Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:14

[1] కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.

[2] అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.

[3] వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.

[4] చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.

[5] దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది.

[6] జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.

[7] కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.

[8] వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.

[9] నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.

[10] అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.

[11] చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.

[12] అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?

[13] నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.

[14] సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.

[15] నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.

[16] నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?

[17] పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.

[18] నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.

[19] ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.

[20] కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?

[21] మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.

[22] దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.

[23] అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.

సామెతలు — Chapters