Skip to content
Opens in a new window
Listen to this chapter • 5:22

[1] యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఇదిగో నిన్ను ఫరోకు దేవుడిగా నియమించాను. నీ అన్న అహరోను నీ మాటలు వినిపించే ప్రవక్తగా ఉంటాడు.

[2] నేను నీకు ఆజ్ఞాపించేదంతా నువ్వు మాట్లాడాలి. ఇశ్రాయేలు ప్రజలను తన దేశం నుండి వెళ్ళనివ్వాలని నీ అన్న అహరోను ఫరోతో చెబుతాడు.

[3] అయితే నేను ఫరో హృదయాన్ని కఠినం చేస్తాను. ఆ దేశంలో అనేకమైన అద్భుతాలు, సూచక క్రియలు జరిగిస్తాను.

[4] అప్పుడు కూడా ఫరో మీ మాట వినడు. కాబట్టి నా చెయ్యి ఐగుప్తు మీద మోపి గొప్ప తీర్పు క్రియలతో నా సేనలు అంటే ఇశ్రాయేలీయులైన నా ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటకు రప్పిస్తాను.

[5] నేను ఐగుప్తు మీద నా చెయ్యి చాపి వాళ్ళ మధ్య నుండి ఇశ్రాయేలు ప్రజలను బయటకు రప్పించినప్పుడు నేను యెహోవానని ఐగుప్తీయులు తెలుసుకుంటారు.”

[6] మోషే అహరోనులు యెహోవా తమకు ఆజ్ఞాపించినట్టు చేశారు.

[7] వారు ఫరోతో మాట్లాడినప్పుడు మోషే వయసు 80 సంవత్సరాలు, అహరోను వయసు 83 సంవత్సరాలు.

[8] యెహోవా మోషే అహరోనులతో ఇలా చెప్పాడు. “మీ దేవుని శక్తి రుజువు చేయడానికి ఏదైనా ఒక అద్భుతం చూపించండి అని మిమ్మల్ని అడిగితే

[9] నువ్వు అహరోనుకు నీ చేతికర్రను ఇచ్చి దాన్ని ఫరో ముందు పడవెయ్యమని చెప్పు. అది పాముగా మారిపోతుంది.”

[10] మోషే, అహరోనులు ఫరో దగ్గరికి వెళ్ళారు. యెహోవా వారికి చెప్పినట్టు అహరోను ఫరో ఎదుటా అతని పరివారం ఎదుటా తన కర్రను పడవేసినప్పుడు అది పాముగా మారింది.

[11] అప్పుడు ఫరో తన దేశంలోని జ్ఞానులను, మాంత్రికులను పిలిపించాడు. ఐగుప్తు దేశపు మాంత్రికులు కూడా తమ మంత్ర శక్తితో అదే విధంగా చేశారు.

[12] వాళ్ళలో ప్రతి మాంత్రికుడూ తమ కర్రలను పడవేసినప్పుడు అవి పాములుగా మారాయి గాని అహరోను వేసిన కర్ర వాళ్ళు వేసిన కర్రలను మింగివేసింది.

[13] అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయం కఠివంగా మారిపోయింది, అతడు వారి మాట పెడచెవిన పెట్టాడు.

[14] తరువాత యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “ఫరో హృదయం కఠినంగా మారింది. అతడు ఈ ప్రజలను పంపడానికి ఒప్పుకోవడం లేదు.

[15] ఉదయాన్నే ఫరో నది ఒడ్డుకు వెళ్తాడు. అప్పుడు నువ్వు నది దగ్గర నిలబడి పాముగా అయిన కర్రను పట్టుకుని ఫరోకు ఎదురు వెళ్ళు.

[16] అతనితో, ‘ఎడారిలో ఆయన్ని సేవించడానికి ఆయన ప్రజలను వెళ్ళనివ్వమని ఆజ్ఞాపించడానికి హెబ్రీయుల దేవుడు యెహోవా నన్ను నీ దగ్గరికి పంపించాడు. ఇంతకు ముందు నువ్వు మా మాట వినలేదు.

[17] ఇప్పుడు యెహోవా చెబుతున్నది ఏమిటంటే, ఇదిగో నా చేతిలో ఉన్న ఈ కర్రతో నేను నదిలో ఉన్న నీళ్ళను కొడుతున్నాను. నీళ్లన్నీ రక్తంగా మారిపోతాయి. దీన్ని బట్టి ఆయన యెహోవా అని నీవు తెలుసుకుంటావు

[18] నదిలోని చేపలన్నీ చనిపోతాయి. నది దుర్వాసన కొడుతుంది. ఐగుప్తీయులు ఆ నీళ్ళు తాగలేకపోతారు’ అని యెహోవా చెబుతున్నాడు.”

[19] యెహోవా మోషేతో ఇలా అన్నాడు. “నువ్వు అహరోనుతో ఇలా చెప్పు. నీ కర్ర పట్టుకుని ఐగుప్తు నీళ్ళ మీద అంటే, వారి నదుల మీద, కాలువల మీద, చెరువుల మీద, నీటి గుంటలన్నిటి మీదా నీ చెయ్యి చాపు. ఆ నీళ్ళన్నీ రక్తంగా మారిపోతాయి. ఐగుప్తు దేశమంతా చెక్క తొట్లలో, రాతి పాత్రల్లో సహా రక్తం ఉంటుంది.”

[20] యెహోవా ఆజ్ఞాపించినట్టు మోషే అహరోనులు చేశారు. ఫరో, అతని సేవకులు చూస్తూ ఉండగా అహరోను తన కర్ర పైకెత్తి నది నీళ్లను కొట్టినప్పుడు నది నీళ్లన్నీ రక్తంగా మారిపోయాయి.

[21] నదిలోని చేపలన్నీ చచ్చిపోయాయి, నది నుండి దుర్వాసన కొట్టింది. ఐగుప్తీయులు నది నీళ్లు తాగలేక పోయారు. ఐగుప్తు దేశమంతా రక్తమయం అయింది.

[22] ఐగుప్తు మాంత్రికులు కూడా ఆ విధంగానే చేయగలిగారు. యెహోవా చెప్పినట్టు ఫరో మళ్ళీ తన హృదయం కఠినం చేసుకుని మోషే అహరోనుల మాట వినలేదు.

[23] జరిగిన దాన్ని లక్ష్యపెట్టకుండా ఫరో తన భవనానికి తిరిగి వెళ్ళిపోయాడు.

[24] అయితే ఐగుప్తీయులందరూ నది నీళ్లు తాగలేకపోయారు. మంచినీళ్ళ కోసం నది ఒడ్డున గుంటలు తవ్వుకున్నారు.

[25] యెహోవా నదిని కొట్టిన తరువాత ఏడు రోజులు గడిచాయి.

నిర్గమకాండం — Chapters