[1] దొంగ త్రాసు యెహోవాకు అసహ్యం. న్యాయమైన తూకం ఆయనకు ఇష్టం.
[2] గర్వం వెనకాలే అవమానం బయలు దేరుతుంది. జ్ఞానం గలవారు వినయ విధేయతలు కలిగి ఉంటారు.
[3] నిజాయితీ గల వారిని వారి న్యాయబుద్ధి నడిపిస్తుంది. దుర్మార్గుల మూర్ఖత్వం వారిని చెడగొడుతుంది.
[4] దేవుని ఉగ్రత దినం వచ్చినప్పుడు ఆస్తిపాస్తులు ఉపయోగపడవు. నీతిమంతులు మరణం నుండి తప్పించు కుంటారు.
[5] యథార్థవంతుల న్యాయ ప్రవర్తన వారి మార్గాన్ని సరళం చేస్తుంది. దుష్టులు తమ దుర్మార్గ క్రియలవల్ల కూలిపోతారు.
[6] నిజాయితీపరుల మంచితనం వారికి విడుదల కలిగిస్తుంది. ద్రోహులు తమ దురాశ చేత చిక్కుల్లో పడతారు.
[7] దుష్టుడు చనిపోయినప్పుడు వాడి ఆశాభావం అంతరించిపోతుంది. బలవంతుడి కోరికలు భగ్నమైపోతాయి.
[8] ఉత్తముడు కష్టాల నుండి విడుదల పొందుతాడు. మూర్ఖులు కష్టాలు కొనితెచ్చుకుంటారు.
[9] మూర్ఖుడు తన నోటి మాటచేత తన పొరుగువారికి నాశనం కలిగిస్తాడు. నీతిమంతులు తమ తెలివి ఉపయోగించి తప్పించుకుంటారు.
[10] నీతిమంతులు దీవెన పొందడం పట్టణానికి శుభదాయకం. దుర్మార్గులు నాశనమైతే ఆనంద ధ్వనులు మోగుతాయి.
[11] నీతిమంతులు దీవెనలు పొందితే పట్టణం ఉన్నత స్థితికి చేరుతుంది. దుష్టుల మాటలు దాన్ని కూలిపోయేలా చేస్తాయి.
[12] తన పొరుగువాణ్ణి కించపరిచేవాడు జ్ఞానహీనుడు. వివేకం గల వాడు మౌనం వహిస్తాడు.
[13] చాడీలు చెబుతూ తిరిగేవాడు ఇతరుల గుట్టు బయటపెడతాడు. నమ్మకస్థుడు రహస్యాలు దాస్తాడు.
[14] మార్గదర్శకులు లేకపోతే ప్రజలు నాశనం అవుతారు. సలహాలిచ్చే వాళ్ళు ఎక్కువ మంది ఉండడం ప్రజలకు క్షేమకరం.
[15] పరాయివాడి కోసం హామీ ఉన్నవాడు కష్టాలపాలవుతాడు. హామీ ఉండని వాడు భయం లేకుండా ఉంటాడు.
[16] మృదు స్వభావం గల స్త్రీని అందరూ కీర్తిస్తారు. బలం గలవారు సంపద చేజిక్కుంచుకుంటారు.
[17] దయగలవాడు చేసే మంచి పనులు అతనికి మేలు చేస్తాయి. దుష్టుడు తన దుష్ట కార్యాలవల్ల తన శరీరానికి ఆపద తెచ్చుకుంటాడు.
[18] దుష్టుల సంపద వాళ్ళను మోసపరుస్తుంది. నీతి అనే విత్తనం నాటేవాడు శాశ్వతమైన బహుమానం పొందుతాడు.
[19] వాస్తవమైన నీతి జీవానికి మూలం. అదే పనిగా చెడ్డ కార్యాలు చేసేవాడు తన మరణానికి దగ్గరౌతాడు.
[20] మూర్ఖులైన దుష్ట ప్రజలు యెహోవాకు అసహ్యులు. యథార్థవంతులను ఆయన ప్రేమిస్తాడు.
[21] భక్తిహీనులకు తప్పకుండా శిక్ష పడుతుంది. నీతిమంతుల సంతతి విడుదల పొందుతారు.
[22] స్త్రీ ఎంత అందంగా ఉన్నప్పటికీ ఆమెకు వివేకం లేకపోతే ఆ స్త్రీ పంది ముక్కుకు తొడిగిన బంగారు ముక్కుపుడకతో సమానం.
[23] నీతిమంతులు ఉత్తమమైన వాటినే కోరుకుంటారు. దుష్టుల ఆశలు అహంకార పూరితం.
[24] ధారాళంగా ఇచ్చి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కూడా ఉన్నారు.
[25] ఔదార్యం చూపేవారు వర్ధిల్లుతారు. నీళ్లు పోసేవాడికి నీళ్లు పోస్తారు.
[26] ధాన్యం అక్రమంగా నిల్వ చేసే వాణ్ణి ప్రజలు శపిస్తారు. దాన్ని సక్రమంగా అమ్మే వాడికి దీవెనలు కలుగుతాయి.
[27] మేలు చేయాలని కోరేవాడు ఉపయోగకరమైన పనులు చేస్తాడు. కీడు చేయాలని కోరుకునే వాడికి కీడే కలుగుతుంది.
[28] సంపదను నమ్ముకున్నవాడు చెదిరిపోతాడు. నీతిమంతులు చిగురుటాకుల వలే వృద్ధి చెందుతారు.
[29] తన ఇంటివారిని బాధపెట్టేవాడు గాలికి చెదిరి పోతాడు. వివేకం లేనివాడు జ్ఞానం గలవాడికి సేవకుడు అవుతాడు.
[30] నీతిమంతులు జీవ వృక్ష ఫలాలు ఫలిస్తారు. జ్ఞానవంతులు ఇతరులను రక్షిస్తారు.
[31] నీతిమంతులు ఈ లోకంలో తగిన ప్రతిఫలం పొందుతారు. అలాగే, దుష్టులకు, పాపులకు తప్పనిసరిగా తగిన ప్రతిఫలం కలుగుతుంది గదా.