అయ్యేవారు ధన్యులు. పరలోక రాజ్యం వారిది.
[11] “నన్నుబట్టి మనుషులు మిమ్ములను దూషించి, హింసించి, మీమీద అబద్ధంగా అన్ని రకాల అపనిందలు మోపినప్పుడు మీరు ధన్యులు.
[12] అప్పుడు సంతోషించండి! అత్యధికంగా ఆనందించండి! ఎందుకంటే, పరలోకంలో మీకు గొప్ప బహుమానం ఉంటుంది. మీకు పూర్వం ఉన్న ప్రవక్తలను వారు ఇలాగే హింసించారు.
[13] “ఈ లోకానికి మీరు ఉప్పు. ఒకవేళ ఉప్పు తన ఉప్పదనాన్ని కోల్పోతే దానికి ఉప్పదనం మళ్ళీ ఎలా కలుగుతుంది? అలాంటి ఉప్పు బయట పారవేయడానికి, మనుషుల కాళ్ళ క్రింద త్రొక్కబడడానికి తప్ప మరి దేనికీ పనికి రాదు.
[14] “ఈ లోకానికి మీరు వెలుగు. కొండమీద ఉన్న ఊరు దాచబడడం అసాధ్యం.
[15] ఎవరూ దీపం వెలిగించి బుట్టక్రింద పెట్టరు. దానిని దీప స్తంభంమీద ఉంచుతారు గదా. అప్పుడు అది ఇంట్లో అందరికీ వెలుగు ఇస్తుంది.
[16] అలాగే మనుషులు మీ మంచి పనులు చూచి, పరలోకంలో ఉన్న మీ తండ్రిని స్తుతించేలా మీ వెలుగు వారి ఎదుట ప్రకాశించనియ్యండి.
[17] “ధర్మశాస్త్రాన్ని గానీ ప్రవక్తల మాటలను గానీ రద్దుచేయడానికి నేను వచ్చాననుకోకండి. వాటిని నెరవేర్చడానికే వచ్చాను గానీ రద్దు చేయడానికి కాదు.
[18] నేను ఖచ్చితంగా మీతో చెపుతున్నాను, ధర్మశాస్త్రమంతా నెరవేరేవరకు, భూమీ ఆకాశమూ నశించేవరకు, ధర్మశాస్త్రంలో ఉన్న పొల్లు గానీ అర సున్న గానీ ఏదీ నశించదు.
[19] ఈ ఆజ్ఞలలో అతి స్వల్పమైన దానినైనా మీరి అలా చేయడం ఇతరులకు నేర్పేవారు పరలోక రాజ్యంలో అత్యల్పులుగా లెక్కలోకి వస్తారు. కానీ ఈ ఆజ్ఞలను పాటిస్తూ వాటిని ఉపదేశిస్తూ ఉండేవారు పరలోక రాజ్యంలో ఘనులుగా లెక్కలోకి వస్తారు.
[20] నేను మీతో చెపుతున్నాను, పరిసయ్యుల, ధర్మశాస్త్ర పండితుల నీతిన్యాయాలకంటే మీ నీతిన్యాయాలు మించి ఉండకపోతే మీరు పరలోక రాజ్యంలో ఎంత మాత్రమూ ప్రవేశించరు.
[21] “‘హత్య చేయకూడదు; హత్య చేసిన వారెవరైనా తీర్పుకు గురి అవుతారు’ అని పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు గదా.
[22] అయితే మీతో నేనంటాను, కారణం లేకుండా తన సోదరునిమీద కోపం పెట్టుకొనే ప్రతి ఒక్కడూ తీర్పుకు తగినవాడు. తన సోదరుణ్ణి ‘వ్యర్థుడా’ అనేవాడెవడైనా సరే యూదుల న్యాయ సభ విమర్శకు తగినవాడు. తన సోదరుణ్ణి ‘మూర్ఖుడా’ అనేవాడెవడైనా సరే నరకాగ్నికి తగినవాడు.
[23] అందుచేత మీరు పీఠంముందు అర్పణ చేసేటప్పుడు, ఏ విషయంలోనైనా సరే మీమీద మీ సోదరునికి విరోధ భావం ఉందని మీకు గుర్తుకు వస్తే,
[24] మీ అర్పణ పీఠం ముందు విడిచివెళ్ళిపోండి! మొట్టమొదట మీ సోదరునితో సఖ్యపడండి, ఆ తరువాత వచ్చి మీ అర్పణ అర్పించండి.
[25] “మీ ప్రత్యర్థితో న్యాయస్థానానికి పోయే త్రోవలోనే త్వరగా రాజీపడండి. లేకపోతే మీ ప్రత్యర్థి మిమ్ములను న్యాయాధిపతికి అప్పగిస్తాడేమో, న్యాయాధిపతి మిమ్ములను భటుడికి అప్పగించి ఖైదులో వేయిస్తాడేమో.
[26] అలాంటప్పుడు మీరు చివరి పైసాతో సహా చెల్లించేంతవరకు బయటికి రాలేరని నేను మీతో ఖచ్చితంగా చెపుతున్నాను.
[27] “వ్యభిచారం చేయకూడదని పూర్వీకులకు చెప్పిన మాట మీరు విన్నారు గదా.
[28] కానీ మీతో నేను చెపుతున్నాను, ఎవడైనా ఒక స్త్రీని మోహం చూపు చూస్తే, అప్పటికే ఆమెతో అతడు తన హృదయంలో వ్యభిచరించాడు.
[29] “మీ కుడికన్ను మీకు పాపానికి కారణమైతే దాన్ని పీకి మీ దగ్గర నుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు.
[30] మీ కుడి చేయి మీకు పాపానికి కారణమైతే దాన్ని నరికి మీ దగ్గరనుంచి అవతల పారవేయండి! మీ శరీరాన్నంతా నరకంలో త్రోసివేయడంకంటే మీ శరీర భాగాలలో ఒకటి నశించడం మీకు మేలు.
[31] “భార్యతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెకు విడాకులు ఇవ్వాలనేది కూడా పూర్వం చెప్పిన మాట.
[32] కానీ మీతో నేను చెపుతున్నాను, భార్య వ్యభిచరించి నందుచేత తప్ప మరో కారణంవల్ల ఆమెతో తెగతెంపులు చేసుకొన్నవాడు ఆమెను వ్యభిచారిణిగా చేస్తున్నాడు. అలా తెగతెంపులయిన ఒక స్త్రీని పెళ్ళాడేవాడు వ్యభిచారం చేస్తున్నాడు.
[33] “మరో సంగతి, ‘ప్రభువుకు చేసిన ప్రమాణం నిలబెట్టుకోవాలి. మీరు అసత్యమైన ఒట్టు పెట్టుకోకూడదు’ అంటూ పూర్వీకులకు చెప్పినది మీరు విన్నారు గదా.
[34] కానీ మీతో నేనంటాను, మీరు ఎంతమాత్రం ఒట్టుపెట్టుకోకండి. పరలోకంతోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని సింహాసనం.
[35] భూమితోడని ఒట్టుపెట్టుకోకూడదు – అది దేవుని పాదపీఠం. జెరుసలం మీద ఒట్టుపెట్టుకోకూడదు – అది మహా రాజు నగరం.
[36] మీ తలమీద కూడా ఒట్టుపెట్టుకోకూడదు. మీరు ఒక్క వెంట్రుకైనా తెల్లగా గానీ నల్లగా గానీ చేయలేరు.
[37] మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు అన్నట్టే ఉండాలి. దీనిని మించినది దుర్మార్గంనుంచే కలుగుతుంది.
[38] “‘కంటికి బదులుగా కన్ను, పంటికి బదులుగా పన్ను ఊడబెరకాలి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా.
[39] కానీ మీతో నేనంటాను, దుర్మార్గుణ్ణి ఎదిరించకండి. ఎవరైనా మిమ్ములను కుడిచెంపపై కొడితే, ఆ వ్యక్తికి ఎడమ చెంప కూడా త్రిప్పండి.
[40] ఎవరైనా మీ విషయం వ్యాజ్యం వేసి మీ అంగీని తీసుకోవాలని చూస్తే ఆ వ్యక్తికి మీ పై చొక్కాను కూడా ఇచ్చివేయండి.
[41] ఎవరైనా కిలోమీటరు దూరం వచ్చేలా మిమ్ములను బలవంతం చేస్తే, ఆ వ్యక్తితో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళండి.
[42] మిమ్మల్ని అడిగినవారికి ఇవ్వండి. అప్పుకోసం మీ దగ్గరికి వచ్చినవారికి పెడ ముఖం పెట్టుకోకండి.
[43] “‘మీ పొరుగువారిని ప్రేమతో చూడండి. మీ పగవారిని ద్వేషించండి’ అని చెప్పిన మాట మీరు విన్నారు గదా.
[44] మీతో నేనంటాను, మీ పగవారిని ప్రేమతో చూడండి. మిమ్ములను శపించేవారిని దీవించండి. మీరంటే ద్వేషమున్న వారికి మేలు చేయండి. దూషణతో మీపట్ల వ్యవహరించే వారి కోసం, మిమ్ములను హింసించేవారి కోసం ప్రార్థన చేయండి.
[45] మీరు పరలోకంలో ఉన్న మీ తండ్రికి తగిన సంతానంగా ఉండడానికి ఆ విధంగా చేయండి. ఎందుకంటే, ఆయన మంచివారికి, చెడ్డవారికి కూడా, సూర్యోదయం కలిగిస్తాడు. న్యాయవంతులకు, అన్యాయస్థులకు కూడా వాన కురిపిస్తాడు.
[46] మిమ్ములను ప్రేమించేవారినే ప్రేమిస్తే మీకు ఏ బహుమానం దొరుకుతుంది? సుంకంవారు కూడా అలా చేస్తారు గదా.
[47] మీరు మీ సోదరులకే మర్యాదలు చేస్తే మీరు ఇతరులకంటే ఎక్కువ చేసినదేమిటి? సుంకంవారు కూడా అలా చేస్తారు గదా.
[48] పరలోకంలో ఉన్న మీ తండ్రి పరిపూర్ణుడు. అందుచేత మీరు పరిపూర్ణులై ఉండండి.