[1] అహాబు సంతానం డెబ్భైమంది షోమ్రోనులో ఉన్నారు. యెహూ లేఖలు వ్రాసి షోమ్రోనులో ఉన్న యెజ్రేల్ అధిపతులకూ నగరం పెద్దలకూ అహాబు సంతతివాళ్ళ సంరక్షకులకూ పంపాడు. ఆ లేఖలలో ఇలా రాసి ఉన్నది:
[2] “మీ యజమాని సంతానం మీతోనే ఉన్నారు. రథాలూ గుర్రాలూ ఆయుధాలూ మీ దగ్గర ఉన్నాయి. మీరు ప్రాకారం, కోట ఉన్న పట్టణంలో ఉన్నారు.
[3] కనుక మీకు ఈ లేఖ అందగానే మీ యజమాని సంతానంలో ఉత్తముడూ యోగ్యుడూ అయినవాణ్ణి ఎన్నుకొని అతణ్ణి అతడి పూర్వీకుడి సింహాసనం మీద కూర్చోబెట్టి మీ యజమాని రాజవంశంకోసం పోరాడండి.”
[4] వాళ్ళు ఇది చదివి చాలా భయపడ్డారు. “ఇద్దరు రాజులే అతడి ముందు నిలువలేకపోయారే, మనం ఎలా నిలుస్తాం” అని చెప్పుకొన్నారు.
[5] అందుచేత భవనం అధికారీ పట్టణం అధికారీ పెద్దలూ సంరక్షకులూ యెహూకు “మేము మీ దాసులం. మీ ఆజ్ఞలన్నీ శిరసావహిస్తాం. మేము ఎవరినీ రాజుగా చేసుకోము. మీకు ఏది మంచిదని తోస్తుందో అది చేయండి” అని చెప్పి పంపారు.
[6] యెహూ ఇంకో లేఖ వ్రాసి వారికి పంపాడు. అందులో “మీరు నా పక్షంగా ఉంటే, నా మాట వినడానికి సిద్ధంగా ఉంటే, రేపు ఈ వేళకు యెజ్రేల్‌కు నా దగ్గరికి మీ యజమాని కొడుకుల తలలు తీసుకురండి” అని రాసి ఉన్నది. ఆ డెబ్భై మంది రాకుమారులు పట్టణంలో ఘనుల దగ్గర ఉన్నారు. ఆ ఘనులు వారిని పెంచుతూ ఉన్నారు.
[7] ఆ లేఖ వారికి అందగానే వారు ఆ డెబ్భైమంది రాకుమారులను వధించారు. వారి తలలు బుట్టలలో పెట్టి యెజ్రేల్‌లో ఉన్న యెహూకు పంపారు.
[8] వార్తాహరుడు వచ్చి “రాజు కొడుకుల తలలు తెచ్చార”ని యెహూకు తెలిపాడు. యెహూ అతడితో “వాటిని నగరద్వారం దగ్గర రెండు కుప్పలుగా చేయి. ఉదయం వరకు వాటిని అలాగే ఉంచు” అన్నాడు.
[9] తెల్లవారినప్పుడు యెహూ బయటికి వెళ్ళి అక్కడ నిలబడి ఉన్న ప్రజలందరితో ఇలా చెప్పాడు: “మీరు నిర్దోషులు. నేను నా యజమానిపై కుట్ర చేసి అతణ్ణి చంపాను. నిజమే. కానీ వీళ్ళందరినీ చంపినది ఎవరు?
[10] ఒక విషయం తెలుసుకోండి. యెహోవా అహాబు రాజవంశాన్ని గురించి చెప్పిన మాటలలో ఒక్కటి కూడా నెరవేరకుండా ఉండదు. యెహోవా తన సేవకుడైన ఏలీయా ద్వారా చెప్పిన మాటప్రకారం జరిగించాడు.”
[11] అప్పుడు యెహూ యెజ్రేల్‌లో మిగిలిన అహాబు వంశీయులందరినీ హతమార్చాడు. అంతేగాక, అహాబు పక్షం ఉన్న ఘనులనూ అతడి మిత్రులనూ యాజులనూ కూడా చంపాడు. అతడి పక్షంవాళ్ళలో ఎవరినీ వదిలిపెట్టలేదు.
[12] తరువాత యెహూ బయలుదేరి షోమ్రోనుకు వెళుతూ ఉన్నాడు. త్రోవలో, గొర్రెల బొచ్చు కత్తిరించే ఇంటిదగ్గర అతడికి యూదా రాజైన అహజ్యా బంధువులు ఎదురయ్యారు.
[13] అతడు వాళ్ళను “ఎవరు మీరు?” అని అడిగాడు. వాళ్ళు “మేము అహజ్యా బంధువులం. రాజు కొడుకులనూ రాణి కొడుకులనూ చూడడానికి వెళ్తున్నాం” అన్నారు.
[14] అది విని యెహూ తనతో ఉన్న వారికి “వీళ్ళను ప్రాణంతో పట్టుకోండి” అని ఆజ్ఞాపించాడు. వారు వాళ్ళను ప్రాణంతో పట్టుకొని గొర్రెబొచ్చు కత్తిరించే ఇంటిప్రక్క ఉన్న గుంటదగ్గర చంపారు. వాళ్ళు నలభై రెండుమంది. అతడు వాళ్ళలో ఒక్కణ్ణి కూడా వదిలిపెట్టలేదు.
[15] యెహూ అక్కడనుంచి బయలుదేరి తనను కలుసుకోవడానికి రేకాబు కొడుకు యెహోనాదాబు రావడం చూశాడు, అతడికి శుభమని చెప్పి “నా మనసు నీపట్ల యథార్థంగా ఉన్నట్టు నీ మనసు నాపట్ల ఉందా?” అని అడిగాడు. యెహోనాదాబు “ఉంది” అని జవాబిచ్చాడు.
[16] “యెహోవా కోసం నేను ఎంత ఆసక్తిగా ఉన్నానో వచ్చి చూడు” అని యెహూ చెప్పి తన రథంలో అతణ్ణి తీసుకువెళ్ళాడు.
[17] అతడు షోమ్రోను నగరం చేరి అక్కడ మిగిలి ఉన్న అహాబు వంశంవాళ్ళందరిని చంపాడు. ఆ వంశాన్ని సమూల నాశనం చేశాడు. ఈ విధంగా ఏలీయాతో యెహోవా చెప్పిన మాట నెరవేరింది.
[18] ఆ తరువాత యెహూ ప్రజలందరిని సమకూర్చి ఇలా చెప్పాడు: “అహాబు బయల్‌దేవుడికి కొద్దిగానే సేవ చేశాడు. యెహూ ఆయనకు ఇంకా ఎక్కువ సేవ చేస్తాడు.
[19] కనుక బయల్‌దేవుడి ప్రవక్తలందరినీ దాసులందరినీ పూజారులందరినీ నాదగ్గరికి పిలవండి. ఎవ్వడూ తప్పకూడదు. వారిలో రానివాళ్ళు బ్రతకరు. ఎందుకంటే నేను బయల్‌దేవుడికి గొప్ప బలి సమర్పిస్తాను.” బయల్‌దేవుణ్ణి సేవించేవారిని నాశనం చేద్దామని యెహూ యుక్తిగా అలా చెప్పాడు.
[20] “బయల్ దేవుడికి పండుగ ఏర్పాటు చేయండి” అని యెహూ ఆజ్ఞ జారీ చేశాడు. వాళ్ళు అలాగే ప్రకటించారు.
[21] యెహూ ఇస్రాయేల్‌లో నలుదిక్కులకు కబురంపాడు. బయల్‌దేవుడి సేవకులంతా పండుగకు వచ్చారు. వాళ్ళలో ఒక్క మనిషి కూడా రాకుండా ఉండలేదు. వాళ్ళంతా బయల్‌దేవుడి గుడిలో ప్రవేశించారు. బయల్‌దేవుడి గుడి ఈ చివరనుండి ఆ చివరవరకు వాళ్ళతో నిండిపోయింది.
[22] అప్పుడు యెహూ దుస్తుల గదిమీద అధికారం ఉన్నవాణ్ణి పిలిచి “బయల్‌దేవుడి దాసులందరికీ అంగీలు బయటికి తీసుకురా” అన్నాడు. ఆ మనిషి వాళ్ళ కోసం అంగీలు బయటికి తెచ్చాడు.
[23] తరువాత యెహూ, రేకాబు కొడుకు యెహోనాదాబు బయల్‌దేవుడి గుడిలోకి వెళ్ళారు. “ఇక్కడ మీ మధ్య యెహోవా సేవకులు ఎవరూ లేకుండా చూడండి, బయల్‌దేవుడి దాసులు మాత్రమే ఉండాలి” అని యెహూ ఆదేశించాడు.
[24] బయల్‌దేవుడి పూజారులు బలులూ హోమాలూ అర్పించడానికి లోపలికి వచ్చారు. అప్పుడు యెహూ గుడి వెలుపల ఎనభైమంది కావలివాళ్ళను ఉంచి ఇలా హెచ్చరించాడు: “నేను మీ వశం చేయబోయేవాళ్ళలో ఒక్కణ్ణి కూడా తప్పించుకుపోనిస్తే వాడి ప్రాణానికి బదులు వాణ్ణి తప్పించుకుపోనిచ్చినవాడి ప్రాణం తీస్తాను.”
[25] హోమబలి అర్పించడం ముగించాక యెహూ కావలివాళ్ళకూ వాళ్ళ అధికారులకూ ఇలా ఆదేశించాడు: “లోపలికి వెళ్ళి వాళ్ళను కూలగొట్టండి. ఒక్కణ్ణి కూడా బయటికి రానియ్యకూడదు.” ఆ కావలివారూ అధిపతులూ వాళ్ళను ఖడ్గంతో కూలగొట్టారు. వాళ్ళ శవాలను బయట పారవేశారు. అప్పుడు వారు బయల్‌దేవుడి ఆలయంలోని గర్భగుడిలో చొరబడి
[26] అక్కడి విగ్రహాలను బయటికి తెచ్చి తగలబెట్టారు.
[27] బయల్‌దేవుడి స్తంభాన్ని పడగొట్టారు. బయల్‌దేవుడి గుడిని నేలమట్టం చేసి దానిని మరుగుదొడ్డిగా చేశారు. ఈ నాటికీ అది అలాగే ఉంది.
[28] ఆ విధంగా యెహూ బయల్‌దేవుణ్ణి ఇస్రాయేల్‌లో లేకుండా నిర్మూలించాడు.
[29] కానీ ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన నెబాతు కొడుకైన యరొబాం పాపాలు యెహూ విడిచిపెట్టలేదు. బేతేల్‌లో, దానులో ఉన్న ఆ బంగారు దూడలను పూజించడం మానుకోలేదన్న మాట.
[30] యెహోవా యెహూకు ఇలా చెప్పాడు: “నా మనసులో ఉన్నదాని ప్రకారమే నీవు అహాబు రాజవంశాన్ని చేసి నా దృష్టిలో న్యాయమైనదానిని జరిగించావు. దానిని బాగా నెరవేర్చావు గనుక నాలుగు తరాల వరకు నీ సంతానం ఇస్రాయేల్ రాజ్య సింహాసనం ఎక్కుతారు.”
[31] అయినా ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా ఇచ్చిన ఉపదేశం ప్రకారం యెహూ మనసారా ప్రవర్తించలేదు. ఇస్రాయేల్ ప్రజలను తప్పుదారి పట్టించిన యరొబాం పాపాలనుంచి వైదొలగలేదు.
[32] ఆ రోజుల్లో యెహోవా ఇస్రాయేల్‌ను తగ్గించ నారంభించాడు. యొర్దానుకు తూర్పుగా ఉన్న ప్రాంతమంతటిలో వారిని హజాయేల్ ఓడించాడు.
[33] గిలాదు ప్రాంతమంతట్లో, అర్నోను లోయలో ఉన్న అరోయేర్ మొదలుకొని గాదు, రూబేను, మనష్షే గోత్రాలవారు నివసించిన గిలాదు, బాషాను ప్రదేశాలలో వారిని హజాయేల్ ఓడించాడు.
[34] యెహూను గురించిన ఇతర విషయాలు, అతడు చేసినవన్నీ ఇస్రాయేల్ రాజుల చరిత్ర గ్రంథంలో వ్రాసి ఉన్నాయి.
[35] యెహూ కన్ను మూసి తన పూర్వీకులదగ్గరికి చేరాడు. అతడి స్థానంలో అతడి కొడుకు యెహోయాహాజు రాజయ్యాడు.
[36] యెహూ ఇస్రాయేల్‌ప్రజపై షోమ్రోనులో ఇరవై ఎనిమిది సంవత్సరాలు పరిపాలన చేశాడు.