Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:28

[1] జ్ఞానం ఉన్న కొడుకును బట్టి అతని తండ్రికి సంతోషం కలుగుతుంది. బుద్ధిలేని కొడుకు తన తల్లికి దుఃఖం, వేదన కలిగిస్తాడు.

[2] భక్తిహీనుల సంపద వారికి ఉపయోగపడదు. ఉత్తముడు మరణం నుండి తప్పించుకుంటాడు.

[3] ఉత్తముడు ఆకలితో అలమటించేలా యెహోవా చెయ్యడు. దుర్మార్గుల ప్రయత్నాలను యెహోవా భగ్నం చేస్తాడు.

[4] శ్రద్ధ లేకుండా బద్దకంగా పనిచేసే వాడు దరిద్రుడుగా మారతాడు. శ్రద్ధ కలిగి పనిచేసే వాడికి సంపద సమకూరుతుంది.

[5] బుద్ధిగల కుమారుడు ఎండాకాలంలో సమకూర్చుకుంటాడు. పంట కోత సమయంలో నిద్రపోయే కుమారుడు కుటుంబానికి అవమానం కలిగిస్తాడు.

[6] నీతిమంతుని కుటుంబానికి దీవెనలు కలుగుతాయి. దుర్మార్గుల మాట్లల్లో దౌర్జన్యం దాగి ఉంటుంది.

[7] నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే దీవెనలు కలుగుతాయి. భక్తిహీనుల జ్ఞాపకం అసహ్యం కలిగిస్తుంది.

[8] జ్ఞానం కోరేవాడు మంచి మాటలు అంగీకరిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

[9] నిజాయితీపరుడు భయం లేకుండా ఉంటాడు. కపటంగా ప్రవర్తించేవాడి గుట్టు బట్ట బయలు అవుతుంది.

[10] కళ్ళతో సైగ చేసేవాడు వేదనలు కలిగిస్తాడు. పనికిమాలిన మాటలు మాట్లాడే మూర్ఖుడు నాశనమైపోతాడు.

[11] నీతిమంతుల నోటినుంచి వచ్చే మాటలు జీవజలపు ఊటలు. దుష్టులు తమలో దౌర్జన్యాన్ని దాచుకుని ఉంటారు.

[12] ప్రేమ దోషాలన్నిటినీ కప్పి ఉంచుతుంది. పగ తగాదాలను రేకెత్తిస్తుంది.

[13] వివేకం గలవాడి మాటల్లో జ్ఞానం కనబడుతుంది. బుద్ధిలేనివాడి వీపుకు బెత్తం దెబ్బలే ప్రతిఫలం.

[14] జ్ఞానులు జ్ఞానాన్ని సమకూర్చుకుంటారు. మూర్ఖుల మాటలు నాశనం కోరుకుంటాయి.

[15] ధనవంతుల ఆస్తి వారికి ఆశ్రయం కలిగించే కోట. దరిద్రుని పేదరికం వాడి నాశనానికి కారణం.

[16] నీతిమంతుల కష్టార్జితం జీవం కలిగిస్తుంది. దుర్మార్గుల రాబడి పాపం వృద్ది అయ్యేలా చేస్తుంది.

[17] బుద్ధిగల మాటలకు లోబడేవాడు తనకు జీవం కలిగించుకుంటాడు. మందలింపుకు సమ్మతించని వాడు దారి తప్పి నాశనం అవుతాడు.

[18] అబద్ధికుడు తన మనసులో పగ ఉంచుకుంటాడు. మూర్ఖులు నిందలు ప్రచారం చేస్తారు.

[19] వ్యర్థంగా మాట్లాడే మాటల్లో తప్పు దొర్లుతుంది. మితంగా మాట్లాడేవాడు బుద్ధిమంతుడు.

[20] ఉత్తముడు పలికే మాటలు అమూల్యమైన వెండి వంటివి. భక్తిహీనుల తలంపులు వ్యర్ధమైనవి.

[21] నీతిమంతుని మాటల ద్వారా చాలా మంది మేలు పొందుతారు. మూర్ఖులు జ్ఞానం లేకపోవడం వల్ల మరణానికి లోనవుతారు.

[22] యెహోవా దీవెనలు ఐశ్వర్యం కలిగిస్తాయి. మనుషుల కష్టానికి మించిన సంపద వారికి కలుగుతుంది.

[23] మూర్ఖులు తమ చెడ్డ పనుల ద్వారా ఆనందం పొందుతారు. వివేకం గలవాడు తన జ్ఞానం పెంచుకోవడానికి సాధన చేస్తాడు.

[24] మూర్ఖుడు ఏమి జరుగుతుందని భయపడతాడో అదే జరుగుతుంది. నీతిమంతులు కోరుకునేది వాళ్లకు దక్కుతుంది.

[25] సుడిగాలి వీచినప్పుడు మూర్ఖుడు లేకుండా పోతాడు. ఉత్తముడు కలకాలం నిలిచి ఉండే స్తూపంలా నిలిచి ఉంటాడు.

[26] సోమరిని పనికి పెట్టుకునే యజమానికి వాడు పండ్లకు పులుపులాగా, కళ్ళకు పొగలాగా ఉంటాడు.

[27] యెహోవా పట్ల భయభక్తులు కలిగి జీవించడం అధిక ఆయుష్షు ఇస్తుంది. భక్తిహీనుల జీవితకాలం తరిగిపోతూ ఉంటుంది.

[28] నీతిమంతుల కోరిక సంతోషాలకు కారణం. మూర్ఖుల ఆలోచనలు వ్యర్ధమైపోతాయి.

[29] నీతిమంతులకు యెహోవా మార్గం బలమైన కోట. పాపం చేసేవాళ్ళకు అది నాశన హేతువు.

[30] ఉత్తముడు కదిలించబడక స్థిరంగా ఉంటాడు. మూర్ఖులకు దేశంలో స్థానం ఉండదు.

[31] ఉత్తముడు జ్ఞానాన్ని, ఉపదేశాన్ని బోధిస్తాడు. మూర్ఖపు మాటలు మాట్లాడే నాలుకను తెగ గొడతారు.

[32] ఉత్తముడు అనుకూలమైన మాటలు పలుకుతాడు. భక్తిహీనుల నోటి నుండి మూర్ఖపు మాటలు వస్తాయి.

సామెతలు — Chapters