Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:56

[1] అప్పుడు బిలాము బాలాకుతో “ఇక్కడ నా కోసం ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అన్నాడు.

[2] బిలాము చెప్పినట్టు బాలాకు చేసినప్పుడు, బాలాకు, బిలాము ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతునూ ఒక పొట్టేలునూ దహనబలిగా అర్పించారు.

[3] ఇంకా బిలాము బాలాకుతో “బలిపీఠం మీద నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. ఒకవేళ నన్ను కలవడానికి యెహోవా వస్తాడేమో. ఆయన నాకు ఏమి చూపిస్తాడో అది నీకు తెలియజేస్తాను” అని చెప్పి చెట్లు లేని కొండ ఎక్కి వెళ్ళాడు.

[4] దేవుడు బిలామును కలుసుకున్నప్పుడు, బిలాము ఆయనతో “నేను ఏడు బలిపీఠాలు కట్టి, ప్రతి దాని మీద ఒక దున్నపోతు, ఒక పొట్టేలును అర్పించాను” అని చెప్పాడు.

[5] యెహోవా ఒక వార్త బిలాము నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి అతనితో మాట్లాడు” అన్నాడు.

[6] అతడు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లినప్పుడు అతడు మోయాబు నాయకులందరితో తన దహనబలి దగ్గర నిలబడి ఉన్నాడు.

[7] అప్పుడు బిలాము ప్రవచనరీతిగా, “అరాము నుంచి బాలాకు, తూర్పు పర్వతాల నుంచి మోయాబురాజు నన్ను రప్పించి, ‘వచ్చి, నాకోసం యాకోబును శపించు’ అన్నాడు, ‘వచ్చి ఇశ్రాయేలును వ్యతిరేకించు’ అన్నాడు.

[8] దేవుడు శపించనివారిని నేనెలా శపించను? దేవుడు వ్యతిరేకించని వారిని నేనెలా వ్యతిరేకించను?

[9] రాతిబండల మీద నుంచి ఆయన్ని చూస్తున్నాను. కొండలపై నుండి ఆయన్ని కనుగొన్నాను. చూడు, ఒంటిగా నివసించే జనం ఒకటి ఉంది. వారు ఒక సాధారణ జనంగా తమను తాము ఎంచుకోరు.

[10] యాకోబు రేణువులను ఎవరు లెక్కించ గలరు? ఇశ్రాయేలులో నాల్గోవంతునైనా ఎవరు లేక్కించ గలరు? నీతిమంతుల మరణం లాంటి మరణం నాకు రానివ్వండి. నా జీవిత అంతం ఆయన జనంలా ఉండనివ్వండి” అన్నాడు.

[11] బాలాకు బిలాముతో “నువ్వు నాకు ఏం చేశావు? నా శత్రువులను శపించడానికి నిన్ను రప్పించాను. కాని నువ్వు వారిని దీవించావు” అన్నాడు.

[12] బిలాము జవాబిస్తూ “యెహోవా నా నోట ఉంచినదే నేను జాగ్రత్తగా పలకాలి కదా?” అన్నాడు.

[13] అప్పుడు బాలాకు అతనితో “దయచేసి నాతోపాటు ఇంకొక చోటికి రా. అక్కడనుంచి వారిని చూడొచ్చు. చివర ఉన్న వారిని మాత్రమే నువ్వు చూడ గలుగుతావు. వారందరూ నీకు కనిపించరు. అక్కడ నుంచి నా కోసం వారిని శపించాలి” అని చెప్పి

[14] పిస్గా కొండపైన ఉన్న కాపలావారి పొలానికి అతన్ని తీసుకెళ్ళి, ఏడు బలిపీఠాలు కట్టించి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.

[15] అప్పుడు బిలాము బాలాకుతో “నువ్వు ఇక్కడ నీ దహనబలి దగ్గర నిలిచి ఉండు. నేను అక్కడ యెహోవాను కలుసుకుంటాను” అన్నాడు.

[16] యెహోవా బిలామును కలుసుకుని ఒక వార్త అతని నోట ఉంచి “నువ్వు బాలాకు దగ్గరికి తిరిగి వెళ్లి నా వార్త అతనికి అందించు” అన్నాడు.

[17] అతడు బాలాకు దగ్గరికి వెళ్లినప్పుడు అతడు తన దహనబలి దగ్గర నిలిచి ఉన్నాడు. మోయాబు నాయకులు కూడా అతని దగ్గర ఉన్నారు. బాలాకు “యెహోవా ఏం చెప్పాడు?” అని అడిగాడు.

[18] బిలాము ప్రవచనంగా “బాలాకూ, లేచి విను. సిప్పోరు కుమారుడా, ఆలకించు.

[19] అబద్ధమాడడానికి దేవుడు మనిషి కాదు. మనస్సు మార్చుకోడానికి ఆయన మానవుడు కాదు. ఆయన వాగ్దానం చేసి కార్యం చెయ్యకుండా ఉంటాడా? ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా?

[20] చూడు, దీవించమని నాకు ఆజ్ఞ వచ్చింది. దేవుడు దీవెన ఇచ్చాడు. నేను దాన్ని మార్చలేను.

[21] ఆయన యాకోబులో కష్టం గాని, దోషం గాని కనుగొనలేదు. వారి దేవుడైన యెహోవా వాళ్లకు తోడుగా ఉన్నాడు.

[22] అడవిదున్న బలం లాంటి బలంతో దేవుడు వారిని ఐగుప్తులోనుంచి తీసుకొచ్చాడు.

[23] యాకోబుకు వ్యతిరేకంగా ఏ మంత్రం పనిచెయ్యదు. ఏ శకునం హాని చెయ్యదు. దానికి బదులుగా యాకోబు గురించీ, ఇశ్రాయేలు గురించీ ‘దేవుడు ఏం చేశాడో చూడు’ అని చెప్పుకోవాలి.

[24] చూడు, ఆ ప్రజలు ఆడసింహంలా లేస్తారు, ఆ జాతి సింహంలా బయటకు వచ్చి వేటాడుతుంది. చంపిన దాన్ని తిని, దాని రక్తం తాగే వరకూ అది పండుకోదు” అని పలికాడు.

[25] అప్పుడు బాలాకు బిలాముతో “వారిని శపించడం గాని, ఆశీర్వదించడం గాని ఏదీ చెయ్యొద్దు” అన్నాడు.

[26] కాని బిలాము “యెహోవా నాకు చెప్పిందంతా నేను చెయ్యాలని నేను నీతో చెప్పలేదా?” అని బాలాకుకు జవాబిచ్చాడు.

[27] బాలాకు బిలాముతో “నువ్వు దయచేసి రా, నేను ఇంకొక చోటికి నిన్ను తీసుకెళ్తాను. అక్కడ నుంచి నా కోసం నువ్వు వారిని శపించడం దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందేమో” అన్నాడు.

[28] బాలాకు ఎడారికి ఎదురుగా ఉన్న పెయోరు శిఖరానికి బిలామును తీసుకు పోయాడు.

[29] బిలాము “ఇక్కడ నాకు ఏడు బలిపీఠాలు కట్టించి, ఏడు దున్నపోతులను, ఏడు పొట్టేళ్లను సిద్ధం చెయ్యి” అని బాలాకుతో చెప్పాడు.

[30] బిలాము చెప్పినట్టు బాలాకు చేసి, ప్రతి బలిపీఠం మీద ఒక దున్నపోతును, ఒక పొట్టేలును అర్పించాడు.

సంఖ్యాకాండం — Chapters