Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:02

[1] యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “నువ్వు ఇశ్రాయేలీయులతో చెప్పు,

[2] ‘కనాను దేశంలో, అంటే ఏ దేశాన్ని మీరు చీట్లు వేసి వారసత్వంగా పంచుకోబోతున్నారో ఆ దేశంలో మీరు ప్రవేశిస్తున్నారు.

[3] మీ దక్షిణపు సరిహద్దు సీను అరణ్యం మొదలు ఎదోము సరిహద్దు వరకూ, అంటే, ఉప్పు సముద్రం తూర్పు తీరం వరకూ ఉంటుంది.

[4] మీ సరిహద్దు దక్షిణం మొదలు అక్రబ్బీము కనుమ దగ్గర తిరిగి సీను వరకూ వ్యాపిస్తుంది. అది దక్షిణం నుండి కాదేషు బర్నేయ వరకూ వ్యాపించి, అక్కడ నుండి హసరద్దారు వరకూ పోయి, అక్కడ నుండి అస్మోను వరకూ కొనసాగుతుంది.

[5] అస్మోను నుండి ఐగుప్తు నది వరకూ సరిహద్దు తిరిగి సముద్రం వరకూ వ్యాపిస్తుంది.

[6] మీకు పడమటి సరిహద్దుగా మహాసముద్రం ఉంటుంది.

[7] మీ ఉత్తరపు సరిహద్దును మహాసముద్రం నుండి హోరు కొండ దాకా,

[8] హోరు కొండ నుండి హమాతుకు వెళ్ళే దారి వరకూ ఏర్పాటు చేసుకోవాలి. ఆ సరిహద్దు సెదాదు వరకూ,

[9] అక్కడ నుండి జిప్రోను వరకూ వ్యాపిస్తుంది. దాని అంచు హసరేనాను దగ్గర ఉంటుంది. అది మీకు ఉత్తరపు సరిహద్దు.

[10] తూర్పు సరిహద్దు హసరేనాను నుండి షెపాము వరకూ మీరు లెక్కించుకోవాలి.

[11] అది షెపాము నుండి అయీనుకు తూర్పున రిబ్లా వరకూ ఉంటుంది. ఆ సరిహద్దు దిగి తూర్పున కిన్నెరెతు సముద్రపు ఒడ్డును తాకుతూ ఉంటుంది.

[12] అది యొర్దాను నది వరకూ దిగి ఉప్పు సముద్రం వరకూ వ్యాపిస్తుంది. ఆ దేశం చుట్టూ ఉన్న సరిహద్దుల మధ్య ఉన్న ప్రాంతమంతా మీ దేశం’ అని వారితో చెప్పు.”

[13] మోషే ఇశ్రాయేలీయులతో “ఇది మీరు చీట్లు వేసుకుని పొందే దేశం. తొమ్మిది గోత్రాలకు, ఒక అర్థ గోత్రానికి ఇవ్వమని యెహోవా ఆజ్ఞాపించాడు.

[14] ఎందుకంటే తమ పూర్వీకుల కుటుంబాల ప్రకారం రూబేనీయులు, గాదీయులు తమ వారసత్వాలను పొందారు.

[15] అలాగే మనష్షే అర్థగోత్రం కూడా వారసత్వం పొందింది. ఆ రెండు గోత్రాలు, అర్థ గోత్రం, సూర్యోదయం దిక్కున, అంటే తూర్పున యెరికో దగ్గర యొర్దాను అవతల తమ తమ వారసత్వాలను పొందారు” అని చెప్పాడు.

[16] అప్పుడు యెహోవా మోషేతో ఇలా చెప్పాడు,

[17] “ఆ దేశాన్నిమీకు వారసత్వంగా పంచి పెట్టాల్సిన వ్యక్తులు ఎవరంటే, యాజకుడు ఎలియాజరు, నూను కొడుకు యెహోషువ.

[18] వారు కాక ఆ దేశాన్ని మీకు పంచిపెట్టడానికి ప్రతి గోత్రం నుండి ఒక్క నాయకుణ్ణి ఎన్నుకోవాలి.

[19] వారెవరంటే, యూదా గోత్రంలో యెఫున్నె కొడుకు కాలేబు,

[20] షిమ్యోను గోత్రంలో అమీహూదు కొడుకు షెమూయేలు,

[21] బెన్యామీను గోత్రంలో కిస్లోను కొడుకు ఎలీదాదు.

[22] దాను గోత్రంలో యొగ్లి కొడుకు బుక్కీ నాయకుడు.

[23] యోసేపు కొడుకుల్లో ఏఫోదు కొడుకు హన్నీయేలు, మనష్షే గోత్ర నాయకుడు,

[24] ఎఫ్రాయిము గోత్రంలో షిప్తాను కొడుకు కెమూయేలు నాయకుడు,

[25] జెబూలూను గోత్రంలో పర్నాకు కొడుకు ఎలీషాపాను నాయకుడు,

[26] ఇశ్శాఖారీయుల గోత్రంలో అజాను కొడుకు పల్తీయేలు నాయకుడు,

[27] ఆషేరీయుల గోత్రంలో షెలోమి కొడుకు అహీహూదు నాయకుడు.

[28] నఫ్తాలీయుల గోత్రంలో అమీహూదు కొడుకు పెదహేలు నాయకుడు.”

[29] వీరంతా కనాను దేశంలో ఇశ్రాయేలీయులకు వారి వారి వారసత్వాలను పంచిపెట్టడానికి యెహోవా ఆజ్ఞాపించినవారు.

సంఖ్యాకాండం — Chapters