[1] ద్రాక్ష మద్యం ఎగతాళి పాలు చేస్తుంది. సారాయి మనిషిని గిల్లికజ్జాలు పెట్టుకునేలా చేస్తుంది. తప్ప తాగి దారి తప్పేవాడు బుద్ధి లేని వాడు.
[2] రాజు వల్ల కలిగే భయం సింహగర్జన వంటిది. రాజుకు కోపం రేపే వాడు తన ప్రాణానికే ముప్పు తెచ్చిపెట్టుకుంటాడు.
[3] కలహానికి దూరంగా ఉండడం మనిషికి గౌరవం. మూర్ఖుడు కావాలని వాదం పెట్టుకుంటాడు.
[4] నాట్లు వేసే కాలంలో సోమరిపోతు నాగలి పట్టడు. కోతకాలంలో పంటకోసం వస్తే వాడికి ఏమీ దొరకదు.
[5] మనిషి హృదయంలోని ఆలోచన లోతైన నీళ్ల వంటిది. వివేకం గలవాడు దాన్ని చేదుకుంటాడు.
[6] నేను నమ్మదగిన వాణ్ణి అని చాలామంది చెప్పుకుంటారు. అయితే నమ్మదగిన వాడు ఎవరికి కనిపిస్తాడు?
[7] యథార్థవర్తనుడు తన నీతిలో నడుచుకుంటాడు. అతని తదనంతరం అతని పిల్లలు ధన్యులౌతారు.
[8] న్యాయపీఠంపై కూర్చున్న రాజు తన కళ్ళతో చెడుతనాన్ని చెదరగొడతాడు.
[9] నా హృదయాన్ని శుద్ధి చేసుకున్నాను. పాపమంతా వదిలించుకున్నాను అని ఎవరు అనగలరు?
[10] వేరువేరు తూకం రాళ్లు వేరువేరు కొలత గిన్నెలు, ఈ రెంటినీ యెహోవా అసహ్యించుకుంటాడు.
[11] చిన్నవాళ్ళను సైతం వారి చర్యలను బట్టి, వారి ప్రవర్తన శుద్ధమైనదా, యథార్థమైనదా అనే దాన్ని బట్టి వాళ్ళు ఎలాటి వాళ్ళో చెప్పవచ్చు.
[12] వినగల చెవి చూడగల కన్ను ఈ రెంటిని యెహోవాయే చేశాడు.
[13] అతిగా నిద్ర పోవద్దు. లేకపోతే దరిద్రం ముంచుకు వస్తుంది. మేలుకుని ఉంటే కడుపు నిండా ఆహారం ఉంటుంది.
[14] కొనేవాడు నాసిరకం అంటాడు. అవతలికి వెళ్లి దాన్నే మెచ్చుకుంటాడు.
[15] బంగారం, విస్తారంగా రత్నాలు ఉన్నాయి. కానీ వివేకంగా మాట్లాడే పెదాలు అమూల్యమైన ఆభరణాలు.
[16] పరాయివాడికి హామీగా ఉన్నవాడి బట్టలు తీసుకో. వ్యభిచారిణి కోసం పూచీ తీసుకున్న వాణ్ణి బాధ్యుడుగా ఎంచు.
[17] మోసం చేసి తెచ్చిన ఆహారం మనుషులకు మధురంగా ఉంటుంది. కానీ తరువాత నోరంతా మట్టిగొట్టుకు పోతుంది.
[18] ఉద్దేశాలు ఆలోచనచేత స్థిరం అవుతాయి. వివేక పూరితమైన నాయకత్వం ఉన్నప్పుడు మాత్రమే యుద్ధం చెయ్యి.
[19] కొండేలు చెప్తూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయట పెడతాడు. కాబట్టి వాగుడు కాయల జోలికి పోవద్దు.
[20] తన తండ్రిని గానీ తల్లిని గానీ దూషించేవాడి దీపం కారుచీకట్లో ఆరిపోతుంది.
[21] నడమంత్రపు సిరి వల్ల చివరకూ దీవెనలు రావు.
[22] కీడుకు ప్రతికీడు తలపెట్టవద్దు. యెహోవా కోసం కనిపెట్టుకో. ఆయన నిన్ను కాపాడుతాడు.
[23] అన్యాయమైన తూకం రాళ్లు యెహోవాకు అసహ్యం. దొంగ త్రాసును ఆయన ఒప్పుకోడు.
[24] మనిషి ప్రవర్తన యెహోవా వశంలో ఉంటుంది. తనకు జరగబోయేది అతనికి ఎలా తెలుస్తుంది?
[25] తొందరపడి, ఇది దేవునికి ఇచ్చేస్తున్నానని చెప్పడం, మొక్కుబడి చేసిన తరువాత దాన్ని గూర్చి విచారించడం ప్రమాద హేతువు.
[26] జ్ఞానంగల రాజు భక్తిహీనులను చెల్లా చెదరు చేసేస్తాడు. అలాటి వాళ్ళ మీద బరువైన చక్రం దొర్లిస్తాడు.
[27] మనిషి ఆత్మ యెహోవా పెట్టిన దీపం. అది అంతరంగాలన్నిటినీ శోధిస్తుంది.
[28] కృప, సత్యం రాజుకు రక్ష. కృప మూలంగా అతడు తన సింహాసనాన్ని పదిలం చేసుకుంటాడు.
[29] యువకుల బలం వారికి శోభ. నెరిసిన తల వృద్ధులకు సౌందర్యం.
[30] గాయాలు చేసే దెబ్బలు మనసు లోతుల్లోకి దూరి చెడుతనాన్ని పరిహరిస్తాయి.