Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:12

[1] అప్పుడు యేసు జన సమూహాలతో, తన శిష్యులతో ఇలా అన్నాడు:

[2] “ధర్మశాస్త్ర పండితులూ పరిసయ్యులూ మోషే స్థానంలో కూర్చుని ఉన్నారు,

[3] గనుక వారు మీకు పాటించండని చెప్పేదంతా పాటించి చేయండి గాని, వారు చేసిన పనులు చేయకండి. ఎందుకంటే, వారు తాము చెప్పినట్టు చేయరు.

[4] మోయడానికి కష్టతరమైన బరువులు వారు కట్టి మనుషుల భుజాలమీద ఉంచుతారు గాని, వాటిని తొలగించడానికి తమ చేతివ్రేళ్ళలో ఒక దాన్ని కూడా కదిలించరు.

[5] “వారు చేసేదంతా మనుషులు చూడాలని చేస్తారు. దైవ వాక్కులు వ్రాసి పెట్టుకున్న తమ చిట్టి సంచులు వెడల్పు చేసుకొంటారు. వారి వస్త్రాల అంచులు పెద్దగా చేయించు కొంటారు.

[6] విందులలో గౌరవనీయమైన స్థలాలూ, సమాజ కేంద్రాలలో అగ్రస్థానాలూ వారికి చాలా ఇష్టం.

[7] సంతవీధులలో అభివందనాలు అందుకోవడమూ, మనుషులచేత “రబ్బీ, రబ్బీ” అనిపించుకోవడమూ వారికి చాలా ఇష్టం.

[8] “మీరైతే ‘రబ్బీ’ అని పిలిపించుకోకండి. మీకు ఉపదేశకుడు క్రీస్తు ఒక్కడే! మీరంతా సోదరులు.

[9] ఇదిగాక, భూమిమీద ఎవరినీ మీ ‘తండ్రి’ అనకండి. ఒక్కడే మీ తండ్రి. ఆయన పరలోకంలో ఉన్నాడు.

[10] “ఇంతేకాకుండా, మీరు ‘గురువు’ అని పిలిపించుకోకండి. క్రీస్తు ఒక్కడే మీకు గురువు.

[11] మీలో అందరికంటే ముఖ్యుడు మీకు సేవకుడై ఉండాలి.

[12] తనను గొప్ప చేసుకొనేవాణ్ణి తగ్గించడం, తనను తగ్గించుకొనేవాణ్ణి గొప్ప చేయడం జరుగుతుంది.

[13] “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ఎందుకంటే మీరు మనుషులకు పరలోక రాజ్యాన్ని మూసివేస్తున్నారు. దానిలో మీరు ప్రవేశించరు, ప్రవేశించబోయేవారిని ప్రవేశించనియ్యరు.

[14] అయ్యో, ధర్మశాస్త్రపండితులారా, పరిసయ్యులారా! మీరు కపట భక్తులు. మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే మీరు వితంతువుల ఇళ్ళను మ్రింగివేస్తారు, నటనగా దీర్ఘ ప్రార్థనలు చేస్తారు. కాబట్టి మీకు ఎక్కువ శిక్ష విధించబడుతుంది.

[15] అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా, మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ఎందుకంటే మీ మతతెగలో ఒకణ్ణి చేర్చడానికి మీరు సముద్రంమీద, భూమిమీద ప్రయాణాలు చేస్తారు గానీ అతడు అందులో చేరినతరువాత అతణ్ణి మీకంటే రెండంతలుగా నరకపాత్రుణ్ణి చేస్తారు.

[16] “అయ్యో, గుడ్డి మార్గదర్శులారా! మీకు శిక్ష తప్పదు. మీరు అంటారు గదా ‘ఎవరైనా దేవాలయం తోడని ఒట్టుపెట్టుకొంటే పర్వాలేదు గాని, దేవాలయంలో ఉన్న బంగారం తోడని ఒట్టు పెట్టుకొంటే దానికి కట్టుబడి ఉండాలి.’

[17] తెలివి తక్కువవారలారా, గుడ్డివారలారా! ఏది గొప్ప? బంగారమా? బంగారాన్ని పవిత్రం చేసే దేవాలయమా?

[18] ఇంకా మీరు ఇలా అంటారు: ‘ఎవరైనా బలిపీఠంతోడని ఒట్టు పెట్టుకొంటే పర్వాలేదు గాని బలిపీఠం మీద ఉన్న అర్పణ తోడని ఎవరైనా ఒట్టు పెట్టుకుంటే దానికి కట్టుబడి ఉండాలి.’

[19] తెలివితక్కువ వారలారా! గుడ్డివారలారా! ఏది గొప్ప? అర్పణా? అర్పణను పవిత్రం చేసే బలిపీఠమా?

[20] బలిపీఠంతోడని ఒట్టు పెట్టుకొనేవారు దానితోడనీ, దానిమీద ఉన్న అన్నిటి తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నారు.

[21] దేవాలయం తోడని ఒట్టు పెట్టుకొనేవారు దానితోడని, దాని నివాసి తోడని ఒట్టు పెట్టుకొంటున్నారు.

[22] పరలోకం తోడని ఒట్టు పెట్టుకొనేవారు దేవుని సింహాసనంతోడనీ, దానిమీద కూర్చుని ఉన్నవాని తోడనీ ఒట్టు పెట్టుకొంటున్నారు.

[23] “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు. ఎందుకంటే, మీరు పుదీనా, సోపు, జీలకర్రలలో పదో భాగం చెల్లిస్తారు గానీ ధర్మశాస్త్రంలో ఉన్న ముఖ్యమైనవాటిని – న్యాయాన్ని, కరుణను, విశ్వాసాన్ని విడిచిపెట్టారు. మీరు వాటిని చెల్లించడం మానక వీటిని కూడా జరిగిస్తూ ఉండాలి.

[24] గుడ్డి మార్గదర్శులారా! మీరు దోమను వడకట్టి ఒంటెను మ్రింగివేస్తారు!

[25] “అయ్యో! ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! మీరు గిన్నె, పళ్ళెం బయటవైపు శుభ్రం చేస్తారు గానీ లోపల వాటినిండా దోపిడీ, అత్యాశ ఉన్నాయి.

[26] గుడ్డి పరిసయ్యుడా! మొట్టమొదట గిన్నె, పళ్ళెం లోపల శుభ్రం చెయ్యి! అప్పుడు బయటవైపు కూడా శుభ్రం అవుతుంది.

[27] “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా! పరిసయ్యులారా! మీరు కపట భక్తులు! మీకు శిక్ష తప్పదు! మీరు సున్నం కొట్టిన సమాధులలాంటివారు! బయట అవి అందంగా కనిపిస్తాయి గాని లోపల వాటినిండా చనిపోయినవారి ఎముకలూ, అన్ని రకాల కల్మషమూ ఉంటాయి.

[28] అలాగే బయట చూస్తే మీరు మనుషులకు న్యాయవంతులుగా కనిపిస్తారు గానీ లోపల కపటంతో, చెడుతనంతో నిండి ఉన్నారు.

[29] “అయ్యో, ధర్మశాస్త్ర పండితులారా, పరిసయ్యులారా! మీరు కపటభక్తులు! మీకు శిక్ష తప్పదు! ప్రవక్తలకు సమాధులు నిర్మిస్తారు, న్యాయవంతుల గోరీలను అలంకరిస్తారు.

[30] ‘ఒకవేళ మనం మన పూర్వీకుల రోజుల్లో బతికి ఉంటే, వారితో ప్రవక్తల రక్తపాతం విషయంలో వంతు తీసుకునేవాళ్ళం కాదు’ అంటారు.

[31] ఆ విధంగా మీరు ప్రవక్తలను హత్య చేసినవారి సంతానమని మీమీద మీరే సాక్ష్యం చెప్పుకొంటున్నారు.

[32] సరే, మీ పూర్వీకుల అపరాధ పరిమాణం పూర్తి చేయండి.

[33] “పాముల్లారా! విషసర్ప వంశమా! మీరు నరక శిక్ష ఎలా తప్పించుకోగలరు?

[34] ఇదిగో వినండి! నేను మీ దగ్గరకు ప్రవక్తలను, జ్ఞానులను, ధర్మశాస్త్ర పండితులను పంపుతున్నాను. వారిలో కొంతమందిని మీరు చంపుతారు, సిలువ వేస్తారు. మరి కొంతమందిని మీ సమాజ కేంద్రాలలో కొరడా దెబ్బలు కొడతారు, ఊరినుంచి ఊరికి తరుముతూ హింసిస్తారు.

[35] ఈ విధంగా, భూమిమీద మనుషులచేత ఒలికిన న్యాయవంతుల రక్తమంతటి విషయం మీరు జవాబుదారులవుతారు. అంటే, న్యాయవంతుడైన హేబెల్ రక్తం మొదలుకొని, దేవాలయానికి బలిపీఠానికీ మధ్య మీరు చంపిన బరకీయ కుమారుడైన జెకర్యా రక్తంవరకు ఆ రక్తమంతటికీ మీరు బాధ్యులవుతారు.

[36] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇదంతా ఈ తరంవారి మీదికి వస్తుంది.

[37] “ఓ జెరుసలం! జెరుసలం! ప్రవక్తలను చంపుతూ, నీ దగ్గరకు దేవుడు పంపినవారిని రాళ్ళు రువ్వి హతమారుస్తూ ఉండేదానా! కోడి తన పిల్లలను రెక్కలక్రింద చేర్చుకొనే విధంగా నీ పిల్లలను నేను చేర్చుకోవాలని ఎన్నోసార్లు ఇష్టపడ్డాను. నీవైతే ఇష్టపడలేదు.

[38] ఇదిగో విను, నీ ఇల్లు నీకే పాడుగా విడిచిపెట్టడం జరుగుతూ ఉంది.

[39] నీతో నేను ఇలా చెపుతున్నాను: ఇకనుంచి, నీవు ‘ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి’ అని చెప్పేవరకూ నన్ను మళ్ళీ చూడవు.”

మత్తయి శుభవార్త — Chapters