Skip to content
Opens in a new window

[1] ఇస్రాయేల్ రాజూ ఏలా కొడుకూ అయిన హోషేయ పరిపాలిస్తున్న మూడో సంవత్సరంలో యూదా రాజైన ఆహాజు కొడుకు హిజ్కియా రాజయ్యాడు.

[2] అతడు రాజయినప్పుడు అతడి వయస్సు ఇరవై అయిదేళ్ళు. అతడు జెరుసలంలో ఇరవై తొమ్మిది సంవత్సరాలు పరిపాలించాడు. అతడి తల్లి పేరు అబీ. ఆమె జెకర్యా కూతురు.

[3] హిజ్కియా అతడి పూర్వీకుడైన దావీదులాగే యెహోవా దృష్టిలో సరిగా ప్రవర్తించేవాడు.

[4] అతడు ఎత్తు పూజాస్థలాలను తొలగించాడు, అషేరాదేవి స్తంభాలనూ ఇతర దేవతాస్తంభాలనూ పడగొట్టాడు. మోషే చేసిన కంచు పామును ముక్కలు చేశాడు (అంత వరకూ ఇస్రాయేల్ ప్రజలు దానికి ధూపం వేసేవాళ్ళు. దానికి నెహూష్టాన్ అనే పేరు ఉంది).

[5] హిజ్కియా ఇస్రాయేల్‌ప్రజల దేవుడు యెహోవా మీద నమ్మకం ఉంచేవాడు. అతడికంటే ముందు గానీ తరువాత గానీ ఉన్న యూదా రాజులలో అతనిలాంటివాడు ఎవరూ లేరు.

[6] అతడు యెహోవాను హత్తుకొనేవాడు. ఆయనను అనుసరిస్తూ, ఆయననుంచి ఎప్పుడూ వైదొలగలేదు. యెహోవా మోషేకు ఇచ్చిన ఆజ్ఞలను పాటించేవాడు.

[7] యెహోవా అతనికి తోడుగా ఉన్నాడు. గనుక అతడు చేయపూనుకొన్న ప్రతి పనిలో సఫలుడయ్యాడు. అతడు అష్షూరు రాజుకు లొంగకుండా అతణ్ణి వ్యతిరేకించాడు.

[8] అతడు ఫిలిష్తీయవాళ్ళను కొట్టి గాజావరకు, దాని పరిసర ప్రాంతంలో ఉన్న అడవి పల్లెటూళ్ళు మొదలుకొని ప్రాకారం ఉన్న పట్టణాలవరకు వాళ్ళను ఓడించాడు.

[9] హిజ్కియారాజు పరిపాలిస్తున్న నాలుగో సంవత్సరంలో – ఇస్రాయేల్ రాజూ ఏలా కొడుకూ అయిన హోషేయ పరిపాలనలో ఏడో ఏట – అష్షూరు రాజైన షల్మనేసెరు షోమ్రోనుమీదికి దండెత్తి వచ్చి దానిని ముట్టడించాడు.

[10] మూడేళ్ళ ఆఖరున షోమ్రోనును స్వాధీనం చేసుకొన్నాడు. అది హిజ్కియా పరిపాలనలో ఆరో ఏట జరిగింది.

[11] అష్షూరు రాజు ఇస్రాయేల్ ప్రజను అష్షూరుకు తీసుకుపోయాడు. వారిని హోబోరు నదికి దగ్గరలో ఉన్న హాలహులో, గోజానులో, మాదియవాళ్ళ పట్టణాలలో ఉంచాడు.

[12] ఇస్రాయేల్‌ప్రజ వారి దేవుడైన యెహోవా మాట వినలేదు, ఆయన ఒడంబడికను మీరారు. యెహోవా సేవకుడైన మోషేకు ఆయన ఇచ్చిన ఆజ్ఞలన్నిటినీ అతిక్రమించారు. వారు పెడ చెవిని పెట్టారు, అవిధేయత చూపారు. అందుచేత అదంతా జరిగింది.

[13] హిజ్కియారాజు పరిపాలిస్తున్న పద్నాలుగో సంవత్సరంలో అష్షూరు రాజైన సన్‌హెరీబు దండెత్తి వచ్చి యూదాలో ఉన్న ప్రాకారాలూ కోటలూ గల పట్టణాలన్నీ స్వాధీనం చేసుకొన్నాడు.

[14] అప్పుడు యూదా రాజైన హిజ్కియా లాకీషులో ఉన్న అష్షూరు రాజుకు ఇలా కబురంపాడు: “నేను తప్పు చేశాను. నా మీదికి రాకుండా వెనక్కు వెళ్ళండి. మీరు ఎంత మోపితే అంత నేను భరిస్తాను.” యూదా రాజైన హిజ్కియా పది వేల కిలోగ్రాముల వెండి, రెండు వేల కిలోగ్రాముల బంగారం చెల్లించాలని అష్షూరు రాజు నిర్ణయించాడు.

[15] యెహోవా ఆలయంలో, రాజభవనంలోని ఖజానాలో ఉన్న వెండి అంతా హిజ్కియా అతడికి ఇప్పించాడు.

[16] ఆ కాలంలో తాను యెహోవా ఆలయం తలుపులకూ స్తంభాలకూ తొడుగు చేయించిన బంగారం తీయించి అష్షూరు రాజుకు ఇప్పించాడు.

[17] తరువాత అష్షూరు రాజు లాకీష్‌నుంచి రాజైన హిజ్కియా ఉన్న జెరుసలంకు తర్తాన్, రబ్‌సారీసు, రబ్‌షాకే అనే అధికారులను పెద్ద సైన్యంతోపాటు పంపించాడు. వాళ్ళు జెరుసలం చేరి “చాకిరేవు”కు వెళ్ళే దారిలో ఉన్న మెరక కొలను కాలువ దగ్గర నిలబడ్డారు.

[18] వాళ్ళు హిజ్కియా రాజుకు కబురంపారు. అప్పుడు రాజభవనం మీద అధికారీ, హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీం, లేఖకుడైన షెబ్నా, కార్యదర్శి ఆసాపు కొడుకూ అయిన యోవాహు వాళ్ళ దగ్గరికి వెళ్ళారు.

[19] అప్పుడు రబ్‌షాకే వారితో ఇలా అన్నాడు: “మహారాజైన అష్షూరురాజు చెప్పిన ఈ మాటలు హిజ్కియాకు తెలియజేయండి – నీవు నమ్ముకున్న ఆధారం ఎంత మాత్రం?

[20] యుద్ధంలో ఆలోచనకూ బలానికీ బదులుగా వట్టి మాటలు పెట్టవచ్చుననుకుంటున్నావా? నీవు ఎవరి మీద నమ్మకం ఉంచి నా మీద తిరగబడ్డావు?

[21] ఇదిగో, నీవు ఈజిప్ట్ మీద నమ్మకం పెట్టావు గదా! ఈజిప్ట్ నలిగిన జమ్మురెల్లు లాంటిది. దానిమీద ఆనుకున్న వాళ్ళ చేతిలోకి అది గుచ్చుకుపోతుంది. ఈజిప్ట్ రాజైన ఫరోమీద నమ్మకం ఉంచిన వాళ్ళందరికీ అంతే!

[22] పోనీ, ఒకవేళ మీరు మీ దేవుడైన యెహోవా మీద నమ్మకం ఉంచినవారని నీవు అంటావేమో. అయితే హిజ్కియా తీసివేసినవి యెహోవా ఎత్తయిన పూజాస్థలాలూ బలిపీఠాలూ కావా? యూదావాళ్ళతోను జెరుసలంవాళ్ళతోను ‘జెరుసలంలో ఉన్న బలిపీఠం ఎదుటే మీరు పూజించాలి’ అని హిజ్కియా చెప్పాడు గదా.

[23] హిజ్కియా! ఇప్పుడు నా యజమాని అయిన అష్షూరు రాజుతో పోటీ చేయండి! రెండు వేల గుర్రాల మీద ఎక్కించడానికి నీ దగ్గర రౌతులు ఉంటే వాటిని నీకిస్తాను!

[24] లేకపోతే, నీవు నా యజమాని సేవకులైన అధిపతులలో అత్యల్పుణ్ణి ఎలా ఎదిరిస్తావు? రథాలు, రౌతుల కోసం నీవు ఈజిప్ట్ మీద నమ్మకం ఉంచావు గదా.

[25] యెహోవా ఆదేశం లేకుండానే నేను ఈ దేశాన్ని నాశనం చేయడానికి వచ్చాననుకున్నావా? దండెత్తి వెళ్ళి ఈ దేశాన్ని నాశనం చేయమని యెహోవా తానే నాతో చెప్పాడు.”

[26] అప్పుడు హిల్కీయా కొడుకు ఎల్యాకీం, షెబ్నా, యోవాహు “దయచూపి మీ సేవకులైన మాతో సిరియా భాషలో మాట్లాడండి, ఆ భాష మాకు వస్తుంది. యూదుల భాషతో మాట్లాడకండి. గోడమీద ఉన్నవారు వింటున్నారు గదా” అని రబ్‌షాకేతో చెప్పారు.

[27] అందుకు రబ్‌షాకే ఇలా అన్నాడు: “మీ యజమానితో, మీతో మాత్రమే ఈ మాటలు చెప్పడానికి నా యజమాని పంపాడనుకుంటున్నారా? మీలాగే గోడమీద కూర్చుని ఉన్నవాళ్ళు తమ మలం తింటూ, తమ మూత్రం తాగేట్టు నా యజమాని నన్ను వాళ్ళ దగ్గరికి పంపాడు గదా.”

[28] అప్పుడు రబ్‌షాకే నిలబడి యూదుల భాషతో బిగ్గరగా చాటించాడు: “మహారాజైన అష్షూరు రాజు చెప్పినది వినండి.

[29] రాజుగారు చెప్పేదేమిటంటే, హిజ్కియాచేత మోసపోకండి. అతడు మిమ్మల్ని నా చేతిలోనుంచి తప్పించలేడు.

[30] “హిజ్కియా అంటున్నాడు గదా – ‘యెహోవా మనల్ని తప్పక విడిపిస్తాడు; ఆయన ఈ నగరం అష్షూరు రాజు వశం చేయడు.’ అలా చెప్పి మిమ్మల్ని యెహోవామీద నమ్మకం ఉంచేట్టు చేయనియ్యకండి.

[31] హిజ్కియా చెప్పే మాట వినవద్దు. అష్షూరు రాజు చెపుతున్నాడు, మీరు నాతో శాంతి చేసుకోండి. నగరం నుంచి బయటికి నాదగ్గరికి రండి. నేను వచ్చేవరకు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్షచెట్టు పండ్లు, తన అంజూరచెట్టు పండ్లు తింటూ, తన బావి నీళ్ళు తాగుతారు.

[32] తరువాత నేను వచ్చి మిమ్మల్ని మీ సొంత దేశంలాంటి దేశానికి తీసుకుపోతాను. అది గోధుమలు, క్రొత్త ద్రాక్షరసం ఉన్న దేశం. ఆహారం, ద్రాక్షతోటలు ఉన్న దేశం. ఆలీవ్ నూనె, తేనె ఉన్న దేశం. మీరు బయటికి వస్తే మీరు చావకుండా బతుకుతారు. కనుక హిజ్కియా ‘యెహోవా మనల్ని విడిపిస్తాడు’ అంటూ మిమ్మల్ని నమ్మించడానికి చూస్తూవుంటే అతడి మాట మీరు వినవద్దు.

[33] ఏ దేశం వాళ్ళనైనా ఏ దేవుడైనా అష్షూరు రాజు చేతినుంచి విడిపించాడా!

[34] హమాతు, అర్పాదు పట్టణాల దేవుళ్ళు ఎక్కడ? సెపర్వయీం, హేన, ఇవ్వా అనే స్థలాల దేవుళ్ళు ఎక్కడ? ఏ దేవుడైనా షోమ్రోనును నా చేతిలోనుంచి విడిపించాడా?

[35] దేవుళ్ళలో ఏ దేవుడైనా తన దేశాన్ని నా చేతిలోనుంచి ఎప్పుడైనా విడిపించాడా, చెప్పండి? యెహోవా నా చేతిలో నుంచి జెరుసలం ఎలా విడిపిస్తాడు?”

[36] అంతకుముందు హిజ్కియారాజు అతడికి ఏమీ జవాబు చెప్పకూడదని ప్రజలకు ఆజ్ఞ జారీ చేశాడు, గనుక వారు మౌనం వహించి ఒక్క మాట కూడా బదులు చెప్పలేదు.

[37] అప్పుడు రాజభవనం మీద అధికారీ హిల్కీయా కొడుకూ అయిన ఎల్యాకీం, లేఖకుడైన షెబ్నా, కార్యదర్శీ ఆసాపు కొడుకూ అయిన యోవాహు తమ బట్టలు చింపుకొని హిజ్కియా దగ్గరికి వచ్చారు, రబ్‌షాకే మాటలు అతనికి తెలియజేశారు.

2 రాజులు — Chapters