[1] ఆ రోజునే యేసు ఇంట్లోనుంచి బయటికి వెళ్ళి సరస్సు ఒడ్డున కూర్చున్నాడు.
[2] ప్రజలు పెద్ద గుంపులుగా ఆయన చుట్టూ గుమిగూడడం చేత ఆయన ఒక పడవ ఎక్కి కూర్చున్నాడు. ప్రజలంతా ఒడ్డున నిలుచున్నారు.
[3] అప్పుడు ఆయన ఉదాహరణల రూపంలో వారికి అనేక సంగతులు చెప్పాడు: “విత్తనాలు చల్లేవాడు చల్లడానికి బయలుదేరాడు.
[4] విత్తనాలు చల్లుతూ ఉంటే, కొన్ని దారిప్రక్కన పడ్డాయి. పక్షులు వచ్చి వాటిని మ్రింగివేశాయి.
[5] మరికొన్ని విత్తనాలు మన్ను ఎక్కువగా లేని రాతి స్థలాల్లో పడ్డాయి. మన్ను లోతు లేకపోవడంచేత అవి త్వరలోనే మొలకెత్తాయి.
[6] కానీ ప్రొద్దు పొడిచినప్పుడు ఆ మొలకలు మాడిపోయాయి. వాటికి వేరులు లేకపోవడం వల్ల అవి ఎండిపోయాయి.
[7] మరికొన్ని విత్తనాలు ముండ్ల తుప్పలలో పడ్డాయి. ముండ్ల తుప్పలు పెరిగి మొక్కలను అణచిపెట్టివేశాయి.
[8] మరికొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి. అవి పంటకు వచ్చాయి. వాటిలో కొన్ని నూరు రెట్లు, కొన్ని అరవై రెట్లు, కొన్ని ముప్ఫయి రెట్లు పండాయి.
[9] వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!”
[10] శిష్యులు వచ్చి ఆయనను “వారికి ఉదాహరణల్లో ఎందుకు చెపుతున్నారు?” అని అడిగారు.
[11] ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “ఎందుకంటే పరలోక రాజ్య రహస్య సత్యాలు తెలుసుకొనే అవకాశం మీకు ఇవ్వబడింది గాని వారికి ఇవ్వబడలేదు.
[12] కలిగినవానికి ఇంకా ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది. అతనికి సమృద్ధిగా ఉంటుంది. లేనివానినుంచి అతనికి ఉన్నదానిని కూడా తీసివేయడం జరుగుతుంది.
[13] నేను వారితో ఉదాహరణల్లో చెప్పే ఉద్దేశం ఇదే: ‘వారు చూస్తూనే ఉన్నా నిజంగా చూడరు. వింటూనే ఉన్నా నిజంగా వినరు, గ్రహించరు.’
[14] యెషయా పలికిన భవిష్యద్వాక్కు వారి విషయంలో నెరవేరుతూ ఉంది. అదేమంటే, ‘మీరు ఎప్పుడూ వింటూనే ఉంటారు గాని అర్థం చేసుకోరు. ఎప్పుడూ చూస్తూనే ఉంటారు గాని గ్రహించరు.
[15] ఎందుకంటే ఈ ప్రజల హృదయం మొద్దుబారిపోయింది. వాళ్ళకు చెవికెక్కేది చాలా తక్కువ. వాళ్ళు తమ కండ్లు మూసుకొన్నారు. వాళ్ళు కండ్లతో చూచి, చెవులతో విని, హృదయాలతో అర్థం చేసుకొని నావైపు తిరిగి, నా వల్ల నివారణ పొందకుండేలా అలా చేశారు.
[16] “కానీ మీ కండ్లు చూస్తూ ఉన్నాయి గనుక అవి ధన్యం అయ్యాయి. మీ చెవులు వింటూ ఉన్నాయి గనుక అవి ధన్యం అయ్యాయి.
[17] మీతో నేను ఖచ్చితంగా చెపుతున్నాను, మీరు చూస్తున్నదానిని చూడాలనీ వింటున్నదానిని వినాలనీ అనేక మంది ప్రవక్తలూ న్యాయవంతులూ ఆశించారు గాని చూడలేకపోయారు, వినలేకపోయారు.
[18] “విత్తనాలు చల్లేవాని ఉదాహరణ భావం వినండి.
[19] పరలోక రాజ్యాన్ని గురించిన వాక్కు ఎవరైనా విని దాన్ని గ్రహించకపోతే దుర్మార్గుడు వచ్చి ఆ వ్యక్తి హృదయంలో విత్తినదానిని ఎత్తుకుపోతాడు. దారి ప్రక్కన విత్తనాలు పొందినది ఈ వ్యక్తి.
[20] రాతి స్థలాలలో విత్తనాలు పొందినది ఎవరంటే వాక్కు వినీ వినడంతోనే దానిని సంతోషంతో అంగీకరించేవాడు.
[21] కానీ అతనిలో వేరులు లేకపోవడం చేత కొద్ది కాలమే నిలిచి ఉంటాడు. వాక్కు కారణంగా కష్టాలు గానీ హింసలు గానీ కలగగానే అతడు తొట్రుపడిపోతాడు.
[22] ముండ్ల తుప్పలలో విత్తనాలు పొందినది ఎవరంటే, వాక్కు వింటాడు గాని ఇహలోక చింత, ధనం మూలమైన మోసం వాక్కును అణచి వేస్తాయి. అతడు ఫలించని వాడైపోతాడు.
[23] మంచి నేలను విత్తనాలు పొందినది ఎవరంటే – వాక్కు విని గ్రహించి ఫలవంతంగా ఉండేవాడు. కొందరు నూరు రెట్లు, కొందరు అరవై రెట్లు, మరికొందరు ముప్ఫయి రెట్లు ఫలిస్తారు.”
[24] ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “పరలోక రాజ్యం ఈ విధంగా ఉంది: ఒకతను తన పొలంలో మంచి విత్తనాలు చల్లాడు.
[25] మనుషులు నిద్రపోతూ ఉంటే, అతని పగవాడు వచ్చి గోధుమల మధ్య కలుపుమొక్కల విత్తనాలు చల్లి వెళ్ళిపోయాడు.
[26] గోధుమలు పెరిగి కంకులు వేసినప్పుడు ఆ కలుపుమొక్కలు కూడా కనిపించాయి.
[27] యజమాని దాసులు వచ్చి అతణ్ణి ఇలా అన్నారు: ‘అయ్యగారూ, మీ పొలంలో మంచి విత్తనాలు వేశారు గదా! ఈ కలుపుమొక్కలు ఉండడం ఎలా?’
[28] అతడు వారితో అన్నాడు ‘ఇది పగవాడు చేసిన పని.’ దాసులు, ‘మమ్మల్ని వెళ్ళి ఆ కలుపు మొక్కలు పీకెయ్యమంటారా?’ అని అతణ్ణి అడిగారు.
[29] అందుకతడు ‘వద్దు, కలుపు మొక్కలు పీకివేసేటప్పుడు వాటితోకూడా గోధుమ మొక్కలు పెళ్ళగిస్తారేమో.
[30] కోతకాలం వరకు రెంటినీ కలిసి పెరగనివ్వండి. కోతకాలంలో నేను కోతవారికి చెపుతాను, ‘ముందుగా కలుపు మొక్కలు పోగుచేసి కాల్చివేయడానికి కట్టలు కట్టండి. అప్పుడు గోధుమలు నా గిడ్డంగిలో చేర్చండి’ అన్నాడు.”
[31] ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒకతను తన పొలంలో ఒక ఆవగింజ నాటాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.
[32] గింజలన్నిట్లో ఆవగింజ చిన్నది. అయితే అది పెరిగినప్పుడు కూరమొక్కలన్నిటినీ మించి చెట్టు అవుతుంది. గాలిలో ఎగిరే పక్షులు వచ్చి దాని కొమ్మల్లో గూళ్ళు కట్టుకుంటాయి.”
[33] ఆయన వారికి మరో ఉదాహరణ చెప్పాడు – “ఒక స్త్రీ మూడు మానికల పిండిలో పొంగజేసే పదార్థం దాచి పెట్టింది. దాని వల్ల పిండి అంతట్లో పొంగజేసే పదార్థం వ్యాపించింది. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.”
[34] ఈ సంగతులన్నీ యేసు ఉదాహరణల్లో జనసమూహానికి చెప్పాడు. ఉదాహరణ లేకుండా వారికి ఏమీ చెప్పలేదు.
[35] ప్రవక్త ద్వారా దేవుడు చెప్పిన ఈ మాట నెరవేరాలని అలా చెప్పాడు: నోరార నేను ఉదాహరణలు చెపుతాను. లోక సృష్టి నాటినుంచి రహస్యంగా ఉంచబడిన విషయాలు పలుకుతాను.
[36] అప్పుడు యేసు జన సమూహాన్ని పంపివేసి ఇంట్లోకి వెళ్ళాడు. ఆయన శిష్యులు ఆయన దగ్గరికి వచ్చి, “పొలంలో ఉన్న కలుపు మొక్కల ఉదాహరణ మాకు వివరించండి” అని చెప్పారు.
[37] ఆయన వారికి జవాబిస్తూ ఇలా అన్నాడు: “మంచి విత్తనాలు చల్లేది మానవ పుత్రుడు.
[38] పొలం ఈ లోకం. మంచి విత్తనాలు పరలోక రాజ్యానికి చెందినవారు. కలుపు మొక్కలు దుర్మార్గుడికి చెందినవారు.
[39] వారిని చల్లే ఆ పగవాడు అపనింద పిశాచం. కోతకాలం ఈ యుగ సమాప్తి. ఆ కోత కోసేవారు దేవదూతలు.
[40] కలుపు మొక్కలను పోగుచేసి అగ్నిలో కాల్చినట్టే ఈ యుగాంతంలో జరుగుతుంది.
[41] మానవ పుత్రుడు తన దేవదూతలను పంపుతాడు. వారు తొట్రుపాటుకు కారణమైన ప్రతిదానినీ, దుర్మార్గం చేసేవారందరినీ ఆయన రాజ్యంలోనుంచి పోగుచేస్తారు.
[42] వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
[43] అప్పుడు న్యాయవంతులు తమ తండ్రి రాజ్యంలో సూర్యమండలం లాగా ప్రకాశిస్తారు. వినడానికి చెవులున్నవాడు వింటాడు గాక!
[44] “మరొకటి – పరలోక రాజ్యం పొలంలో దాచిపెట్టిన నిధిలాంటిది. ఒక మనిషి దానిని కనుక్కొని అలాగే దాచివేశాడు. అప్పుడు దొరికిందనే సంతోషంతో వెళ్ళి తనకున్నదంతా అమ్మివేసి ఆ పొలం కొనుక్కొన్నాడు.
[45] “మరొకటి – వర్తకుడు మంచి ముత్యాలకోసం వెదుకుతూ వచ్చాడు.
[46] చాలా విలువైన ముత్యం ఒకటి కనబడగానే అతడు వెళ్ళి తనకున్నది అంతా అమ్మివేసి ఆ ముత్యం కొనుక్కొన్నాడు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.
[47] “ఇంకొకటి – వల సరస్సులో వేసి ఉంది. దానిలో అన్ని రకాల చేపలు పడ్డాయి.
[48] వల నిండినతరువాత దానిని ఒడ్డుకు లాగారు. కూర్చుని మంచి చేపలు బుట్టల్లో వేసుకొన్నారు, పనికిమాలినవి అవతల పారవేశారు. పరలోక రాజ్యం ఆ విధంగా ఉంది.
[49] ఈ యుగ సమాప్తిలో అలాగే జరుగుతుంది. దేవదూతలు వచ్చి, న్యాయవంతుల మధ్యనుంచి చెడ్డవారిని వేరుపరుస్తారు.
[50] వారిని అగ్నిగుండంలో పారవేస్తారు. అక్కడ ఏడుపు, పళ్ళు కొరుక్కోవడం ఉంటాయి.
[51] “మీరు ఇవన్నీ గ్రహించారా?” అని ఆయన వారిని అడిగినప్పుడు వారు “అవును, ప్రభూ” అన్నారు.
[52] ఆయన వారితో అన్నాడు, “ఇంటి యజమాని తన నిధిలోనుంచి పాతవీ క్రొత్తవీ తెస్తాడు. పరలోక రాజ్యాన్ని గురించిన ఉపదేశం నేర్చుకొన్న ప్రతి ధర్మశాస్త్ర పండితుడూ అలాంటివాడే.”
[53] యేసు ఈ ఉదాహరణలు చెప్పడం ముగించాక అక్కడ నుంచి వెళ్ళిపోయాడు.
[54] తన స్వగ్రామం చేరి, సమాజ కేంద్రంలో వారికి ఉపదేశించాడు. వారు చాలా ఆశ్చర్యపడి “ఈ జ్ఞానం, అద్భుతాలు చేసే ఈ సామర్థ్యం ఇతడికి ఎక్కడనుంచి వచ్చాయి?
[55] ఇతడు వడ్రంగి కొడుకే గదా! ఇతడి తల్లి పేరు మరియ కాదా. యాకోబు, యోసె, సీమోను, యూదా ఇతడి తమ్ముళ్ళేగా.
[56] ఇకపోతే ఇతడి చెల్లెళ్ళంతా మనమధ్యే ఉన్నారు గదా. ఇతడికి ఇవన్నీ ఎక్కడనుంచి వచ్చాయి?” అని చెప్పుకొన్నారు.
[57] ఇలా వారు ఆయనలో అభ్యంతర కారణం కనుక్కొన్నారు. అయితే యేసు వారితో ఇలా అన్నాడు: “ప్రవక్త తన స్వగ్రామంలో, సొంత ఇంట్లో తప్ప మరెక్కడా గౌరవహీనుడు కాడు.”
[58] తనమీద వారికి నమ్మకం లేకపోవడం చేత ఆయన అనేక అద్భుతాలు అక్కడ చేయలేదు.