Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:18

[1] ఇశ్రాయేలీయులు షిత్తీములో ఉన్నప్పుడు ప్రజలు మోయాబు స్త్రీలతో వ్యభిచారం చెయ్యడం మొదలు పెట్టారు.

[2] ఆ స్త్రీలు తమ దేవుళ్ళ బలులకు ప్రజలను ఆహ్వానించినప్పుడు వీరు భోజనం చేసి వారి దేవుళ్ళకు నమస్కారం చేశారు.

[3] ఇశ్రాయేలీయులు బయల్పెయోరును ఆరాధించిన కారణంగా యెహోవా కోపం వారి మీద రగులుకుంది.

[4] అప్పుడు యెహోవా మోషేతో “నువ్వు ప్రజల నాయకులందర్నీ చంపి, నా ఎదుట, పట్టపగలు వారిని వేలాడదియ్యి. అప్పుడు నా కోపాగ్ని ఇశ్రాయేలీయుల మీద నుంచి తొలిగి పోతుంది” అని చెప్పాడు.

[5] కాబట్టి మోషే ఇశ్రాయేలీయుల నాయకులతో “మీలో ప్రతివాడూ, బయల్పెయోరును ఆరాధించే వారితో కలిసిన వారిని చంపాలి” అన్నాడు.

[6] అప్పుడు మోషే కళ్ళ ఎదుట, సన్నిధి గుడారం ద్వారం దగ్గర, ఏడుస్తూ ఉన్న ఇశ్రాయేలీయుల సమాజం అంతటి కళ్ళ ఎదుట, ఇశ్రాయేలీయుల్లో ఒకడు తన కుటుంబికుల మధ్యకు ఒక మిద్యాను స్త్రీని తీసుకొచ్చాడు.

[7] యాజకుడైన అహరోను మనవడు, ఎలియాజరు కొడుకు ఫీనెహాసు అది చూసి,

[8] సమాజం నుంచి లేచి, ఈటె చేత్తో పట్టుకుని ఆ ఇశ్రాయేలీయుడి వెంట ఆ గుడారంలోకి వెళ్లి ఆ ఇద్దరినీ, అంటే ఆ ఇశ్రాయేలీయుణ్ణీ, ఆ స్త్రీనీ, కడుపులో గుండా దూసుకు పోయేలా పొడిచాడు. అప్పుడు ఇశ్రాయేలీయుల్లోకి దేవుడు పంపించిన తెగులు ఆగిపోయింది.

[9] ఆ తెగులు వల్ల 24 వేల మంది చనిపోయారు.

[10] అప్పుడు యెహోవా మోషేతో “యాజకుడైన అహరోను మనవడూ, ఎలియాజరు కొడుకూ అయిన ఫీనెహాసు,

[11] వారి మధ్య నేను సహించలేనిదాన్ని తానూ సహించకపోవడం వల్ల ఇశ్రాయేలీయుల మీద నుంచి నా కోపం మళ్ళించాడు గనక నేను సహించలేకపోయినా ఇశ్రాయేలీయులను నాశనం చెయ్యలేదు.

[12] కాబట్టి నువ్వు అతనితో ఇలా అను, చూడు, నేను ఫినెహాసుకు నా సమాధాన నిబంధన చేస్తున్నాను.

[13] అది శాశ్వతమైన యాజక నిబంధనగా అతనికీ, అతని సంతానానికీ ఉంటుంది. ఎందుకంటే అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడుగా ఇశ్రాయేలీయుల కోసం ప్రాయశ్చిత్తం చేశాడు” అన్నాడు.

[14] ఫినెహాసు చంపినవాడి పేరు జిమ్రీ. అతడు షిమ్యోనీయుల్లో తన పితరుల వంశానికి నాయకుడైన సాలూ కొడుకు.

[15] ఫినెహాసు చంపిన స్త్రీ పేరు కొజ్బీ, ఆమె సూరు కూతురు. అతడు మిద్యానీయుల్లో ఒక గోత్రానికీ, కుటుంబానికీ నాయకుడు.

[16] ఇంకా యెహోవా మోషేతో “మిద్యానీయులను శత్రువులుగా భావించి వారి మీద దాడి చెయ్యండి.

[17] వారు మిమ్మల్ని మోసం చేసి మిమ్మల్ని శత్రువులుగా ఎంచారు.

[18] పెయోరు విషయంలో, తెగులు రోజున చంపిన తమ సహోదరి, మిద్యాను నాయకుని కూతురు కొజ్బీ విషయంలో, మిమ్మల్ని దుర్మార్గంలోకి నడిపించారు.”

సంఖ్యాకాండం — Chapters