[1] ఇది దేవోక్తి. అంటే యాకె కుమారుడు ఆగూరు పలికిన మాటలు. అతడు ఈతీయేలుకు, ఉక్కాలుకు చెప్పిన మాట.
[2] నిశ్చయంగా మనుషుల్లో నావంటి పశుప్రాయుడు లేడు. మనుషులకు ఉండవలసిన ఇంగితం నాకు లేదు.
[3] నేను జ్ఞానాన్ని అభ్యసించలేదు. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం పొందలేదు.
[4] ఆకాశానికెక్కి దిగివచ్చిన వాడెవడు? తన పిడికిళ్లతో గాలిని పట్టుకున్నవాడెవడు? బట్టలో నీళ్లు మూటకట్టినవాడెవడు? భూమి దిక్కులన్నిటిని స్థాపించిన వాడెవడు? ఆయన పేరుగానీ ఆయన కుమారుడి పేరుగానీ నీకు తెలుసా?
[5] దేవుని మాటలన్నీ పవిత్రమైనవే. ఆయన్ని ఆశ్రయించే వారికి ఆయన డాలు.
[6] ఆయన మాటలతో ఏమీ చేర్చవద్దు. ఆయన నిన్ను గద్దిస్తాడేమో. అప్పుడు నీవు అబద్ధికుడివౌతావు.
[7] దేవా, నేను నీతో రెండు మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు.
[8] వ్యర్థమైన వాటిని ఆబద్ధాలను నాకు దూరం చెయ్యి. పేదరికాన్నిగానీ ఐశ్వర్యాన్ని గానీ నాకు ఇవ్వొద్దు. చాలినంత అన్నం మాత్రం పెట్టు.
[9] ఎక్కువైతే నేను కడుపు నిండి నిన్ను తిరస్కరించి “యెహోవా ఎవరు?” అంటానేమో. లేదా పేదరికం వల్ల దొంగతనం చేసి నా దేవుని నామాన్ని తెగనాడతానేమో.
[10] దాసుని గూర్చి వాడి యజమానితో కొండేలు చెప్పకు. వాడు నిన్ను తిట్టుకుంటాడు. ఒకవేళ నీవు శిక్షార్హుడి వౌతావు.
[11] తమ తండ్రిని శాపనార్థాలు పెడుతూ, తల్లిపట్ల వాత్సల్యత చూపని తరం ఉంది.
[12] తమ దృష్టికి తాము శుద్ధులై తమ మాలిన్యం శుభ్రం కానీ తరం ఉంది.
[13] కళ్ళు నెత్తికి వచ్చినవారి తరం ఉంది. వారి కనురెప్పలు ఎంత పైకి వెళ్లి పోయాయో గదా!
[14] దేశంలో ఉండకుండాా దరిద్రులను మింగేస్తూ మనుషుల్లో ఉండకుండాా పేదలను నశింపజేయడానికి కత్తుల్లాటి పళ్లు, పదునైన దవడ పళ్లు ఉన్న వారి తరం ఉంది.
[15] జలగకు ఇవ్వు, ఇవ్వు అనే పేరున్న కూతురులిద్దరు ఉన్నారు. తృప్తిలేనివి మూడు ఉన్నాయి. చాలు అని పలకనివి నాలుగు ఉన్నాయి.
[16] పాతాళం, గొడ్రాలి గర్భం, నీరు చాలు అనని భూమి, చాలు అనని అగ్ని.
[17] తండ్రిని దూషిస్తూ తల్లి మాట వినని వాడి కళ్ళు లోయ కాకులు పీక్కుతింటాయి. పక్షిరాజు పిల్లలు వాటిని తింటాయి.
[18] నా బుద్ధికి మించినవి మూడు ఉన్నాయి. నేను గ్రహించలేనివి నాలుగు ఉన్నాయి.
[19] అవి, అంతరిక్షంలో గరుడ పక్షి జాడ, బండమీద పాము జాడ, నడిసముద్రంలో ఓడ వెళ్ళే జాడ, కన్యతో మగవాడి జాడ.
[20] వ్యభిచారిణి మార్గం కూడా అలాటిదే. ఆమె తిని నోరు తుడుచుకుని నాకేం తెలియదంటుంది.
[21] భూమిని వణకించేవి మూడు ఉన్నాయి, అది మోయ లేనివి నాలుగు ఉన్నాయి.
[22] అవి గద్దెనెక్కిన సేవకుడు, కడుపు నిండా అన్నం ఉన్న మూర్ఖుడు,
[23] పెళ్లి చేసుకున్న గయ్యాళి గంప, యజమానురాలికి హక్కు దారైన దాసి.
[24] భూమి మీద చిన్నవి నాలుగు ఉన్నాయి అయినా అవి ఎంతో జ్ఞానం గలవి.
[25] చీమలు బలం లేని జీవులు. అయినా అవి వేసవిలో తమ ఆహారం సిద్ధపరచుకుంటాయి.
[26] చిన్న కుందేళ్లు బలం లేని జీవులు అయినా అవి బండ సందుల్లో నివాసాలు కల్పించుకుంటాయి.
[27] మిడతలకు రాజు లేడు అయినా అవన్నీ బారులు తీరి సాగిపోతాయి.
[28] నీవు బల్లిని చేతితో పట్టుకోగలవు. అయినా రాజ గృహాల్లో అది ఉంటుంది.
[29] డంబంగా నడుచుకునేవి మూడు ఉన్నాయి. ఠీవిగా నడిచేవి నాలుగు ఉన్నాయి.
[30] అవి మృగాలన్నిటిలో బలం కలిగి ఎవరికీ భయపడి వెనుదిరుగని సింహం,
[31] బడాయిగా నడిచే కోడి పుంజు, మేకపోతు, తన సేనకు ముందు నడుస్తున్న రాజు.
[32] నీవు బుద్ధిహీనుడవై గర్వించి ఉంటే, కీడు కలిగించే పన్నాగం పన్ని ఉంటే నీ చేత్తో నోరు మూసుకో.
[33] పాలు చిలికితే వెన్న పుడుతుంది. ముక్కు పిండితే రక్తం కారుతుంది. కోపం రేపితే కలహం పుడుతుంది.