Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:03

[1] యెహోవా “మిద్యానీయులు ఇశ్రాయేలీయులకు చేసిన దానికి ప్రతీకారం తీర్చుకోండి.

[2] ఆ తరవాత నీవు చనిపోయి నీ పూర్వీకుల దగ్గరికి చేరుకుంటావు” అని మోషేకు చెప్పాడు.

[3] అప్పుడు మోషే “మీలో కొందరు యుద్ధానికి సిద్ధపడి మిద్యానీయుల మీదికి పోయి వారికి యెహోవా విధించిన ప్రతిదండన చేయండి.

[4] ఇశ్రాయేలీయుల ప్రతి గోత్రం నుండి వెయ్యిమంది చొప్పున యుద్ధానికి పంపండి” అని ప్రజలతో అన్నాడు.

[5] ఆ విధంగా గోత్రానికి వెయ్యి మంది చొప్పున, ఇశ్రాయేలీయుల మొత్తం సైన్యంలో నుండి పన్నెండు వేల మంది యుద్ధ వీరులను సిద్ధం చేశారు.

[6] మోషే వారిని, యాజకుడైన ఎలియాజరు కుమారుడు ఫీనెహాసుతో పంపించాడు. అతనికి పరిశుద్ధమైన కొన్ని వస్తువులు, యుద్ధంలో ఊదటానికి బాకాలు పంపాడు.

[7] యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టే ఇశ్రాయేలీయులు మిద్యానీయులతో యుద్ధం చేసి మగవారందరినీ చంపేశారు.

[8] వారు కాక మిద్యాను రాజులు, ఎవీ, రేకెము, సూరు, హూరు, రేబ అనే ఐదుగుర్ని చంపారు. బెయోరు కొడుకు బిలామును కత్తితో చంపేశారు.

[9] వారు మిద్యాను స్త్రీలను, వారి చిన్నపిల్లలను చెరపట్టుకుని, వారి పశువులు, గొర్రెలు, మేకలు అన్నిటిని, వారి సమస్తాన్ని దోచుకున్నారు.

[10] వారి పట్టణాలు, కోటలు అన్నిటిని తగలబెట్టారు.

[11] వారు మనుషులను గాని పశువులను గాని మిద్యానీయుల ఆస్తి అంతటినీ కొల్లగొట్టారు.

[12] తరువాత వారు దానంతటినీ, చెరపట్టిన వారిని మోయాబు మైదానాల్లో యెరికో దగ్గర యొర్దాను పక్కన విడిది చేసి ఉన్న మోషే, యాజకుడు ఎలియాజరు దగ్గరికి, ఇశ్రాయేలీయుల సమాజం దగ్గరికి తీసుకు వచ్చారు.

[13] అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు, సమాజ నాయకులంతా విడిది బయటికి వారికి ఎదురు వెళ్ళారు.

[14] అప్పుడు మోషే యుద్ధం నుండి వచ్చిన సహస్రాధిపతులు, శతాధిపతుల పైన కోపపడ్డాడు.

[15] అతడు వారితో “మీరు మిద్యాను స్త్రీలను ఎందుకు బతకనిచ్చారు?

[16] బిలాము సలహా ప్రకారం పెయోరు విషయంలో ఇశ్రాయేలు ప్రజలు యెహోవాకు ఎదురు తిరిగేలా చేసింది వారే కదా! అందుచేత యెహోవా మన సమాజంలో తెగులు పుట్టించాడు కదా.

[17] కాబట్టి మీరు మగ పిల్లలందరినీ మగవారితో సంబంధం ఉన్న ప్రతి స్త్రీనీ చంపండి.

[18] మగవారితో సంబంధం లేని ప్రతి ఆడపిల్లను మీ కోసం బతకనీయండి.

[19] మీరు ఏడు రోజులు విడిది బయట ఉండాలి. మీలో మనిషిని చంపిన ప్రతివాడూ, చనిపోయిన వారిని తాకిన ప్రతివాడూ, మీరు, మీరు చెరగా పట్టుకొచ్చిన వారు, మూడో రోజున, ఏడో రోజున మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవాలి.

[20] మీరు మీ వస్త్రాలను, చర్మంతో, మేక వెండ్రుకలతో చేసిన వస్తువులను, చెక్కతో చేసిన వస్తువులను అన్నిటినీ శుద్ధి చేయాలి.”

[21] అప్పుడు యాజకుడు ఎలియాజరు యుద్ధానికి వెళ్ళిన సైనికులతో “యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు,

[22] ‘అగ్నితో చెడిపోని బంగారు, వెండి, ఇత్తడి, ఇనుము, తగరం, సీసం, వీటితో చేసిన వస్తువులన్నిటినీ

[23] మంటల్లో వేసి తీయడం ద్వారా శుద్ధి చేయాలి. వాటిని పాపపరిహార జలంతో కూడా శుద్ధి చేయాలి. అగ్నితో చెడిపోయే ప్రతి వస్తువును నీళ్లలో వేసి తీయాలి.

[24] ఏడో రోజు మీరు మీ బట్టలు ఉతుక్కొని శుద్ధి అయిన తరవాత విడిదిలోకి రావచ్చు.’” అన్నాడు.

[25] యెహోవా మోషేకు ఇంకా ఇలా ఆజ్ఞాపించాడు,

[26] “నువ్వూ యాజకుడు ఎలియాజరు సమాజంలోని పూర్వీకుల వంశాల నాయకులు మీరు చెరగా పట్టుకున్న మనుషులను, పశువులను లెక్కబెట్టి రెండు భాగాలు చేయండి.

[27] సైన్యంగా యుద్ధానికి వెళ్ళిన వారికి సగం, మిగిలిన సర్వసమాజానికి సగం పంచిపెట్టండి.

[28] యుద్ధానికి వెళ్ళిన సైనికులపై యెహోవా కోసం పన్ను వేసి, ఆ మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో ఐదు వందలకు ఒకటి చొప్పున వారి సగభాగంలో నుండి తీసుకుని

[29] యెహోవాకు అర్పణగా యాజకుడు ఎలియాజరుకు ఇవ్వాలి.

[30] అదే విధంగా మిగిలిన ఇశ్రాయేలీయుల సగంలో నుండి మనుషుల్లో, పశువుల్లో, గాడిదల్లో, గొర్రె మేకల్లో, అన్ని రకాల జంతువుల్లోనుండి 50 కి ఒకటి చొప్పున తీసుకుని యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇవ్వాలి.”

[31] యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా మోషే, యాజకుడు ఎలియాజరు చేశారు.

[32] ఆ సైనికులు దోచుకున్నది గాక మిగిలింది

[33] 6, 75,000 గొర్రెలు లేక మేకలు,

[34] 72,000 పశువులు, 61,000 గాడిదలు,

[35] 32,000 మంది మగవారితో సంబంధం లేని స్త్రీలు ఉన్నారు.

[36] అందులో సగం యుద్ధానికి వెళ్ళిన వారి వంతు, గొర్రె మేకలు 3, 37, 500. వాటిలో యెహోవాకు చెందిన పన్ను 675. పశువుల్లో సగం 36,000.

[37] వాటిలో యెహోవా పన్ను 72.

[38] గాడిదల్లో సగం 30, 500.

[39] వాటిలో యెహోవా పన్ను 61.

[40] మనుషుల్లో సగం 16,000 మంది. వారిలో యెహోవా పన్ను 32 మంది.

[41] యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన విధంగా అతడు యెహోవాకు చెందాల్సిన అర్పణను యాజకుడు ఎలియాజరుకు ఇచ్చాడు.

[42] మోషే సైనికుల నుండి తీసుకుని ఇశ్రాయేలీయులకు ఇచ్చిన సగంలో నుండి లేవీయులకు ఇచ్చాడు.

[43] 3, 37, 500 గొర్రె మేకలు,

[44] 36,000 పశువులు, 30, 500 గాడిదలు,

[45] 16,000 మంది మనుషులు సమాజానికి రావలసిన సగం.

[46] మోషే ఆ సగం నుండి మనుషుల్లో, జంతువుల్లో,

[47] 50 కి ఒకటి చొప్పున తీసి, యెహోవా తనకు ఆజ్ఞాపించిన విధంగా యెహోవా మందిరాన్ని కాపాడే లేవీయులకు ఇచ్చాడు.

[48] అప్పుడు సైన్యంలో వేలమందికి, వందల మందికి అధిపతులు మోషే దగ్గరికి వచ్చి

[49] “నీ సేవకులైన మేము మా కింద ఉన్న సైనికులందరినీ లెక్కపెట్టాం. మొత్తానికి ఒక్కడు కూడా తగ్గలేదు.

[50] కాబట్టి యెహోవా సన్నిధిలో మా కోసం ప్రాయశ్చిత్తం కలిగేలా మాలో ప్రతి ఒక్కడికి దొరికిన బంగారు నగలు, గొలుసులు, కడియాలు, ఉంగరాలు, పోగులు, పతకాలు యెహోవాకు అర్పణ తెచ్చాం” అని చెప్పారు.

[51] మోషే, యాజకుడు ఎలియాజరు ఆ బంగారు నగలను వారి నుండి తీసుకున్నారు.

[52] వేలమందికి, వందల మందికి అధిపతులైన నాయకులు యెహోవాకు అర్పించిన బంగారం మొత్తం 16, 750 తులాలు.

[53] ఆ సైనికుల్లో ప్రతివాడూ తన మట్టుకు తాను దోపుడు సొమ్ము తెచ్చుకున్నాడు.

[54] అప్పుడు మోషే, యాజకుడు ఎలియాజరు వేలమందికి, వందల మందికి అధిపతుల దగ్గర తీసుకున్న బంగారాన్ని ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థంగా ప్రత్యక్ష గుడారంలో ఉంచారు.

సంఖ్యాకాండం — Chapters