Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:26

[1] యెహోవా మోషేతో ఇలా చెప్పాడు.

[2] “నాకు ప్రతిష్ఠార్పణ తీసుకు రావాలని ఇశ్రాయేలీయులతో చెప్పు. మనసారా అర్పించే ప్రతి వాడి దగ్గరా దాన్ని తీసుకోవాలి.

[3] మీరు వారి దగ్గర తీసుకోవలసిన అర్పణలు ఇవి. బంగారం, వెండి, ఇత్తడి.

[4] నీలం, ఊదా రక్త వర్ణాల ఉన్ని, సన్నని నార బట్టలు, మేక వెంట్రుకలు.

[5] ఎరుపురంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సీలు జంతువు చర్మం, తుమ్మ చెక్క.

[6] మందిరంలో దీపాల కోసం నూనె, అభిషేక తైలం కోసం, పరిమళ ధూపం కోసం సుగంధ ద్రవ్యాలు,

[7] ఏఫోదు కోసం, వక్ష పతకం కోసం గోమేధికాలు, ఇతర రత్నాలు.

[8] నేను వారి మధ్య నివసించేలా వారు నాకు పరిశుద్ధస్థలాన్ని నిర్మించాలి.

[9] నేను నీకు చూపించే విధంగా మందిరం స్వరూపాన్ని దాని ఉపకరణాలను చెయ్యాలి.

[10] వారు తుమ్మకర్రతో ఒక మందసం చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర, దాని వెడల్పు మూరెడున్నర, దాని ఎత్తు మూరెడున్నర

[11] దాని మీద మేలిమి బంగారు రేకు పొదిగించాలి. లోపలా బయటా దానికి బంగారు రేకు పొదిగించాలి. దాని మీద బంగారు అంచు కట్టాలి.

[12] దానికి నాలుగు బంగారు రింగులు పోత పోసి, ఒక వైపు రెండు, మరొక వైపు రెండు రింగులు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.

[13] తుమ్మ చెక్కతో మోతకర్రలు చేసి వాటికి బంగారు రేకు పొదిగించి

[14] వాటితో ఆ మందసాన్ని మోయడానికి అంచులకు ఉన్న రింగుల్లో ఆ మోతకర్రలను దూర్చాలి.

[15] ఆ మోతకర్రలు ఆ మందసం రింగుల్లోనే ఉండాలి. వాటిని రింగుల్లోనుండి తీయకూడదు.

[16] ఆ మందసంలో నేను నీకివ్వబోయే శాసనాలను ఉంచాలి.

[17] నీవు మేలిమి బంగారంతో ప్రాయశ్చిత్త స్థానమైన మూతను చెయ్యాలి. దాని పొడవు రెండు మూరలున్నర. దాని వెడల్పు మూరెడున్నర.

[18] సాగగొట్టిన బంగారంతో రెండు బంగారు కెరూబు రూపాలను చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూత రెండు అంచులతో వాటిని ఏకాండంగా చెయ్యాలి.

[19] ఈ కొనలో ఒక కెరూబును ఆ కొనలో ఒక కెరూబును చెయ్యాలి. ప్రాయశ్చిత్త మూతపై దాని రెండు కొనల మీద కెరూబులను దానితో ఏకాండంగా చెయ్యాలి.

[20] ఆ కెరూబులు రెక్కలు పైకి విచ్చుకుని ప్రాయశ్చిత్త మూతను తమ రెక్కలతో కప్పుతూ ఉండాలి. వాటి ముఖాలు ఒకదానికొకటి ఎదురెదురుగా ఉండాలి. ఆ కెరూబుల ముఖాలు ప్రాయశ్చిత్త మూత వైపుకి తిరిగి ఉండాలి.

[21] నీవు ఆ మూతను మందసం మీద ఉంచాలి. నేను నీకిచ్చే శాసనాలను ఆ మందసంలో ఉంచాలి.

[22] అక్కడ నేను నిన్ను కలుసుకుని ప్రాయశ్చిత్త మూత మీద నుండి, శాసనాలున్న మందసం మీద ఉన్న రెండు కెరూబుల మధ్య నుండి, ఇశ్రాయేలీయుల కోసం ఇచ్చే ఆజ్ఞలన్నిటినీ నీకు తెలియజేస్తాను.

[23] నీవు తుమ్మచెక్కతో ఒక బల్ల చేయాలి. దాని పొడవు రెండు మూరలు. వెడల్పు ఒక మూర. దాని ఎత్తు మూరెడున్నర.

[24] మేలిమి బంగారు రేకును దానికి పొదిగించి దానికి బంగారు అంచును చేయించాలి.

[25] దానికి చుట్టూ బెత్తెడు చట్రం చేసి దానిపై చుట్టూ బంగారు అంచు పెట్టాలి.

[26] దానికి నాలుగు బంగారు రింగులు చేసి దాని నాలుగు కాళ్లకి ఉండే నాలుగు మూలల్లో ఆ రింగులను తగిలించాలి.

[27] బల్లను మోయడానికి చేసిన మోతకర్రలు రింగులకు, చట్రానికి దగ్గరగా ఉండాలి.

[28] ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటి మీద బంగారు రేకు పొదిగించాలి. వాటితో బల్లను మోస్తారు.

[29] నీవు దాని పళ్ళేలను, గరిటెలను, గిన్నెలను, పానీయార్పణం కోసం పాత్రలను చేయాలి. మేలిమి బంగారంతో వాటిని చేయాలి.

[30] నిత్యం నా సన్నిధిలో సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచాలి.

[31] నీవు మేలిమి బంగారంతో దీపవృక్షాన్ని చేయాలి. సాగగొట్టిన బంగారంతో ఈ దీపవృక్షాన్ని చేయాలి. దాని కాండాన్ని, కొమ్మలను సాగగొట్టిన బంగారంతోనే చెయ్యాలి. దాని కలశాలు, దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండంగా ఉండాలి.

[32] దీప వృక్షం ఒక వైపు నుండి మూడు కొమ్మలు, రెండవ వైపు నుండి మూడు కొమ్మలు, అంటే దాని పార్శ్వాల నుండి ఆరుకొమ్మలు మొలవాలి.

[33] ఒక కొమ్మలో బాదం మొగ్గ, పువ్వు రూపాలు ఉన్న మూడు కలశాలు, రెండవ కొమ్మలో బాదం మొగ్గ, పువ్వురూపాలు ఉన్న మూడు కలశాలు, ఈ విధంగా దీపవృక్షం నుండి మొలిచిన కొమ్మల్లో ఉండాలి.

[34] దీపవృక్ష కాండంలో బాదం పువ్వు రూపంలో ఉన్న నాలుగు కలశాలు, వాటి మొగ్గలు, వాటి పువ్వులు ఉండాలి.

[35] దీపవృక్ష కాండం నుండి నిగిడే ఆరుకొమ్మలకు దాని రెండేసి కొమ్మల కింద ఏకాండమైన ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండాలి.

[36] వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండంగా ఉండాలి. అదంతా ఏకాండంగా సాగగొట్టిన మేలిమి బంగారంతో చెయ్యాలి.

[37] నీవు దానికి ఏడు దీపాలు చేయాలి. దాని ఎదుటి భాగానికి వెలుగు ప్రసరించేలా దాని దీపాలు వెలిగించాలి.

[38] దాని పట్టుకారును, పటకారు పళ్ళేన్ని మేలిమి బంగారంతో చెయ్యాలి.

[39] ఆ ఉపకరణాలన్నిటిని 30 కిలోల మేలిమి బంగారంతో చెయ్యాలి.

[40] కొండ మీద నీకు చూపించిన వాటి నమూనా ప్రకారం వాటిని చేయడానికి జాగ్రత్త పడు.”

నిర్గమకాండం — Chapters