Skip to content
Opens in a new window

[1] సిద్కియా పరిపాలిస్తున్న తొమ్మిదో ఏట, పదో నెల, పదోరోజున బబులోను రాజైన నెబుకద్‌నెజరు తన సైన్యమంతటితో జెరుసలం మీదికి వచ్చాడు. వాళ్ళు దానిని చుట్టుముట్టారు. దాని చుట్టూరా ముట్టడి దిబ్బ కట్టారు.

[2] సిద్కియా రాజు పరిపాలనలో పదకొండో సంవత్సరం వరకు వాళ్ళు నగరాన్ని ముట్టడిస్తూనే ఉన్నారు.

[3] ఆ సంవత్సరం నాలుగో నెల తొమ్మిదో రోజున నగరంలో కరవు తీవ్రంగా ఉన్నప్పుడు నగర ప్రాకారాలలో రంధ్రాలు చేయడం జరిగింది.

[4] కల్దీయవాళ్ళు నగరం చుట్టూ ఉన్నా, రాజూ సైనికులందరూ రాత్రివేళ రాజు తోట దగ్గర ఉన్న రెండు గోడల మధ్య ఉన్న ద్వారం గుండా పారిపోయాడు. రాజు అరాబా లోయ వైపుకు వెళ్ళాడు.

[5] అయితే కల్దీయవాళ్ళు రాజు వెంటబడి అతణ్ణి యెరికో మైదానాల ప్రాంతంలో పట్టుకొన్నారు. అతడి సైన్యం అతడి దగ్గరనుంచి చెల్లాచెదురు అయ్యారు.

[6] రాజును పట్టుకొని వాళ్ళు రిబ్లాలో ఉన్న బబులోను రాజు దగ్గరికి తీసుకువచ్చారు. బబులోను రాజు అతడికి శిక్ష విధించాడు.

[7] వాళ్ళు సిద్కియా కొడుకులను అతడి కళ్ళెదుటే వధించారు. అప్పుడు సిద్కియా కళ్ళు ఊడపెరికారు. తరువాత అతణ్ణి కంచు సంకెళ్ళతో బంధించి బబులోనుకు తీసుకువెళ్ళారు.

[8] ఆ సంవత్సరంలోనే అయిదో నెల ఏడో రోజున (బబులోను రాజైన నెబుకద్నెజర్ పరిపాలిస్తున్న పందొమ్మిదో సంవత్సరం) బబులోను రాజు సేవకుడూ రక్షక భటుల అధిపతీ అయిన నెబూజరదాను జెరుసలంకు వచ్చాడు.

[9] అతడు యెహోవా ఆలయాన్నీ రాజభవనాన్నీ జెరుసలంలోని భవనాలన్నిటినీ తగలబెట్టించాడు.

[10] రక్షక భటుల నాయకుడితోపాటు వచ్చిన కల్దీయవాళ్ళ సైనికులు జెరుసలం చుట్టు ఉన్న ప్రాకారాలను పడగొట్టారు.

[11] ఆ తరువాత నగరంలో మిగిలినవారినీ, బబులోను రాజు పక్షం చేరిన వారినీ, మిగతా సామాన్య ప్రజలనూ రక్షకభటుల అధిపతి అయిన నెబూజరదాను బందీలుగా తీసుకుపోయారు.

[12] అయితే అతడు ద్రాక్షతోటలలో పని చేయడానికీ సేద్యం చేయడానికీ దేశంలోని అతి బీదవారిలోను కొంతమందిని ఉండనిచ్చాడు.

[13] కల్దీయవాళ్ళు యెహోవా ఆలయంలో ఉన్న కంచు వస్తువులను ముక్కలు చేసి, కంచు స్తంభాలనూ పీటలనూ కంచు సరస్సునూ బబులోనుకు తీసుకుపోయారు.

[14] ఆలయం సేవకు ఉపయోగించే కుండలనూ పెద్దపెద్ద గరిటెలనూ కత్తెరలనూ ధూపార్తులనూ కంచు పాత్రలన్నిటినీ కూడా తీసుకుపోయారు.

[15] నిప్పు తెచ్చే పాత్రలనూ బంగారంతో గానీ వెండితో గానీ చేసిన పాత్రలన్నిటినీ కూడా రక్షకభటుల అధిపతి తీసుకుపోయాడు.

[16] యెహోవా ఆలయంకోసం సొలొమోను చేయించిన కంచు పాత్రలన్నీ, ఆ రెండు కంచు స్తంభాలు, ఆ కంచు సరస్సు, ఆ కంచు పీటల బరువు చూడడానికి వీలు లేకుండా ఉంది.

[17] ఒక్కొక్క స్తంభం ఎత్తు పద్ధెనిమిది మూరలు. ఆ స్తంభాల మీద ఉన్న పీటలు కూడా కంచుతో చేసినవి. ఆ పీటల ఎత్తు మూడు మూరలు. ఆ పీటల చుట్టు అల్లిక పని, దానిమ్మ పండ్లు కూడా కంచువి. రెండు స్తంభాలు అలాగే ఉన్నాయి.

[18] రక్షకభటుల అధిపతి ప్రముఖయాజి అయిన శెరాయానూ రెండో యాజి అయిన జెఫన్యానూ ముగ్గురు ద్వారపాలకులనూ పట్టుకొన్నాడు.

[19] సైనికుల అధికారినీ, నగరంలో కనిపించిన రాజు మిత్రులను అయిదుగురినీ, మనుషులను సైన్యంలో చేర్చే అధిపతి యొక్క లేఖకుణ్ణీ, దేశప్రజలలో అరవైమందినీ కూడా నగరం నుండి తీసుకుపోయాడు.

[20] రక్షకభటుల అధిపతి అయిన నెబూజరదాను వారిని ఖైదీలుగా రిబ్లాలో ఉన్న బబులోను రాజుదగ్గరికి తీసుకుపోయాడు.

[21] బబులోను రాజు హమాతు ప్రాంతంలో రిబ్లాలోనే వారిని కూలగొట్టి చంపాడు. ఈ విధంగా యూదా ప్రజలు వారి దేశం నుంచి బందీలుగా తీసుకుపోవడం జరిగింది.

[22] అయితే బబులోను రాజు నెబుకద్‌నెజరు యూదాదేశంలో కొంతమందిని ఉండనిచ్చాడు. వారిమీద అతడు అహీకాం కొడుకూ షాఫాను మనుమడూ అయిన గెదల్యాను అధికారిగా నియమించాడు.

[23] బబులోను రాజు గెదల్యాను నియమించాడని యూదా సైన్యంలో మిగిలిన అధిపతులకూ సైనికులకూ వినవచ్చింది. అప్పుడు వాళ్ళు మిస్పాలో ఉన్న గెదల్యా దగ్గరికి వచ్చారు. ఆ అధిపతులు నెతన్యా కొడుకైన ఇష్మాయేల్, కారేహ కొడుకైన యోహానాను, నెటోపాతివాడైన తనహుమెతు కొడుకైన శెరాయా, మాయాకాతివాళ్ళలో ఒకడి కొడుకైన యజన్యా. వాళ్ళూ వాళ్ళ సైనికులంతా గెదల్యా దగ్గరికి వచ్చారు.

[24] గెదల్యా వాళ్ళతో శపథం చేశాడు – “కల్దీయవాళ్ళ అధికారులకు మీరు భయపడకండి. దేశంలో ఉండండి. మీరు బబులోను రాజుకు సేవ చేస్తూ ఉంటే మీకు క్షేమంగా ఉంటుంది” అన్నాడు.

[25] అయితే ఏడో నెలలో ఎలీషామా మనుమడూ నెతన్యా కొడుకూ అయిన ఇష్మాయేల్ పదిమంది మనుషులను వెంటబెట్టుకొని గెదల్యా దగ్గరికి వచ్చి అతణ్ణి హతం చేశాడు. మిస్పాలో గెదల్యాతో ఉన్న యూదావారినీ కల్దీయవాళ్ళనూ కూడా చంపాడు. ఈ ఇష్మాయేల్ రాజవంశంలో పుట్టినవాడు.

[26] అప్పుడు ప్రజలంతా – ఘనులేమి, అల్పులేమి – సైనికుల అధిపతులు కల్దీయవాళ్ళకు భయపడి లేచి ఈజిప్ట్‌కు పారిపోయారు.

[27] యూదా రాజైన యెహోయాకీను ఖైదులో ఉన్న ముప్ఫయి ఏడో ఏట పన్నెండో నెల ఇరవై ఏడో రోజున బబులోను రాజైన ఎవీల్‌మెరోదక్ అతణ్ణి ఖైదు నుంచి విడిపించాడు. ఎవీల్‌మెరోదక్ ఆ సంవత్సరంలోనే రాజయ్యాడు.

[28] అతడు యెహోయాకీనుతో దయగా మాట్లాడాడు. బబులోనులో తనతో ఉన్న ఇతర రాజుల ఆసనాలకంటే గౌరవనీయమైన ఆసనాన్ని అతడికిచ్చాడు.

[29] యెహోయాకీను ఖైదు బట్టలు తీసివేసి వేరే వస్త్రాలు ధరించుకొని తాను బ్రతికి ఉన్నంతకాలం బబులోను రాజు బల్ల దగ్గర భోజనం చేశాడు.

[30] అతడు బ్రతికి ఉన్నంతవరకు రాజు ప్రతి రోజూ క్రమంగా అతడికి బత్తెం ఇచ్చేవాడు.

2 రాజులు — Chapters