[1] దుర్మార్గులను చూసి మత్సర పడవద్దు. వారి సహవాసం కోరుకోకు.
[2] వారి హృదయం బలాత్కారం చేయడానికి యోచిస్తుంది. వారి నోరు కీడును గూర్చి మాటలాడుతుంది.
[3] జ్ఞానం వలన ఇల్లు నిర్మాణం అవుతుంది. వివేచన వలన అది స్థిరం అవుతుంది.
[4] తెలివి చేత దాని గదుల్లో విలువైన రమ్యమైన సర్వ సంపదలు నిండిపోతాయి.
[5] జ్ఞానం గలవాడు బలవంతుడు. తెలివిగలవాడు శక్తిశాలి.
[6] వివేకం గల నాయకుడివై యుద్ధం చెయ్యి. ఆలోచన చెప్పేవారు ఎక్కువ మంది ఉండడం భద్రత.
[7] మూర్ఖులకు జ్ఞానం అందని మాని పండే. గుమ్మం దగ్గర అలాంటి వారు మౌనంగా ఉంటారు.
[8] కీడు చేయాలని పన్నాగాలు పన్నే వాడికి జిత్తులమారి అని పేరు పెడతారు.
[9] మూర్ఖుని ఆలోచన పాప భూయిష్టం. అపహాసకులను మనుషులు చీదరించుకుంటారు.
[10] కష్ట కాలంలో నీవు కుంగిపోతే చేతగాని వాడివౌతావు.
[11] మృత్యు ముఖంలో ఉన్న వారిని తప్పించు. నాశనం వైపుకు తూలుతున్న వారిని చేతనైతే రక్షించు.
[12] “చూసావా ఈ సంగతి మనకి తెలియ లేదు” అని నీవంటే సరిపోతుందా? హృదయాలను పరిశోధించేవాడు నీవు చెబుతున్నది గ్రహించడా? నీ జీవాన్ని కాపాడే వాడు నీ మాటను గ్రహించడా? మనుషులకు వారి చర్యలను బట్టి దేవుడు ప్రతిఫలం ఇవ్వడా?
[13] కుమారా, తేనె తాగు. అది రుచికరం. తేనెపట్టునుండి కారే తేనె తినుము అది నీ నాలుకకి మధురం గదా.
[14] నీ ఆత్మకు జ్ఞానం అలాటిదని తెలుసుకో. అది నీకు దొరికితే నీకు మంచి భవిషత్తు ఉంటుంది. నీకు ఆశాభంగం కలగదు.
[15] మంచివారి ఇళ్ళ దగ్గర పొంచి ఉండి దాడి చేసే దురాత్ముల్లాగా ఉండకు. వారి గృహాలను పాడు చేయకు.
[16] ఉత్తముడు ఏడు సార్లు పడిపోయినా తిరిగి లేస్తాడు. విపత్తు కలిగినప్పుడు భక్తిహీనులు కూలి పోతారు.
[17] నీ శత్రువు పడిపొతే సంతోషించవద్దు. వాడు తూలిపడినప్పుడు నీవు మనస్సులో అనందించవద్దు.
[18] యెహోవా అది చూసి అసహ్యించుకుని వాడి మీదనుండి తన కోపం చాలించుకుంటాడేమో.
[19] దుర్మార్గులను చూసి అందోళన చెందకు. భక్తిహీనుల విషయం మత్సరపడకు.
[20] దుర్జనుడికి పుట్టగతులుండవు. భక్తిహీనుల దీపం కొడిగడుతుంది.
[21] కుమారా, యెహోవాను ఘనపరచు. రాజును ఘనపరచు. అలా చేయనివారి జోలికి పోకు.
[22] అలాటి వారికి హఠాత్తుగా ఆపద వాటిల్లుతుంది. వారి కాలం ఎప్పుడు ముగిసి పోతుందో ఎవరికి తెలుసు?
[23] ఇవి కూడా జ్ఞానులు చెప్పిన సామెతలే. న్యాయ తీర్పులో పక్షపాతం ధర్మం కాదు.
[24] నీలో దోషం లేదని దుష్టుడితో చెప్పే వాణ్ణి మనుషులు శపిస్తారు. జనం అలాటి వాణ్ణి అసహ్యించుకుంటారు.
[25] న్యాయంగా తీర్పు తీర్చే వారికి మేలు కలుగుతుంది. క్షేమకరమైన దీవెన అలాంటి వారి మీదికి వస్తుంది.
[26] సరియైన మాటలతో జవాబివ్వడం పెదవులతో ముద్దు పెట్టుకున్నట్టు ఉంటుంది.
[27] బయట పని చక్కబెట్టుకో. ముందుగా పొలంలో సిద్ధపరచుకో. ఆ తరవాత ఇల్లు కట్టుకోవచ్చు.
[28] అకారణంగా నీ పొరుగువాడిపై సాక్ష్యం పలక వద్దు. నీ పెదాలతో మోసపు మాటలు పలకొచ్చా?
[29] “వాడు నాకు చేసినట్లు వాడికి చేస్తాను. వాడి క్రియ చొప్పున వాడికి ప్రతిఫలం ఇస్తాను” అనుకోవద్దు.
[30] సోమరిపోతు చేను నేను దాటి వస్తుంటే తెలివిలేనివాడి ద్రాక్షతోట నేను దాటి వస్తుంటే,
[31] ఇదిగో దాన్నిండా ముండ్ల తుప్పలు పెరిగి ఉన్నాయి. ముళ్ళపొదలు వ్యాపించి ఉన్నాయి. దాని రాతి గోడ శిథిలం అయి పోయింది.
[32] నేను దాన్ని చూసి ఆలోచించాను. దాన్ని గమనించి బుద్ధి తెచ్చుకున్నాను.
[33] మరికాస్త నిద్ర, మరికాస్త కునుకు, నిద్ర పోవడానికి మరికాస్త చేతులు ముడుచు కోవడం,
[34] వీటివల్ల నీకు దారిద్రర్యం పరిగెత్తుకుంటూ వస్తుంది ఆయుధం ధరించిన సైనికుడు వచ్చినట్టు లేమి నీమీదికి వస్తుంది.