Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:11

[1] కుమారా, నీవు నా మాటలు అంగీకరించి, నా ఆజ్ఞలను నీ మనసులో ఉంచుకుంటే దేవుణ్ణి గూర్చిన వివేచన నీకు దొరుకుతుంది.

[2] జ్ఞానంపై మనసు నిలిపి హృదయపూర్వకంగా వివేచన అభ్యాసం చేసినప్పుడు,

[3] తెలివితేటల కోసం మొరపెట్టినప్పుడు, వివేచన కోసం వేడుకొన్నప్పుడు,

[4] పోగొట్టుకున్న వెండిని వెతికినట్టు దాన్ని వెదికినప్పుడు, దాచుకున్న ధనం కోసం వెతికినట్టు జ్ఞానాన్ని వెతికినప్పుడు,

[5] యెహోవాపట్ల భయభక్తులు కలిగి ఉండడం ఎలా ఉంటుందో నువ్వు గ్రహిస్తావు. దేవుణ్ణి గూర్చిన విజ్ఞానం నీకు దొరుకుతుంది.

[6] యెహోవా మాత్రమే జ్ఞానం అనుగ్రహిస్తాడు. తెలివి, వివేచన ఆయన మాటల్లో నిండి ఉంటాయి.

[7] యథార్థవంతులను ఆయన వర్ధిల్లజేస్తాడు. సరియైన మార్గం నుండి తప్పిపోకుండా నడుచుకునే వాళ్ళకు ఆయన రక్షణ కలుగజేస్తాడు.

[8] న్యాయ ప్రవర్తన నుండి తొలగిపోకుండా ఆయన కనిపెట్టుకుని ఉంటాడు. తన భక్తులు మంచి ప్రవర్తనలో కొనసాగేలా ఆయన కావలి కాస్తాడు.

[9] అప్పుడు నీతి, న్యాయం, యథార్థత అనే మంచి మార్గాలు నువ్వు తెలుసుకుంటావు.

[10] జ్ఞానం నీ హృదయంలోకి చొచ్చుకుపోతుంది. తెలివి కలిగి ఉండడం నీకు ఇష్టంగా ఉంటుంది.

[11] తెలివితేటలు నిన్ను కాపాడతాయి. వివేకం నీకు కాపలా కాస్తుంది.

[12] అది దుష్టులు నడిచే మార్గాల నుండి, మూర్ఖపు మాటలు మాట్లాడే వారి బారి నుండి నిన్ను కాపాడుతుంది.

[13] దుష్టులు చీకటి మార్గాల్లో నడవడం కోసం యథార్థమైన మార్గాలను విడిచిపెడతారు.

[14] కీడు చేసేవాళ్ళు తమ పనుల వల్ల సంతోషిస్తారు. తీవ్రమైన మూర్ఖత్వంతో ప్రవర్తించే వాళ్ళను చూసి ఆనందిస్తారు.

[15] తమ దుష్ట మార్గాలగుండా పయనిస్తారు. వాళ్ళు కపటంతో ఉంటారు.

[16] వ్యభిచారి వలలో పడకుండా, తియ్యగా మాట్లాడి మోసపుచ్చే వేశ్య బారి నుండి జ్ఞానం నిన్ను కాపాడుతుంది.

[17] అలాంటి స్త్రీ తన యవ్వనకాలంలో తన భర్తను విడిచిపెట్టి తన దేవుని నిబంధన పెడచెవిన పెడుతుంది.

[18] ఆ స్త్రీ ఇల్లు మరణానికి నడిపిస్తుంది. ఆ స్త్రీ నడిచే మార్గం శవాల దగ్గరికి చేరుతుంది.

[19] ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళేవాళ్ళు ఎవ్వరూ వెనక్కి తిరిగిరారు. వాళ్ళు జీవమార్గం చేరుకోలేరు.

[20] నేను చెప్పే మాటలు విని ఆ విధంగా నడుచుకుంటే నువ్వు యథార్థవంతులు నడిచే మార్గంలో నడుచుకుంటావు. నీతిమంతుల ప్రవర్తన అనుసరిస్తావు.

[21] నిజాయితీపరులు దేశంలో కాపురం ఉంటారు. సత్యవర్తనులు దేశంలో స్థిరంగా ఉంటారు.

[22] చెడ్డ పనులు చేసేవారు నిర్మూలం అవుతారు. నమ్మకద్రోహులు దేశంలో లేకుండా పోతారు.

సామెతలు — Chapters