Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:57

[1] వారు జెరుసలం దరిదాపులకు వచ్చి, ఆలీవ్‌ కొండమీద ఉన్న బేత్‌ఫగే చేరుకొన్నారు. అప్పుడు యేసు ఇద్దరు శిష్యులను పంపుతూ ఇలా అన్నాడు:

[2] “మీకు ఎదురుగా ఉన్న ఆ గ్రామానికి వెళ్ళండి. అక్కడికి చేరగానే కట్టి ఉన్న గాడిద మీకు కనబడుతుంది. దానితో గాడిదపిల్ల కూడా ఉంటుంది. వాటిని విప్పి నా దగ్గరకు తోలుకురండి.

[3] మిమ్ములను ఎవరైనా ఏదైనా అంటే, ‘ఇవి ప్రభువుకు’ అనండి. అతడు వెంటనే వాటిని పంపిస్తాడు.”

[4] ప్రవక్తద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరేలా ఇదంతా జరిగింది:

[5] సీయోనుకుమారితో ఇలా చెప్పండి: ఇడుగో, మీ రాజు మీ దగ్గరికి వస్తూ ఉన్నాడు! ఆయన వినయవంతుడై గాడిదను – గాడిదపిల్లను – ఎక్కి వస్తూ ఉన్నాడు!

[6] శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆదేశం ఇచ్చినట్టే చేశారు.

[7] ఆ గాడిదనూ గాడిద పిల్లనూ తోలుకువచ్చి, వాటిమీద తమ పైబట్టలు వేశారు. వాటిమీద ఆయనను కూర్చోబెట్టారు.

[8] చాలా గొప్ప సమూహం తమ పైబట్టలు దారిన పరిచారు. కొంతమంది చెట్లకొమ్మలు నరికి దారిన పరిచారు.

[9] జన సమూహాలు ఆయన ముందూ వెనుకా నడుస్తూ, ఇలా కేకలు వేస్తూ ఉన్నారు: “దావీదు కుమారునికి జయం! ప్రభువు పేరట వచ్చేవాడు ధన్యజీవి! పరమ స్థలాల్లో జయం!”

[10] ఆయన జెరుసలంలో ప్రవేశించినప్పుడు నగరమంతా కలవరపడిపోతూ “ఎవరు ఇతడు” అని అడిగారు.

[11] జన సమూహాలు ఇలా జవాబిచ్చారు: “ఈయన యేసు. గలలీలో ఉన్న నజరేతునుండి వచ్చిన ప్రవక్త.”

[12] యేసు దేవాలయంలోనికి వెళ్ళి, ఆలయంలో అమ్మే వాళ్ళనూ కొనేవాళ్ళనూ అందరినీ వెళ్ళగొట్టివేశాడు. డబ్బులు మారకం వ్యాపారుల బల్లలూ, గువ్వల వర్తకుల పీటలూ పడద్రోశాడు.

[13] వాళ్ళతో ఇలా అన్నాడు: “నా ఆలయం ప్రార్థన ఆలయమని అంటారు గాని మీరు దానిని దోపిడీ దొంగల గుహగా చేశారు.”

[14] దేవాలయంలో ఆయన దగ్గరికి గుడ్డివారూ కుంటివారూ వచ్చారు. ఆయన వారిని బాగు చేశాడు.

[15] ఆయన చేసిన అద్భుతాలు ప్రధాన యాజులూ ధర్మశాస్త్ర పండితులూ చూశారు. దేవాలయంలో “దావీదు కుమారునికి జయం!” అని కేకలు వేస్తున్న పిల్లలను కూడా చూశారు. అప్పుడు వారు కోపంతో మండిపడ్డారు.

[16] యేసుతో “వీళ్ళు అంటున్నది వింటున్నావా?” అన్నారు. వారితో యేసు ఇలా చెప్పాడు: “అవును. నీవు చిన్నపిల్లలనూ చంటి బిడ్డల నోట్లో స్తుతిని పరిపూర్ణం చేశావు అనే మాట మీరెన్నడూ చదవలేదా?”

[17] అప్పుడు ఆయన వారిని విడిచి, నగరం బయట బేతనీకి వెళ్ళి అక్కడ ఆ రాత్రి గడిపాడు.

[18] ప్రొద్దున నగరానికి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఆయనకు ఆకలి వేసింది.

[19] దారి ప్రక్కన అంజూరచెట్టు ఒకటి కనిపించింది. ఆయన దాని దగ్గరకు వెళ్ళి చూస్తే దానికి ఆకులు తప్ప ఇంకేమీ కనబడలేదు. ఆయన దానితో “ఇకనుంచి నీవు ఎన్నడూ కాపు కాయవు” అన్నాడు. వెంటనే ఆ అంజూరచెట్టు ఎండిపోయింది.

[20] అది చూచి శిష్యులు స్తంభించి “ఆ అంజూరచెట్టు ఒక్కసారిగా ఎలా ఎండిపోయిందో!” అన్నారు.

[21] యేసు వారికిలా జవాబిచ్చాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, దేవుని మీద మీకు నమ్మకం గనుక ఉంటే, సందేహపడకుండా ఉంటే, అంజూరచెట్టుకు చేసినది మీరు కూడా చేయగలరు. ఇదిగాక, ఈ కొండను చూచి ‘నీవు లేచి సముద్రంలో పడిపో’ అంటే అలాగే జరిగి తీరుతుంది.

[22] దొరుకుతాయని నమ్ముతూ, ప్రార్థనలో వేటిని అడుగుతారో అవన్నీ మీకు దొరుకుతాయి.”

[23] ఆయన దేవాలయంలోకి వెళ్ళి ఉపదేశిస్తూ ఉన్నప్పుడు ప్రధాన యాజులూ ప్రజల పెద్దలూ ఆయనదగ్గరికి వచ్చి, “నీవు ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నావు? ఈ అధికారం నీకెవరు ఇచ్చారు?” అని అడిగారు.

[24] యేసు వారికిలా జవాబిచ్చాడు: “నేనూ మిమ్ములను ఒక ప్రశ్న అడుగుతాను. మీరు నాకు జవాబిస్తే నేను ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది మీకు చెపుతాను.

[25] యోహాను ఇచ్చిన బాప్తిసం ఉత్పత్తి ఎక్కడ నుంచి, పరలోకం నుంచా? మనుషుల నుంచా?” వాళ్ళు చర్చలో పడి ఇలా చెప్పుకొన్నారు: “ఒకవేళ ‘పరలోకం నుంచి’ అని మనం చెపితే ఇతడు ‘అలాగైతే మీరెందుకు అతణ్ణి నమ్మలేదు?’ అంటాడు గదా!

[26] ‘మనుషుల నుంచి’ అందామా – జన సమూహానికి భయపడుతున్నాం గదా! యోహానును ఒక ప్రవక్తగా అందరూ ఎంచుతున్నారు.”

[27] అందుచేత వాళ్ళు యేసుకు “మాకు తెలియదు” అని జవాబిచ్చారు. ఆయన వాళ్ళతో “అలాగైతే ఏ అధికారంతో ఈ క్రియలు చేస్తున్నానో అది నేనూ మీకు చెప్పను” అన్నాడు.

[28] “దీన్ని గురించి మీకేమి తోస్తుంది? – ఒక మనిషికి ఇద్దరు కొడుకులు ఉన్నారు. అతడు పెద్దవాడి దగ్గరకు వచ్చి అతడితో ‘బాబూ, ఈ రోజు నీవు వెళ్ళి, నా ద్రాక్ష తోటలో పని చెయ్యి’ అన్నాడు.

[29] అతడు ‘వెళ్ళను’ అన్నాడు గాని తరువాత మనసు మార్చుకొని వెళ్ళాడు.

[30] తండ్రి రెండోవాని దగ్గరకు వెళ్ళి అదేమాట చెప్పాడు. అతడు ‘వెళ్తాను నాన్నగారు’ అన్నాడు గానీ వెళ్ళలేదు.

[31] ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్టప్రకారం చేశాడు?” వాళ్ళు ఆయనతో “మొదటివాడు” అన్నారు. యేసు వాళ్ళతో ఇలా బదులు చెప్పాడు: “మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను. మీకంటే ముందుగా సుంకంవారు, వేశ్యలు దేవుని రాజ్యంలో ప్రవేశిస్తారు.

[32] ఎందుకంటే, యోహాను న్యాయమార్గంలో మీదగ్గరకు వచ్చాడు గాని మీరు అతణ్ణి నమ్మలేదు. అయితే సుంకంవారు, వేశ్యలు అతణ్ణి నమ్మారు. అది చూచినా మీరు తరువాత పశ్చాత్తాపపడలేదు, అతణ్ణి నమ్మలేదు.

[33] “మరో ఉదాహరణ వినండి. భూస్వామి ఒకడు ద్రాక్షతోట నాటించాడు. దానిచుట్టూ గోడ కట్టించి, అందులో ద్రాక్షగానుగ తొట్టి తొలిపించి, కావలి గోపురం కట్టించాడు. అప్పుడతడు తోటను రైతులకు కౌలుకిచ్చి దూర దేశానికి వెళ్ళిపోయాడు.

[34] కోతకాలం దగ్గర పడ్డప్పుడు పంటలో తన పళ్ళు తెమ్మని తన దాసులను ఆ రైతుల దగ్గరకు పంపాడు.

[35] రైతులు అతని దాసులను పట్టుకొని, ఒకణ్ణి కొట్టారు, ఒకణ్ణి చంపారు, మరొకనిమీద రాళ్ళు రువ్వారు.

[36] అతడు మళ్ళీ వేరే దాసులను పంపాడు. మునుపటికంటే వీరు ఎక్కువమంది. అయినా రైతులు వారిని కూడా అలాగే చేశారు.

[37] చివరికి అతడు ‘నా కుమారుణ్ణి వారు గౌరవిస్తారు’ అని చెప్పి తన కుమారుణ్ణి వారి దగ్గరకు పంపాడు.

[38] కాని, కుమారుణ్ణి చూచి రైతులు తమలో ఇలా చెప్పుకొన్నారు: ‘వారసుడు వీడే! వీణ్ణి చంపి వీడి వారసత్వం తీసుకుందాం రండి!’

[39] వారు అతణ్ణి పట్టుకొని, ద్రాక్షతోట వెలుపలికి గెంటివేసి చంపారు.

[40] అందుచేత ద్రాక్షతోట యజమాని వచ్చినప్పుడు ఆ రైతులను ఏమి చేస్తాడు?”

[41] వాళ్ళు ఆయనతో, “అతడు ఆ దుర్మార్గులను నిర్దయగా నాశనం చేస్తాడు, పంటకాలాల్లో తనకు పళ్ళు ఇచ్చే వేరే రైతులకు ద్రాక్షతోటను కౌలుకిస్తాడు” అన్నారు.

[42] యేసు వాళ్ళతో అన్నాడు: “మీరు లేఖనాలలో ఈ మాట ఎన్నడూ చదవలేదా? – ‘కట్టేవారు తీసిపారవేసిన రాయే ముఖ్యమైన మూలరాయి అయింది. ఇది ప్రభువుమూలంగా జరిగింది. ఇది మా దృష్టిలో అద్భుతంగా ఉంది.’

[43] గనుక మీతో నేను చెప్పేదేమిటంటే, దేవుని రాజ్యాన్ని మీనుంచి తీసివేయడం, దాని ఫలాలు ఇచ్చే ప్రజలకు ఇవ్వడం జరుగుతుంది.

[44] ఈ బండ మీద పడేవారెవరైనా ముక్కలు చెక్కలు అవుతారు. ఇది ఎవరిమీద పడుతుందో వారు చూర్ణమై పోయేలా చేస్తుంది.”

[45] ఆయన చెప్పిన ఉదాహరణలు విని ప్రధాన యాజులూ, పరిసయ్యులూ తమ విషయమే చెప్పాడని గ్రహించారు.

[46] ఆయనను పట్టుకోవాలని చూశారు గాని జన సమూహాలకు భయపడ్డారు. ఎందుకంటే ప్రజలు ఆయనను ప్రవక్తగా ఎంచారు.

మత్తయి శుభవార్త — Chapters