Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:44

[1] పరిసయ్యులూ సద్దూకయ్యులూ యేసు దగ్గరికి వచ్చి ఆయనను పరీక్షించాలనే ఉద్దేశంతో పరలోకంనుంచి తమకు సూచనకోసం అద్భుతం ఒకటి చూపమని అడిగారు.

[2] ఆయన వారికిలా బదులు చెప్పాడు: “సాయంకాలాన ‘ఆకాశం ఎర్రగా ఉంది గనుక వాతావరణం బాగుంటుంద’ని మీరు అంటారు గదా.

[3] ప్రొద్దున ‘ఆకాశం ఎర్రగా మబ్బుగా ఉంది గనుక గాలివాన వస్తుంది’ అంటారు. కపట భక్తులారా! ఆకాశ పరిస్థితిని గుర్తించగలరు గాని ఈ కాల సూచనలను గుర్తించలేరేమిటి?

[4] సూచనకోసమైన అద్భుతం కావాలని చూచే తరం చెడ్డది, వ్యభిచారసంబంధమైనది. యోనాప్రవక్తను గురించినది తప్ప ఇంకా ఏ సూచనా ఈ తరంవారికి చూపడం జరగదు.” అప్పుడాయన వారిని విడిచి వెళ్ళిపోయాడు.

[5] ఆయన శిష్యులు అవతలి ఒడ్డుకు వచ్చినప్పుడు రొట్టెలు తెచ్చుకోవడం మరచిపోయారు.

[6] వారితో యేసు ఇలా అన్నాడు: “మీరు శ్రద్ధ కలిగి ఉండండి – పరిసయ్యులకు, సద్దూకయ్యులకు సంబంధించిన ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్తగా ఉండండి!”

[7] “మనం రొట్టెలు తేలేదు గనుక ఇలా అన్నాడు” అనుకొంటూ వారు చర్చలో పడ్డారు.

[8] అది తెలుసుకొని యేసు “అల్ప విశ్వాసం గలవారలారా, మీరు ఏమీ రొట్టెలు తీసుకురాని సంగతి ఎందుకు చర్చించుకొంటున్నారు?

[9] మీరు ఇంకా గ్రహించలేదా? ఐదు రొట్టెలు ఐదు వేలమందికి వడ్డించిన తరువాత మీరు ఎన్ని నిండు గంపలు ఎత్తారో అది జ్ఞాపకం లేదా?

[10] ఏడు రొట్టెలు నాలుగు వేలమంది విషయం మీరు ఎన్ని నిండు పెద్ద గంపలు ఎత్తారో అది కూడా గుర్తు లేదా?

[11] నేను మీతో మాట్లాడినది రొట్టెల గురించి కాదని మీకెందుకు అర్థం కాలేదు? పరిసయ్యుల, సద్దూకయ్యుల ‘పొంగజేసే పదార్థం’ గురించి జాగ్రత్త అన్నాను” అన్నాడు.

[12] పరిసయ్యుల, సద్దూకయ్యుల ఉపదేశం విషయం జాగ్రత్తగా ఉండాలని ఆయన చెప్పాడని, రొట్టెలను పొంగజేసే పదార్థం విషయం కాదని అప్పుడు వారు గ్రహించారు.

[13] సీజరియ ఫిలిప్పీ పరిసరాలకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులను ఇలా ప్రశ్నించాడు: “మానవ పుత్రుడైన నేను ఎవరినని ప్రజలు చెప్పుకొంటున్నారు?”

[14] వారు “బాప్తిసమిచ్చే యోహానువు అంటారు కొందరు. మరికొందరు ఏలీయావు, మరికొందరు యిర్మీయావు లేదా, ప్రవక్తలలో ఇంకొకడవు అంటారు” అన్నారు.

[15] “అయితే నేనెవరినని మీరు చెప్పుకొంటూ ఉన్నారు?” అని ఆయన వారినడిగాడు.

[16] “నీవు అభిషిక్తుడవే! సజీవుడైన దేవుని కుమారుడవే!” అని సీమోను పేతురు సమాధానం చెప్పాడు.

[17] యేసు అతనికిలా జవాబిచ్చాడు: “యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. ఎందుకంటే, ఈ సత్యం నీకు వెల్లడి చేసినది పరలోకంలో ఉన్న నా తండ్రి గాని రక్తం, మాంసం కాదు.

[18] ఇంకొకటి నీతో చెపుతాను. నీవు పేతురువు. ఈ బండ మీద నా సంఘాన్ని నిర్మించుకొంటాను. పాతాళ ద్వారాలు దానిని ఎదిరించి నిలవలేవు.

[19] పరలోక రాజ్యానికి తాళం చెవులు నీకిస్తాను. నీవు భూమిమీద దేన్ని బంధిస్తే అది పరలోకంలో బంధితమే. భూమిమీద దేనిని విడుదల చేస్తే దానికి పరలోకంలో విడుదలే!”

[20] అప్పుడు తాను – యేసు – అభిషిక్తుణ్ణని ఎవరికీ చెప్పకూడదని శిష్యులను ఆదేశించాడు.

[21] అప్పటినుంచి యేసు తన శిష్యులకు ఈ సంగతులు తెలియజేయడం ఆరంభించాడు: తాను జెరుసలం వెళ్ళి, పెద్దలచేత, ప్రధాన యాజులచేత, ధర్మశాస్త్ర పండితులచేత అనేక బాధలపాలై చంపబడి మూడో రోజున సజీవంగా లేపబడడం తప్పనిసరి అని.

[22] అప్పుడు పేతురు ఆయనను ఒక్కణ్ణే తీసుకువెళ్ళి మందలించసాగాడు: “ప్రభూ! దేవుడు దీనిని తప్పించాలి! నీకిలా ఎప్పటికీ జరగకూడదు” అన్నాడు.

[23] యేసు పేతురువైపు తిరిగి, అతనితో “సైతానూ! నా వెనుకకు పో! నీవు నా త్రోవలో ఆటంకంగా ఉన్నావు. మనుషుల సంగతుల మీదే గాని దేవుని సంగతుల మీద నీ మనసుండడం లేదు” అన్నాడు.

[24] అప్పుడు యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “ఎవరైనా సరే నా వెంట రావాలనుకొంటే, తనను తిరస్కరించుకొని తన సిలువ ఎత్తుకొని నన్ను అనుసరించాలి.

[25] తన కోసం ప్రాణాన్ని దక్కించుకోవాలనుకొనేవాడు దానిని పోగొట్టుకొంటాడు. కానీ నాకోసం తన ప్రాణాన్ని పోగొట్టుకొనేవాడు దానిని కనుక్కొంటాడు.

[26] ఒక మనిషి ప్రపంచమంతా సంపాదించుకొని తన ప్రాణాన్ని పోగొట్టుకొంటే అతనికి లాభమేమి? మనిషి తన ప్రాణానికి బదులు ఏమిస్తాడు?

[27] మానవ పుత్రుడు తన తండ్రి ప్రతాపంతోనూ దేవదూతలతోనూ వస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ వారి పనులప్రకారం ప్రతిఫలం ఇస్తాడు.

[28] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, ఇక్కడ నిలుచున్నవారిలో కొంతమంది, మానవ పుత్రుడు తన రాజ్యంతో రావడం చూచేవరకు చనిపోరు.”

మత్తయి శుభవార్త — Chapters