[1] యెహోవా సీనాయి అరణ్యంలో ఉన్న సన్నిధి గుడారంలో నుండి మోషేతో మాట్లాడాడు. ఇది ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశం నుండి బయటకు వచ్చిన రెండో సంవత్సరం రెండో నెల మొదటి తేదీన జరిగింది. యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.
[2] “ఇశ్రాయేలు ప్రజల జనాభా లెక్కలు వారి వారి వంశాల ప్రకారం, పూర్వీకుల కుటుంబాల ప్రకారం రాయించు. వారి పేర్లు రాయించు.
[3] ఇశ్రాయేలు రాజ్యం కోసం సైనికులుగా యుద్ధానికి వెళ్ళగలిగిన వారు, ఇరవై ఇంకా ఆ పై వయసున్న పురుషులందరినీ లెక్కపెట్టు. ఒక్కో దళంలో ఎంతమంది పురుషులున్నారో నువ్వూ, అహరోనూ కలసి నమోదు చేయాలి.
[4] మీతో కలసి సేవ చేయడానికి ఒక్కో గోత్రం నుండి ఒక వ్యక్తి గోత్ర నాయకుడిగా ఉండాలి. అతడు తన తెగలో ప్రముఖుడై ఉండాలి.
[5] మీతో కలసి పోరాటాల్లో పాల్గొనే నాయకులు వీరు. రూబేను గోత్రం నుండి షెదేయూరు కొడుకు ఏలీసూరు,
[6] షిమ్యోను గోత్రం నుండి సూరీషద్దాయి కొడుకు షెలుమీయేలు,
[7] యూదా గోత్రం నుండి అమ్మీనాదాబు కొడుకు నయస్సోను,
[8] ఇశ్శాఖారు గోత్రం నుండి సూయారు కొడుకు నెతనేలు
[9] జెబూలూను గోత్రం నుండి హేలోను కొడుకు ఏలీయాబు.
[10] యోసేపు సంతానమైన ఎఫ్రాయిము గోత్రం నుండి అమీహూదు కొడుకు ఎలీషామాయు, మనష్షే గోత్రం నుండి పెదాసూరు కొడుకు గమలీయేలు,
[11] బెన్యామీను గోత్రం నుండి గిద్యోనీ కొడుకు అబీదాను,
[12] దాను గోత్రం నుండి అమీషద్దాయి కొడుకు అహీయెజెరు,
[13] ఆషేరు గోత్రం నుండి ఒక్రాను కొడుకు పగీయేలు,
[14] గాదు గోత్రం నుండి దెయూవేలు కొడుకు ఎలాసాపు
[15] నఫ్తాలి గోత్రం నుండి ఏనాను కొడుకు అహీర.”
[16] వీళ్ళంతా ప్రజల్లోనుండి నియమితులయ్యారు. వీరు తమ పూర్వీకుల గోత్రాలకు నాయకులుగానూ, ఇశ్రాయేలు ప్రజల తెగలకు పెద్దలుగానూ ఉన్నారు.
[17] ఈ పేర్లతో ఉన్న వ్యక్తులను మోషే అహరోనులు పిలిచారు.
[18] వీళ్ళతో పాటు ఇశ్రాయేలు ప్రజల్లో పురుషులందరినీ రెండో నెల మొదటి రోజున సమావేశపర్చారు. ఇరవై ఏళ్ళూ ఆ పై వయసున్న వారు తమ తమ వంశాలనూ, పూర్వీకుల కుటుంబాలనూ తమ తెగల పెద్దల పేర్లనూ తెలియజేసారు.
[19] అప్పుడు యెహోవా తనకాజ్ఞాపించినట్టుగా సీనాయి అరణ్యంలో మోషే వారి సంఖ్య నమోదు చేశాడు.
[20] ఇశ్రాయేలు మొదటి కొడుకు రూబేను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[21] అలా రూబేను గోత్రం నుండి 46, 500 మందిని లెక్కించారు.
[22] షిమ్యోను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[23] అలా షిమ్యోను గోత్రం నుండి 59, 300 మందిని లెక్కించారు.
[24] గాదు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[25] అలా గాదు గోత్రం నుండి 45, 650 మందిని లెక్కించారు.
[26] యూదా సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాల, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[27] అలా యూదా గోత్రం నుండి 74, 600 మందిని లెక్కించారు.
[28] ఇశ్శాఖారు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[29] అలా ఇశ్శాఖారు గోత్రం నుండి 54, 400 మందిని లెక్కించారు.
[30] జెబూలూను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[31] అలా జెబూలూను గోత్రం నుండి 57, 400 మందిని లెక్కించారు.
[32] యోసేపు కొడుకుల్లో ఒకడైన ఎఫ్రాయిము సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[33] అలా ఎఫ్రాయిము గోత్రం నుండి 40, 500 మందిని లెక్కించారు.
[34] మనష్షే సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[35] అలా మనష్షే గోత్రం నుండి 32, 200 మందిని లెక్కించారు.
[36] బెన్యామీను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[37] అలా బెన్యామీను గోత్రం నుండి 35, 400 మందిని లెక్కించారు.
[38] దాను సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[39] అలా దాను గోత్రం నుండి 62, 700 మందిని లెక్కించారు.
[40] ఆషేరు సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[41] అలా ఆషేరు గోత్రం నుండి 41, 500 మందిని లెక్కించారు.
[42] నఫ్తాలి సంతానం వివరాలు ఇవి. వారిలో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధానికి వెళ్ళే సామర్థ్యం ఉన్నవారు తమ తమ వంశాలూ, పూర్వీకుల కుటుంబాల ప్రకారం పేర్లు నమోదు చేసుకున్నారు.
[43] అలా నఫ్తాలి గోత్రం నుండి 53, 400 మందిని లెక్కించారు.
[44] ఇశ్రాయేలులోని పన్నెండు గోత్రాలకు నాయకత్వం వహించిన వారితో పాటు వీరందర్నీ మోషే అహరోనులు లెక్కించారు.
[45] ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల్లో ఇరవై ఏళ్ళూ అంతకంటే ఎక్కువ వయస్సుండి, యుద్ధాలకు వెళ్ళగలిగే వారిందర్నీ వారి వారి పూర్వీకుల కుటుంబాల ప్రకారం లెక్కించారు.
[46] వారింతా కలసి 6,03,550 మంది అయ్యారు.
[47] కాని లేవీ వారసులను వారు లెక్కించలేదు.
[48] ఎందుకంటే యెహోవా మోషేకి ఇంతకు ముందే ఆజ్ఞాపించాడు.
[49] “లేవీ గోత్రికులను ఇశ్రాయేలు జనసంఖ్యలో చేర్చకూడదు. వారిని నమోదు చేయవద్దు.
[50] వాళ్లకు నిబంధన శాసనాల గుడారం బాధ్యతలు అప్పగించు. శాసనాల గుడారం లోని అలంకరణలూ, వస్తువులన్నిటినీ వారు చూసుకోవాలి. లేవీయులే గుడారాన్ని మోసుకుంటూ వెళ్ళాలి. దానిలో ఉన్న వస్తువులను వారే మోయాలి. దాని చుట్టూ వారు తమ గుడారాలు వేసుకోవాలి.
[51] గుడారాన్ని మరో స్థలానికి తరలించాల్సి వస్తే లేవీయులే దాన్ని ఊడదీయాలి. తిరిగి గుడారాన్ని నిలపాలన్నా లేవీయులే దాన్ని నిలపాలి. ఎవరన్నా పరాయి వ్యక్తి గుడారాన్ని సమీపిస్తే వాడికి మరణ శిక్ష విధించాలి.
[52] ఇశ్రాయేలు ప్రజలు వారి వారి సైనిక దళానికి చెందిన జెండా ఎక్కడ నాటారో అక్కడే తమ గుడారాలు వేసుకోవాలి.
[53] నా కోపం ఇశ్రాయేలు ప్రజలపైకి రాకుండా ఉండాలంటే లేవీయులు నిబంధన శాసనాల గుడారం చుట్టూ తమ నివాసాలు ఏర్పాటు చేసుకోవాలి. నిబంధన శాసనాల గుడారాన్ని వారే జాగ్రత్తగా చూసుకోవాలి.”
[54] ఇశ్రాయేలు ప్రజలు ఈ ఆజ్ఞల ప్రకారం అన్నీ చేసారు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటినీ ఇశ్రాయేలు ప్రజలు నెరవేర్చారు.