Skip to content
Opens in a new window

[1] మనష్షే రాజయినప్పుడు అతడి వయస్సు పన్నెండేళ్ళు. అతడు జెరుసలంలో యాభై అయిదు సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు హెఫ్సిబా.

[2] అతడు యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు. ఇస్రాయేల్ ప్రజల ముందునుంచి యెహోవా వెళ్ళగొట్టిన జనాల మాదిరి అనుసరించి నీచ కార్యాలు చేసేవాడు.

[3] తన తండ్రి హిజ్కియా పడగొట్టిన ఎత్తయిన పూజా స్థలాలను అతడు తిరిగి కట్టించాడు. ఇస్రాయేల్ రాజైన అహాబు చేసినట్టు అతడు బయల్‌దేవుడి బలిపీఠాలను కట్టించాడు, అషేరాదేవి స్తంభాన్ని నిలిపాడు, సూర్యచంద్ర నక్షత్రాల సమూహాన్ని పూజించి కొలిచాడు.

[4] యెహోవా తన ఆలయం ఉద్దేశించి “జెరుసలంలో నా పేరు ఉంచుతాన”ని చెప్పాడు. మనష్షే ఆ ఆలయంలో కూడా అలాంటి బలిపీఠాలు కట్టించాడు.

[5] యెహోవా ఆలయం రెండు ఆవరణాలలో సూర్యచంద్ర నక్షత్రాల సమూహానికి బలిపీఠాలను కట్టించాడు.

[6] తన కొడుకును మంటలద్వారా దాటించాడు. మంత్రవిద్య ప్రయోగించాడు. శకునాలు చూడడం అభ్యాసం చేసుకొన్నాడు. పూనకం వచ్చి పలికేవాళ్ళతోను సోదెగాండ్రతోను కలిసి మెలిసి ఉన్నాడు. అతడు యెహోవా దృష్టిలో చాలా చెడుతనం జరిగిస్తూ, యెహోవాకు కోపం రెచ్చగొట్టాడు.

[7] యెహోవా తన ఆలయాన్ని గురించి దావీదుకూ అతడి కొడుకైన సొలొమోనుకూ “ఇస్రాయేల్ గోత్రాలన్నిటిలో నేను ఎన్నుకొన్న జెరుసలంలో, ఈ దేవాలయంలో నా పేరు ఎప్పుడూ ఉంచుతాను” అని చెప్పాడు. ఆ దేవాలయంలో కూడా మనష్షే అషేరాదేవి స్తంభాన్ని చేయించి ఉంచాడు.

[8] యెహోవా “నేను ఇస్రాయేల్ ప్రజలకు ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, నా సేవకుడైన మోషే వారికి ఆదేశించిన ధర్మశాస్త్రం ప్రకారం వారు ప్రవర్తిస్తూ ఉంటే నేను వారి పూర్వీకులకు ఇచ్చిన ఈ దేశంనుంచి వారిని వెళ్ళగొట్టను” అన్నాడు.

[9] అయితే వారు ఆ మాట వినలేదు. ఇస్రాయేల్ ప్రజల ముందునుంచి యెహోవా నాశనం చేసిన జనాలకంటే ఎక్కువ చెడుగు చేయడానికి మనష్షే వారిని పురికొల్పాడు.

[10] యెహోవా తన సేవకులైన ప్రవక్తలచేత ఇలా మాట్లాడించాడు:

[11] “యూదా రాజైన మనష్షే ఈ అసహ్య కార్యాలు జరిగించాడు. అతడికంటే ముందు ఉన్న అమోరీవాళ్ళను మించి చెడుగు చేశాడు. అతడు నిలిపిన విగ్రహాలతో యూదా ప్రజలను తప్పుదారి పట్టించాడు.

[12] గనుక ఇస్రాయేల్ ప్రజల దేవుడైన యెహోవా అనే నేను యూదా మీదికీ జెరుసలం మీదికీ విపత్తు రప్పిస్తాను. ఆ విపత్తును గురించి విన్నవాళ్ళ రెండు చెవులు గింగురుమంటాయి.

[13] నేను షోమ్రోనునూ అహాబు రాజవంశాన్నీ కొలత తీసుకొన్నట్టు జెరుసలం నగరాన్ని చేస్తాను. ఒక మనిషి గిన్నె తుడిచి బోర్లించినట్టు నేను జెరుసలంను తుడిచివేస్తాను.

[14] వారసత్వంగా ఉన్న నా ప్రజల్లో మిగిలినవారిని చెయ్యి విడిచి వారి శత్రువుల చేతికి అప్పగిస్తాను.

[15] వారి పూర్వీకులు ఈజిప్ట్ నుంచి వచ్చిన ఆ రోజునుంచి ఈ రోజువరకు వారు నా దృష్టిలో చెడ్డగా ప్రవర్తిస్తూ నాకు కోపం రేపారు. అందుకనే వారు వారి శత్రువులందరికీ కొల్లగా దోపిడీసొమ్ముగా ఉంటారు.”

[16] యూదా ప్రజ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేలా మనష్షే వారిని తప్పుదారి పట్టించడమే గాక, చాలామంది నిరపరాధుల రక్తాన్ని ఒలికించాడు. జెరుసలం ఆ చివరనుంచి ఈ చివరవరకు రక్తంతో నిండింది.

[17] మనష్షేను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ, అతడు చేసిన పాపాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[18] మనష్షే కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. ఉజ్జా అనే తోటలో – అతడి భవనం తోటలో – అతణ్ణి సమాధి చేశారు. అతడి స్థానంలో అతడి కొడుకు ఆమోను రాజయ్యాడు.

[19] ఆమోను రాజయినప్పుడు అతడి వయసు ఇరవై రెండేళ్ళు. అతడు జెరుసలంలో రెండేళ్ళు పరిపాలించాడు అతడి తల్లి పేరు మెషుల్లేమెత్. ఆమె యొట్బ గ్రామస్థుడైన హారూసు కూతురు.

[20] తన తండ్రి మనష్షే లాగే ఆమోను యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

[21] అతడు తన తండ్రి కొలిచిన విగ్రహాలను అతడూ కొలిచి పూజించేవాడు.

[22] అతడు తన పూర్వీకుల దేవుడు యెహోవాను విడిచి పెట్టాడు, ఆయన మార్గంలో నడుచుకోలేదు.

[23] ఆమోను సేవకులు అతడి మీద కుట్ర చేసి అతడి సొంత భవనంలోనే అతణ్ణి చంపారు.

[24] అప్పుడు యూదా దేశప్రజలు ఆమోనురాజు మీద కుట్ర చేసినవాళ్ళను హతమార్చారు. అతడి స్థానంలో అతడి కొడుకు యోషీయాను రాజుగా చేశారు.

[25] ఆమోనును గురించిన ఇతర విషయాలు యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[26] వారు అతణ్ణి ఉజ్జా తోటలో అతడి సమాధిలో పాతిపెట్టారు. అతడి స్థానంలో అతడి కొడుకు యోషీయా రాజయ్యాడు.

2 రాజులు — Chapters