Skip to content
Opens in a new window

[1] రెమల్యా కొడుకు పెకహు పరిపాలిస్తున్న పదిహేడో సంవత్సరంలో యూదా రాజైన యోతాం కొడుకు ఆహాజు రాజయ్యాడు.

[2] అప్పుడు ఆహాజు వయస్సు ఇరవై సంవత్సరాలు. అతడు జెరుసలంలో పదహారు సంవత్సరాలు పరిపాలించాడు. అతడు తన పూర్వీకుడు దావీదులాగా ప్రవర్తించలేదు. యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు కాడు.

[3] ఇస్రాయేల్‌రాజుల విధానమే అతడు అనుసరించేవాడు. ఇస్రాయేల్‌ప్రజల ముందు నుంచి యెహోవా ఏ జనాలైతే వెళ్ళగొట్టాడో ఆ జనాల నీచమైన అలవాట్లప్రకారం చేసి తన కొడుకును మంటల ద్వారా దాటించాడు.

[4] ఎత్తయిన పూజా స్థలాలమీద, కొండలమీద, పచ్చని ప్రతి చెట్టు క్రింద బలులు అర్పిస్తూ, ధూపం వేస్తూ ఉండేవాడు.

[5] అప్పుడు సిరియారాజు రెజీను, ఇస్రాయేల్ రాజూ రెమల్యా కొడుకూ అయిన పెకహు జెరుసలంమీదికి యుద్ధానికి వచ్చారు. వాళ్ళు ఆహాజును ముట్టడించారు గానీ అతణ్ణి జయించలేకపోయారు.

[6] (ఆ సమయంలోనే సిరియా రాజు రెజీను సిరియా కోసం ఏలతును మళ్ళీ పట్టుకొని దానిలో నుంచి యూదా వారిని వెళ్ళగొట్టాడు. సిరియావాళ్ళు వచ్చి ఏలతులో నివసించారు. ఈ నాటికీ వాళ్ళు అక్కడ ఉన్నారు.)

[7] అప్పుడు ఆహాజు వార్తాహరులచేత అష్షూరు రాజు తిగ్లత్‌పిలేసెరుకు ఈ కబురు పంపించాడు: “నేను మీ దాసుణ్ణి, మీ కొడుకును. సిరియా రాజూ ఇస్రాయేల్ రాజూ నామీదికి యుద్ధానికి వచ్చారు. మీరు వచ్చి వాళ్ళ చేతిలో నుంచి నన్ను రక్షించండి.”

[8] ఆహాజు యెహోవా ఆలయంలో, రాజభవనం ఖజానాలో కనిపించిన వెండి బంగారాలు అష్షూరు రాజుకు కానుకగా పంపించాడు.

[9] అష్షూరు రాజు అతడి మాట అంగీకరించాడు. దమస్కుమీద దండెత్తి దానిని పట్టుకొని రెజీనును చంపాడు. దమస్కు నగరవాసులను కీర్‌కు బందీలుగా తీసుకువెళ్ళాడు.

[10] ఆహాజురాజు అష్షూరు రాజైన తిగ్లత్‌పిలేసరును కలుసుకోవడానికి దమస్కుకు వెళ్ళాడు. దమస్కులో బలిపీఠం ఒకదానిని చూశాడు. ఆహాజురాజు ఆ బలిపీఠం నమూనా, దాని పనితనం వివరాలన్నీ యాజి అయిన ఊరియాకు పంపాడు.

[11] ఆహాజురాజు దమస్కునుంచి పంపిన నమూనాప్రకారమే, అతడు అక్కడనుంచి వచ్చేముందే ఊరియాయాజి ఒక బలిపీఠం నిర్మించాడు.

[12] రాజు దమస్కునుంచి తిరిగి వచ్చి ఆ బలిపీఠం చూశాడు. దానిని సమీపించి ఎక్కాడు.

[13] దాని మీద హోమాలూ నైవేద్యాలూ అర్పించాడు, పానార్పణ పోశాడు, శాంతిబలి రక్తం చల్లాడు.

[14] యెహోవా సముఖంలో ఉన్న కంచు బలిపీఠాన్ని ఆలయం ముందునుంచి తీయించాడు. అది తాను కట్టించిన బలిపీఠానికీ యెహోవా ఆలయానికీ మధ్య ఉంది. ఆ బలిపీఠాన్ని తాను కట్టించిన బలిపీఠానికి ఉత్తరంవైపున ఉంచాడు.

[15] ఆహాజురాజు ఊరియాను ఇలా ఆదేశించాడు: “ఈ పెద్ద బలిపీఠం మీద ఉదయం అర్పించే హోమబలులూ సాయంకాలం అర్పించే నైవేద్యాలూ కాల్చు. రాజు చేసే హోమబలులూ నైవేద్యాలూ కూడా ఈ బలిపీఠం మీద కాల్చు. వారి పానార్పణలు దీనిమీద పోయాలి, హోమాలు, బలిపశువుల రక్తమంతా దీనిమీద చల్లాలి. నేను దేవుని దగ్గర విచారణ చేయడానికి కంచు బలిపీఠం ఉండాలి.”

[16] ఆహాజురాజు ఆజ్ఞాపించినట్టెల్లా ఊరియాయాజి చేశాడు.

[17] పీఠాలనుంచి గంగాళాలను, పీఠాలకున్న ప్రక్క పలకలను ఆహాజురాజు తీయించాడు. కంచు ఎద్దుల మీద నుంచి సరస్సును దింపించి, అక్కడ పరచిన రాళ్ళమీద ఉంచాడు.

[18] విశ్రాంతిదిన ఆచరణ కోసం కట్టిన మంటపాలను, రాజు వచ్చే ద్వారాన్ని యెహోవా ఆలయంనుంచి ఆహాజు తీయించాడు. ఇది అష్షూరు రాజు కారణంగా జరిగింది.

[19] ఆహాజును గురించిన ఇతర విషయాలు, అతడు చేసినది యూదా రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.

[20] ఆహాజు కన్ను మూసి అతడి పూర్వీకులదగ్గరికి చేరాడు. అతడి పూర్వీకుల దగ్గర దావీదునగరంలో సమాధి అయ్యాడు. అతడి స్థానంలో అతడి కొడుకు హిజ్కియా రాజయ్యాడు.

2 రాజులు — Chapters