Skip to content
Opens in a new window

[1] యోషీయా రాజయినప్పుడు అతడి వయసు ఎనిమిది సంవత్సరాలు. అతడు జెరుసలంలో ముప్ఫయి ఒక్క సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు యెదీదా. ఆమె బొస్కత్ గ్రామస్థుడైన అదాయా కూతురు.

[2] యోషీయా యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు. అతడు తన పూర్వీకుడు దావీదు జీవిత విధానాన్ని పూర్తిగా అనుసరించేవాడు. దాని నుంచి కుడి వైపుకు గానీ ఎడమ వైపుకు గానీ వైదొలిగినవాడు కాదు.

[3] యోషీయారాజు పరిపాలిస్తున్న పద్ధెనిమిదో సంవత్సరంలో అతడు లేఖకుడైన షాఫానును యెహోవా ఆలయానికి పంపాడు. (షాఫాను అజల్యా కొడుకు, మెషుల్లాం మనుమడు.) రాజు అతడికి ఇలా ఆదేశించాడు:

[4] “నీవు ప్రముఖయాజి అయిన హిల్కీయా దగ్గరికి వెళ్ళు. యెహోవా ఆలయానికి వచ్చే ప్రజలనుంచి ద్వారపాలకులు వసూలు చేసిన వెండి నాణేల మొత్తాన్ని చూడాలని హిల్కీయాతో చెప్పు.

[5] వారు ఆ డబ్బును యెహోవా ఆలయంలో పని చేస్తున్న తనిఖీదారుల చేతికి అప్పచెప్పాలి. తనిఖీదారులు ఆ డబ్బును యెహోవా ఆలయాన్ని మరమ్మత్తు చేసే పనివాళ్ళకు –

[6] వడ్రంగులకూ కట్టేవారికీ తాపీపనివారికీ – ఇవ్వాలి; ఆలయాన్ని మరమ్మత్తు చేయడానికి కలప మ్రానుల కోసం, చెక్కిన రాళ్ళ కోసం కూడా ఆ డబ్బు ఖర్చు చేయాలి.

[7] వారి చేతికి అప్పగించే డబ్బుకు వారినుంచి లెక్కలు అడగవద్దు. వారు నిజాయితీపరులు.”

[8] ప్రముఖయాజి అయిన హిల్కీయా లేఖకుడైన షాఫానుతో “యెహోవా ఆలయంలో ధర్మశాస్త్ర గ్రంథం నాకు కనిపించింది” అన్నాడు. హిల్కీయా ఆ గ్రంథం షాఫాను చేతికిచ్చాడు. షాఫాను అది చదివాడు.

[9] లేఖకుడైన షాఫాను రాజుదగ్గరికి తిరిగి వచ్చి ఇలా తెలియచెప్పాడు: “మీ సేవకులు యెహోవా ఆలయంలో ఉన్న వెండి జమ చేసి ఆలయంలో పని చేస్తున్న తనిఖీదారుల చేతికి అప్పచెప్పారు.”

[10] హిల్కీయాయాజి తనకు ఒక పుస్తకం ఇచ్చాడని రాజుకు చెప్పి దానిని రాజు ఎదుట చదివి వినిపించాడు.

[11] రాజు ధర్మశాస్త్ర గ్రంథంలోని మాటలు విన్నప్పుడు తన బట్టలు చింపుకొన్నాడు.

[12] తరువాత హిల్కీయాయాజికీ షాఫాను కొడుకు అహీకాంకూ మీకాయా కొడుకు అక్బోరుకూ లేఖకుడైన షాఫానుకూ అశాయా అనే తన సన్నిహిత సేవకుడికీ రాజు ఇలా ఆజ్ఞాపించాడు:

[13] “మీరు వెళ్ళి దొరికిన ఈ గ్రంథంలో ఉన్న మాటలను గురించి నాకోసం, ప్రజలకోసం, యూదా రాజ్యమంతటికోసం యెహోవా దగ్గర విచారణ చేయండి. యెహోవా కోపాగ్ని మనమీద అధికంగా రగులుకొని ఉంది. ఎందుకంటే, మన పూర్వీకులు ఈ గ్రంథంలోని మాటలు చెవిని పెట్టలేదు. మన విషయం రాసినవన్నిటి ప్రకారం చేయలేదు.”

[14] జెరుసలంలో రెండో భాగంలో దేవుని మూలంగా పలికే స్త్రీ ఒకతె ఉంది. ఆమె షల్లూం భార్య హుల్దా, (షల్లూం తిక్వా కొడుకు, హరహష్ మనుమడు. అతడు వస్త్రశాల అధికారి.) హిల్కీయాయాజి, అహీకాం, అక్బోరు, అశాయా హుల్దాప్రవక్త్రి దగ్గరికి వెళ్ళారు, ఆమెతో మాట్లాడారు.

[15] ఆమె వాళ్ళతో ఇలా చెప్పింది: “మిమ్ములను నాదగ్గరికి పంపినవానికి ఈ మాటలు తెలియజేయండి – ఇస్రాయేల్ దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే,

[16] యూదా రాజు చదివించిన గ్రంథంలోని మాటల ప్రకారమే నేను ఈ స్థలంమీదికీ దీని కాపురస్థులమీదికీ విపత్తు రప్పిస్తాను.

[17] ఈ ప్రజలు నన్ను విడిచిపెట్టి ఇతర దేవుళ్ళకు ధూపం వేశారు. వారు చేతులతో చేసిన పనులన్నిటివల్ల నాకు కోపం రేపారు. అందుకనే ఈ స్థలంమీద నా కోపాగ్ని రగులుకొని ఉంది. అది ఆరదు.

[18] యెహోవా దగ్గర విచారణ చేయడానికి మిమ్ములను పంపిన యూదా రాజుతో ఇలా చెప్పండి – ఇస్రాయేల్ ప్రజల దేవుడు యెహోవా చెప్పేదేమిటంటే, నీవు నా వాక్కులు విన్నావు.

[19] ఈ స్థలం పాడవుతుందనీ దీని కాపురస్తులు శాపగ్రస్థులవుతారనీ నేను చెప్పిన మాట విని నీవు మెత్తని మనసుతో యెహోవా సముఖంలో వినయంతో తల వంచుకొన్నావు. నీ బట్టలు చించుకొని నా ఎదుట ఏడ్చావు. కనుక నేను నీ ప్రార్థన విన్నాను – యెహోవా ఇలా చెపుతున్నాడు –

[20] నేను నిన్ను నీ పూర్వీకులదగ్గరికి చేరుస్తాను; శాంతితో నీవు నీ సమాధికి చేరుకొంటావు. నేను ఈ స్థలంమీదికి రప్పించే విపత్తులో ఏమీ నీ కంటికి కనబడదు.” అప్పుడు ఆ మాటలు వారు రాజు దగ్గరికి వచ్చి చెప్పారు.

2 రాజులు — Chapters