Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:38

[1] విశ్రాంతి దినం గడచిన తరువాత ఆదివారం నాడు తెల్లవారుతూ ఉండగానే మగ్దలేనే మరియ, ఆ మరో మరియ సమాధిని చూడడానికి వచ్చారు.

[2] అంతకుముందు ఒక పెద్ద భూకంపం కలిగింది. ఎందుకంటే ప్రభుదూత ఒకడు పరలోకంనుంచి దిగివచ్చి, ద్వారం నుంచి ఆ రాయి దొర్లించి దానిమీద కూర్చున్నాడు.

[3] అతడి రూపం మెరుపులాగా ఉంది, అతని వస్త్రం చలి మంచంత తెల్లగా ఉంది.

[4] అతని భయంచేత కావలివారికి వణకు పుట్టి చచ్చినంత పనైంది.

[5] దేవదూత ఆ స్త్రీలతో ఇలా అన్నాడు: “భయపడకండి! సిలువ వేయబడ్డ యేసును మీరు వెదకుతున్నారని నాకు తెలుసు.

[6] ఆయన ఇక్కడ లేడు. తాను చెప్పినట్టే ఆయన సజీవంగా లేచాడు. రండి, ప్రభువు పడుకొన్న స్థలం చూడండి.

[7] అప్పుడా దూత, త్వరగా వెళ్ళి ఆయన శిష్యులతో ‘ఆయన చనిపోయిన వారిలోనుంచి సజీవంగా లేచాడు. మీకంటే ముందుగా గలలీకి వెళ్ళబోతున్నాడు. అక్కడ మీరు ఆయనను చూస్తారు’ అని చెప్పండి. ఇదిగో, మీతో నేను ఇది చెపుతున్నాను.”

[8] వారు భయంతో, గొప్ప సంతోషంతో సమాధినుంచి త్వరగా వెళ్ళి, ఆయన శిష్యులకు ఆ విషయం చెప్పడానికి పరుగెత్తారు.

[9] వారు ఆయన శిష్యులకు ఇలా చెప్పడానికి వెళ్ళిపోతుండగా యేసు వారిని ఎదుర్కొని, “శుభం!” అన్నాడు. వారు దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకొని ఆయనను ఆరాధించారు.

[10] యేసు వారితో “భయపడకండి! వెళ్ళి నా సోదరులు గలలీకి వెళ్ళాలనీ అక్కడ వారు నన్ను చూస్తారనీ వారికి తెలియజేయండి” అన్నాడు.

[11] వారు వెళ్తూ ఉన్నప్పుడే ఆ కావలివారిలో కొందరు నగరంలోకి వెళ్ళి జరిగినదంతా ప్రధాన యాజులకు చెప్పారు.

[12] వారు పెద్దలతో సమకూడి సమాలోచన చేసినతరువాత, ఆ సైనికులకు చాలా డబ్బు ఇచ్చి ఇలా అన్నారు:

[13] “మీరు వారితో ఈ విధంగా చెప్పండి – ‘రాత్రివేళ మేము నిద్రపోతూ ఉన్నప్పుడు అతడి శిష్యులు వచ్చి అతణ్ణి ఎత్తుకు పోయారు.’

[14] ఒకవేళ ఇది అధిపతి చెవిని పడితే మేము అతడికి నచ్చచెప్పి మీకేమీ తొందర రాకుండా చేస్తాం.”

[15] వారు ఆ డబ్బు తీసుకొని తమకు ఇచ్చిన ఆదేశం ప్రకారం చేశారు. ఈ కథ యూదులలో వ్యాపిస్తూ నేటివరకు ప్రచారంలో ఉంది.

[16] పదకొండుమంది శిష్యులు గలలీకి వెళ్ళి యేసు వారికి నిర్ణయించిన కొండ చేరుకొన్నారు.

[17] ఆయనను చూచినప్పుడు వారు ఆయనను ఆరాధించారు. గానీ కొందరు సందేహించారు.

[18] యేసు దగ్గరగా వచ్చి వారితో ఇలా అన్నాడు: “పరలోకంలో భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది.

[19] కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనాలలో శిష్యులను చేయండి. తండ్రి కుమార పవిత్రాత్మల పేరట వారికి బాప్తిసం ఇవ్వండి,

[20] నేను మీకు ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ పాటించాలనీ వారికి ఉపదేశించండి. ఇదిగో, నేను ఎప్పటికీ – యుగాంతం వరకూ – మీతోకూడా ఉన్నాను.” తథాస్తు.

మత్తయి శుభవార్త — Chapters