Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:25

[1] అప్పుడు యోసేపు కొడుకు మనష్షే వంశస్థుల్లో సెలోపెహాదు కూతుళ్ళు వచ్చారు. సెలోపెహాదు హెసెరుకు కొడుకు, గిలాదుకు మనవడు, మాకీరుకు మునిమనవడు. అతని కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.

[2] వారు సన్నిధి గుడారం ద్వారం దగ్గర, మోషే ఎదుట, యాజకుడైన ఎలియాజరు ఎదుట, నాయకుల ఎదుట, సమాజమంతటి ఎదుట నిలిచి “మా తండ్రి ఎడారిలో చనిపోయాడు.

[3] అతడు కోరహు గుంపులో, అంటే యెహోవాకు విరోధంగా కూడినవారి గుంపులో లేడు. తన పాపాన్నిబట్టి, తన సొంత పాపాన్నిబట్టి చనిపోయాడు.

[4] అతనికి కొడుకులు పుట్టలేదు. అతనికి కొడుకులు లేనంత మాత్రాన మా తండ్రి పేరు అతని వంశంలోనుంచి తీసెయ్యాలా? మా తండ్రి సహోదరులతో పాటు మాకు కూడా స్వాస్థ్యం ఇవ్వండి” అన్నారు.

[5] అప్పుడు మోషే వారి కోసం యెహోవా సన్నిధిలో అడిగాడు,

[6] యెహోవా మోషేతో “సెలోపెహాదు కూతుళ్ళు చెప్పింది నిజమే.

[7] కచ్చితంగా వారి తండ్రి సహోదరులతో పాటు వారసత్వం వారి ఆధీనం చేసి, వారి తండ్రి స్వాస్థ్యం వాళ్లకు వచ్చేలా చూడు.

[8] ఇంకా నువ్వు ఇశ్రాయేలీయులతో, ఇలా చెప్పు. ఒకడు కొడుకు పుట్టకుండా చనిపోతే మీరు అతని భూస్వాస్థ్యం అతని కూతుళ్ళకు వచ్చేలా చూడాలి.

[9] అతనికి కూతుళ్ళు లేకపోతే అతని అన్నదమ్ములకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి.

[10] అతనికి అన్నదమ్ములు లేకపోతే అతని భూస్వాస్థ్యం అతని తండ్రి అన్నదమ్ములకు ఇవ్వాలి.

[11] అతని తండ్రికి అన్నదమ్ములు లేకపోతే అతని కుటుంబంలో అతని సమీప బంధువుకు అతని స్వాస్థ్యం ఇవ్వాలి. వాడు దాన్ని స్వాధీనం చేసుకుంటాడు. యెహోవా నాకు ఆజ్ఞాపించినట్టు ఇది ఇశ్రాయేలీయులకు విధించిన శాసనం” అన్నాడు.

[12] ఇంకా యెహోవా మోషేతో “నువ్వు ఈ అబారీము కొండెక్కి నేను ఇశ్రాయేలీయులకు ఇచ్చిన దేశాన్ని చూడు.

[13] నువ్వు దాన్ని చూసిన తరువాత, నీ సహోదరుడు అహరోను చేరినట్టు నువ్వు కూడా నీ సొంతవారితో చేరిపోతావు.

[14] ఎందుకంటే, సీను ఎడారిలో సమాజం వాదించినప్పుడు ఆ నీళ్ల దగ్గర వారి కళ్ళ ఎదుట నన్ను ఘనపరచకుండా, నా మీద మీరు తిరగబడ్డారు” అన్నాడు. ఆ నీళ్లు సీను ఎడారిలో కాదేషులో ఉన్న మెరీబా నీళ్ళు.

[15] అప్పుడు మోషే యెహోవాతో “యెహోవా, సమస్త మానవుల ఆత్మలకు దేవా, సమాజం కాపరి లేని గొర్రెల్లా ఉండకుండాా ఈ సమాజం మీద యెహోవా ఒకణ్ణి నియమించు గాక.

[16] అతడు వారి ముందు వస్తూ, పోతూ,

[17] వాళ్లకు నాయకుడుగా ఉండడానికి సమర్థుడుగా ఉండాలి” అన్నాడు.

[18] అందుకు యెహోవా మోషేతో “నూను కొడుకు యెహోషువలో నా ఆత్మ నివసిస్తూ ఉంది. నువ్వు అతన్ని తీసుకుని అతని మీద నీ చెయ్యి పెట్టి

[19] యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట, అతని నిలబెట్టి, వారి కళ్ళ ఎదుట అతనికి ఆజ్ఞ ఇవ్వు.

[20] ఇశ్రాయేలీయుల సమాజమంతా అతని మాట వినేలా నీ అధికారంలో కొంత అతని మీద పెట్టు.

[21] యాజకుడైన ఎలియాజరు ఎదుట అతడు నిలిచినప్పుడు అతడు యెహోవా సన్నిధిలో ఊరీము నిర్ణయం ద్వారా అతని కోసం అడగాలి. అతడు, అతనితోపాటు ఇశ్రాయేలీయులందరూ, అంటే, సమాజమంతా ప్రతి పని అతని మాట ప్రకారం చెయ్యాలి” అన్నాడు.

[22] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు అతడు చేశాడు. అతడు యెహోషువను తీసుకుని యాజకుడైన ఎలియాజరు ఎదుట, సమాజమంతటి ఎదుట అతన్ని నిలబెట్టి,

[23] అతని మీద తన చేతులు పెట్టి, యెహోవా మోషే ద్వారా ఆజ్ఞాపించినట్టు అతనికి ఆజ్ఞ ఇచ్చాడు.

సంఖ్యాకాండం — Chapters