[1] మోషే అహరోనుల నాయకత్వంలో తమ తమ సేనల ప్రకారం ఐగుప్తుదేశం నుండి ఇశ్రాయేలీయులు చేసిన ప్రయాణాలు.
[2] యెహోవా ఆజ్ఞాపించిన ప్రకారం, మోషే వారు ప్రయాణించిన మార్గాల వివరాలను రాశాడు. ఇవి వారి ప్రయాణ మార్గాల వివరాలు.
[3] మొదటి నెల 15 వ రోజున వారు రామెసేసు నుండి పస్కా పండగ మరునాడు ఇశ్రాయేలీయులు జయోత్సాహంతో బయలుదేరారు. అప్పుడు ఐగుప్తీయులు తమ మధ్య యెహోవా హతం చేసిన మొదటి సంతానాలను పాతిపెట్టుకుంటూ వారిని చూస్తూ ఉన్నారు.
[4] ఆ విధంగా ఐగుప్తీయుల దేవుళ్ళకు యెహోవా తీర్పు తీర్చాడు.
[5] ఇశ్రాయేలీయులు రామెసేసు నుండి సుక్కోతుకు వచ్చారు.
[6] సుక్కోతు నుండి అడవి చివరిలో ఉన్న ఏతాముకు వచ్చారు.
[7] ఏతాము నుండి బయల్సెఫోను ఎదుట ఉన్న పీహహీరోతు వైపు తిరిగి మిగ్దోలు దగ్గర ఆగారు.
[8] పీహహీరోతు నుండి సముద్రం మధ్య నుండి అరణ్యంలోకి వెళ్ళి ఏతాము అరణ్యంలో మూడు రోజుల ప్రయాణం చేసి మారాకు వచ్చారు. మారా నుండి ఏలీముకు వచ్చారు.
[9] ఏలీములో 12 నీటిబుగ్గలు, 70 ఈతచెట్లు ఉన్నాయి. వారక్కడ ఆగారు.
[10] ఏలీము నుండి వారు ఎర్ర సముద్రం దగ్గరికి వచ్చారు.
[11] అక్కడినుండి సీను అరణ్యంలో ఆగారు.
[12] సీను అరణ్యం నుండి దోపకాకు వచ్చారు.
[13] దోపకా నుండి ఆలూషుకు వచ్చారు.
[14] ఆలూషు నుండి రెఫీదీముకు వచ్చారు. అక్కడ వారికి తాగడానికి నీళ్లు లేవు.
[15] రెఫీదీము నుండి సీనాయి అరణ్యంలో ఆగారు.
[16] అక్కడి నుండి కిబ్రోతు హత్తావాకు వచ్చారు.
[17] కిబ్రోతు హత్తావా నుండి హజేరోతు వచ్చారు.
[18] హజేరోతు నుండి రిత్మా వచ్చారు.
[19] రిత్మా నుండి రిమ్మోను పారెసుకు వచ్చారు.
[20] రిమ్మోను పారెసు నుండి లిబ్నాకు వచ్చారు.
[21] లిబ్నాలో నుండి రీసాకు వచ్చారు.
[22] రీసా నుండి కెహేలాతాకు వచ్చారు.
[23] కెహేలాతా నుండి బయలుదేరి షాపెరు కొండ దగ్గర ఆగారు.
[24] షాపెరు కొండ దగ్గర నుండి హరాదాకు వచ్చారు.
[25] హరాదా నుండి మకెలోతుకు వచ్చారు.
[26] మకెలోతు నుండి తాహతుకు వచ్చారు.
[27] తాహతు నుండి తారహుకు వచ్చారు.
[28] తారహు నుండి మిత్కాకు వచ్చారు.
[29] మిత్కా నుండి హష్మోనాకు వచ్చారు.
[30] హష్మోనా నుండి మొసేరోతుకు వచ్చారు.
[31] మొసేరోతు నుండి బెనేయాకానుకు వచ్చారు.
[32] బెనేయాకాను నుండి హోర్‌హగ్గిద్గాదుకు వచ్చారు.
[33] హోర్‌హగ్గిద్గాదు నుండి యొత్బాతాకు వచ్చారు.
[34] యొత్బాతా నుండి ఎబ్రోనాకు వచ్చారు.
[35] ఎబ్రోనా నుండి ఎసోన్గెబెరుకు వచ్చారు.
[36] ఎసోన్గెబెరు నుండి కాదేషు అని పిలిచే సీను అరణ్యానికి వచ్చారు.
[37] కాదేషు నుండి ఎదోము దేశం అంచులో ఉన్న హోరు కొండ దగ్గర ఆగారు.
[38] యెహోవా ఆజ్ఞ ప్రకారం యాజకుడు అహరోను హోరు కొండ ఎక్కి అక్కడ చనిపోయాడు. అది ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశం నుండి వచ్చిన 40 వ సంవత్సరం అయిదో నెల మొదటి రోజు.
[39] అహరోను 123 సంవత్సరాల వయసులో హోరు కొండమీద చనిపోయాడు.
[40] అప్పుడు కనాను దేశపు దక్షిణాన నివసించే అరాదు రాజైన కనానీయుడు ఇశ్రాయేలీయులు వచ్చిన సంగతి విన్నాడు.
[41] వారు హోరు కొండ నుండి సల్మానాకు వచ్చారు.
[42] సల్మానాలో నుండి పూనోనుకు వచ్చారు.
[43] పూనోనులో నుండి ఓబోతుకు వచ్చారు.
[44] ఓబోతు నుండి మోయాబు పొలిమేర దగ్గర ఉన్న ఈయ్యె అబారీముకు వచ్చారు.
[45] ఈయ్యె అబారీము నుండి దీబోను గాదుకు వచ్చారు.
[46] దీబోను గాదు నుండి అల్మోను దిబ్లాతాయిముకు వచ్చారు.
[47] అల్మోను దిబ్లాతాయిము నుండి నెబో ఎదురుగా ఉన్న అబారీము కొండలకు వచ్చారు.
[48] అబారీము కొండల నుండి యెరికో దగ్గర యొర్దానుకు దగ్గరగా ఉన్న మోయాబు మైదానాలకు వచ్చారు.
[49] వారు మోయాబు మైదానాల్లో బెత్యేషీమోతు మొదలు ఆబేలు షిత్తీము వరకూ యొర్దాను దగ్గర విడిది చేశారు.
[50] యెరికో దగ్గర, అంటే యొర్దానుకు పక్కనే ఉన్న మోయాబు మైదానాల్లో యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,
[51] “నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు, ‘మీరు యొర్దానును దాటి కనాను దేశాన్ని చేరిన తరువాత
[52] ఆ దేశ ప్రజలందరినీ మీ ఎదుట నుండి వెళ్లగొట్టి, వారి ప్రతిమలన్నిటినీ ధ్వంసం చేసి వారి పోత విగ్రహాలన్నిటిని పగలగొట్టి వారి ఉన్నత ప్రదేశాల్లో ఉన్న వారి పూజా స్థలాలను పాడుచేయాలి.
[53] ఆ దేశాన్ని స్వాధీనం చేసుకుని దానిలో నివసించాలి. ఎందుకంటే ఆ దేశాన్ని మీకు వారసత్వంగా నేను మీ స్వాధీనం చేశాను.
[54] మీరు మీ వంశాల ప్రకారం చీట్లు వేసి ఆ దేశాన్ని వారసత్వంగా పంచుకోవాలి. ఎక్కువ మందికి ఎక్కువ, తక్కువ మందికి తక్కువ వారసత్వం ఇవ్వాలి. చీటీ ప్రకారం ఎవరికి ఏ స్థలం వస్తుందో ఆ స్థలమే అతడు తీసుకోవాలి. మీ తండ్రుల గోత్రాల ప్రకారం మీరు వారసత్వం పొందాలి.
[55] అయితే మీరు మీ ఎదుట నుండి ఆ దేశ ప్రజలను వెళ్లగొట్టకపోతే, మీరు ఎవరిని ఉండనిచ్చారో వారు మీ కళ్ళలో ముళ్ళుగా, మీ పక్కలో శూలాలుగా ఉండి, మీరు నివసించే ఆ దేశంలో వారు మిమ్మల్ని బాధలకు గురిచేస్తారు.
[56] అంతేగాక నేను వారికి ఏం చేయాలనుకున్నానో దానినే మీకు కూడా చేస్తాను.’”