Skip to content
Opens in a new window

[1] యెహోయాకీం రోజుల్లో బబులోను రాజైన నెబుకద్‌నెజరు జెరుసలం మీదికి వచ్చాడు. మూడేళ్ళు యెహోయాకీం అతడికి లొంగి ఉన్నాడు. తరువాత అతడి మీద తిరుగుబాటు చేశాడు.

[2] అయితే యూదా రాజ్యాన్ని నాశనం చేయడానికి యెహోవా దానిమీదికి కల్దీయవాళ్ళ సేనాంగాన్నీ, సిరియనుల, మోయాబువాళ్ళ, అమ్మోనువాళ్ళ సేనాంగాలనూ పంపించాడు. ఇది యెహోవా తన సేవకులైన ప్రవక్తలద్వారా చెప్పినట్టు జరిగింది.

[3] యూదామీదికి వచ్చినదంతా యెహోవా ఆజ్ఞప్రకారమే వచ్చింది. మనష్షే చేసిన పాపాలన్నిటి కారణంగా, అతడు ఒలికించిన నిరపరాధుల రక్తం కారణంగా యూదాప్రజలను తన సముఖంలో లేకుండా చేయాలని యెహోవా సంకల్పించాడు.

[4] మనష్షే నిరపరాధుల రక్తంతో జెరుసలం నింపాడు. అది క్షమించడానికి యెహోవా ఇష్టపడలేదు.

[5] యెహోయాకీంను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[6] యెహోయాకీం కన్ను మూసి అతడి పూర్వీకుల దగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోయాకీను రాజయ్యాడు.

[7] ఆ రోజుల్లో ఈజిప్ట్‌వాగు నుంచి యూఫ్రటీసునది వరకు ఈజిప్ట్ రాజు వశంలో ఉన్న ప్రదేశాలన్నిటినీ బబులోను రాజు స్వాధీనం చేసుకొన్నాడు. గనుక ఈజిప్ట్ రాజు తన సొంత దేశంలోనే ఉండిపోయాడు.

[8] యెహోయాకీను రాజయినప్పుడు పద్ధెనిమిదేళ్ళవాడు. అతడు జెరుసలంలో మూడు నెలలు పరిపాలించాడు. జెరుసలం నగరవాసి ఎల్నాతాను కూతురు నెహుష్తా అతడి తల్లి.

[9] అతడి తండ్రి చేసినట్టే అతడూ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

[10] అతడి కాలంలో బబులోను రాజైన నెబుకద్‌నెజరు సైన్యం జెరుసలంమీదికి వచ్చి దానిని ముట్టడి వేసింది.

[11] వాళ్ళు నగరాన్ని ముట్టడిస్తూ ఉంటే బబులోను రాజైన నెబుకద్‌నెజర్ తానే దానిమీదికి వచ్చాడు.

[12] యూదా రాజు యెహోయాకీను, అతడి తల్లి, అతడి పరివారం, అతడి క్రింద అధిపతులు, రాజభవన అధికారులు, నగరం వెలుపల బబులోను రాజు దగ్గరికి వెళ్ళి అతడికి అధీనులయ్యారు. బబులోను రాజు పరిపాలిస్తున్న ఎనిమిదో సంవత్సరంలో యెహోయాకీనును ఖైదీగా చేశాడు.

[13] అప్పుడతడు యెహోవా ఆలయంలో నుంచీ రాజభవనంలో నుంచీ విలువైన వస్తువులన్నిటినీ బయటికి తెప్పించాడు. ఇస్రాయేల్ రాజైన సొలొమోను యెహోవా ఆలయంకోసం చేయించిన బంగారు పాత్రలన్నిటినీ బబులోను రాజు ముక్కలు చేశాడు. ఈ విషయం యెహోవా అంతకుముందే తెలియజెప్పాడు.

[14] బబులోను రాజు జెరుసలం నగరవాసులందరినీ ఖైదీలుగా తీసుకువెళ్ళాడు. వారిలో పది వేలమంది అధికారులూ యుద్ధవీరులూ ఉన్నారు. జెరుసలంలో ఉన్న కంసాలి వారందరినీ కమ్మరివారందరినీ కూడా తీసుకువెళ్ళాడు. దేశప్రజలలో దీనావస్థలో ఉన్న బీదలు మాత్రమే మిగిలారు.

[15] అతడు యెహోయాకీనును బబులోనుకు తీసుకుపోయాడు. రాజు తల్లినీ రాజు భార్యలనూ రాజభవన అధికారులనూ దేశంలో ఉన్న ప్రముఖులనూ దేశభ్రష్టులను చేసి జెరుసలంనుంచి బబులోనుకు తీసుకుపోయాడు.

[16] జెరుసలంలో యుద్ధంలో ఆరితేరిన బలాఢ్యులైన పరాక్రమవంతులందరూ ఏడు వేలమంది. కంసాలివారు, కమ్మరివారు వెయ్యిమంది. బబులోను రాజు వారిని బందీలుగా బబులోనుకు తీసుకువెళ్ళాడు.

[17] బబులోనురాజు యెహోయాకీను పినతండ్రి అయిన మత్తన్యాను అతడి స్థానంలో రాజుగా చేశాడు. అతడికి సిద్కియా అనే వేరే పేరు పెట్టారు.

[18] సిద్కియా రాజయినప్పుడు అతడి వయసు ఇరవైయొక్క సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదకొండు సంవత్సరాలు పరిపాలించాడు. లిబ్నా పట్టణస్థుడైన యిర్మీయా కూతురు హమూటల్ అతడి తల్లి.

[19] యెహోయాకీం చేసినట్టే అతడూ యెహోవా దృష్టిలో చెడ్డగా ప్రవర్తించేవాడు.

[20] తరువాత సిద్కియా బబులోను మీద తిరుగుబాటు చేశాడు. యెహోవా జెరుసలంవారినీ యూదావారినీ తన సముఖం నుంచి వెళ్ళగొట్టేవరకూ అక్కడ ఇదంతా జరగాలని యెహోవా ఆగ్రహంతో సంకల్పించాడు.

2 రాజులు — Chapters