Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:01

[1] అందుకు యెహోవా “ఫరోకు నేను చేయబోతున్నదంతా నువ్వు తప్పకుండా చూస్తావు. నా బలిష్ఠమైన హస్తం వల్ల అతడు వారిని బయటకు పంపించేలా చేస్తాను. నా హస్త బలం వల్లనే అతడు తన దేశం నుండి ప్రజలను వెళ్ళగొడతాడు.”

[2] ఆయన ఇంకా మోషేతో ఇలా అన్నాడు “నేనే యెహోవాను.

[3] నేను ‘సర్వశక్తి గల దేవుడు’ అనే పేరుతో అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ప్రత్యక్షమయ్యాను. కాని, యెహోవా అనే నా పేరు నేను వారికి తెలియబరచలేదు.

[4] వాళ్ళు పరాయి వారుగా నివాసం చేసిన కనాను దేశాన్ని వారికి ఇస్తానని నేను ఒప్పందం చేశాను.

[5] ఐగుప్తీయులకు బానిసలుగా మారిన ఇశ్రాయేలు ప్రజల నిట్టూర్పులు విని నా నిబంధనను గుర్తు చేసుకున్నాను.

[6] కాబట్టి నువ్వు ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేనే యెహోవాను. ఐగుప్తీయుల బానిసత్వం కింద ఉన్న మీ కష్టాల నుండి మిమ్మల్ని విడిపిస్తాను. మిమ్మల్ని ఆ దేశం నుండి బయటకు రప్పిస్తాను. వాళ్లకు గొప్ప తీర్పు క్రియలు చూపి, నా చేతులు చాపి వారి బానిసత్వం కింద ఉన్న మిమ్మల్ని విడిపిస్తాను.

[7] మిమ్మల్ని నా సొంత ప్రజగా నా చెంత చేర్చుకుని మీకు దేవుడైన యెహోవాగా ఉంటాను. అప్పుడు ఐగుప్తీయుల బానిసత్వం కింద నుండి మిమ్మల్ని విడిపించి బయటకు రప్పించిన మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలుసుకుంటారు.

[8] అబ్రాహాము ఇస్సాకు యాకోబులకు ఇస్తానని నేను చెయ్యి ఎత్తి శపథం చేసిన దేశానికి మిమ్మల్ని రప్పిస్తాను. ఆ దేశాన్ని మీకు సొంతం చేస్తాను. నేను యెహోవాను.”

[9] మోషే ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు చెప్పినదంతా చెప్పాడు. అయితే వాళ్ళు తమ నిరాశ నిస్పృహల వల్ల, కఠినమైన బానిసత్వంలో కూరుకు పోయి ఉండడం వల్ల మోషే మాటలు లక్ష్యపెట్ట లేదు.

[10] యెహోవా మోషేతో “నువ్వు రాజు ఆస్థానం లోకి వెళ్లి,

[11] ఐగుప్తు రాజు ఫరోతో ఇశ్రాయేలు ప్రజలను అతని దేశం నుండి బయటకు పంపించమని చెప్పు” అన్నాడు.

[12] అప్పుడు మోషే “ఇశ్రాయేలీయులు నా మాట వినకపోతే ఫరో ఎందుకు వింటాడు? నాకు వాక్చాతుర్యం లేదు” అని యెహోవా సముఖంలో చెప్పాడు.

[13] అప్పుడు యెహోవా మోషే అహరోనులతో “ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశం నుండి బయటికి తీసుకురావడానికి ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి, ఫరో దగ్గరికి మీరు బయలుదేరి వెళ్ళాలి” అని ఆజ్ఞాపించాడు.

[14] వారి వంశాల మూలపురుషులు వీరు: ఇశ్రాయేలు మొదటి కొడుకైన రూబేను కొడుకులు, హనోకు, పల్లు, హెస్రోను, కర్మీ. వీళ్ళు రూబేను కుటుంబాలు.

[15] షిమ్యోను కొడుకులు యెమూయేలు, యామీను, ఓహదు, యాకీను, సోహరు, కనాను స్త్రీకి పుట్టిన షావూలు. వీళ్ళు షిమ్యోను కుటుంబాలు.

[16] లేవి కొడుకులు వారి వారి వంశావళుల ప్రకారం గెర్షోను, కహాతు, మెరారి. లేవి 137 సంవత్సరాలు జీవించాడు.

[17] గెర్షోను కొడుకులు వారి వారి వంశాల ప్రకారం లిబ్నీ, షిమీ.

[18] కహాతు కొడుకులు అమ్రాము, ఇస్హారు, హెబ్రోను, ఉజ్జీయేలు. కహాతు 133 సంవత్సరాలు జీవించాడు.

[19] మెరారి కొడుకులు మహలి, మూషి. వీళ్ళు తమ తమ వంశాల ప్రకారం లేవి కుటుంబాలు.

[20] అమ్రాము తన తండ్రి సోదరి యోకెబెదును పెళ్లి చేసుకున్నాడు. వారికి అహరోను, మోషే పుట్టారు. అమ్రాము 137 సంవత్సరాలు జీవించాడు.

[21] ఇస్హారు కొడుకులు కోరహు, నెపెగు, జిఖ్రీ.

[22] ఉజ్జీయేలు కొడుకులు మిషాయేలు, ఎల్సాఫాను, సిత్రీ.

[23] అహరోను అమ్మీనాదాబు కూతురు, నయస్సోను సహోదరి అయిన ఎలీషెబను పెళ్లి చేసుకున్నాడు. వారికి నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.

[24] కోరహు కొడుకులు అస్సీరు, ఎల్కానా, అబీయాసాపు. వీళ్ళు కోరహీయుల కుటుంబాలు.

[25] అహరోను కొడుకు ఎలియాజరు పూతీయేలు కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఫీనెహాసు పుట్టాడు. వీళ్ళు తమ తమ కుటుంబాల ప్రకారం లేవీ వంశ నాయకులు.

[26] ఇశ్రాయేలు ప్రజలను తమ వంశాల క్రమం ప్రకారం ఐగుప్తు దేశం నుండి బయటకు తీసుకురావాలని యెహోవా ఆజ్ఞాపించింది ఈ అహరోను మోషేలనే.

[27] ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు నుండి బయటికి పంపించాలని ఐగుప్తు రాజు ఫరోతో మాట్లాడిన మోషే, అహరోనులు వీరే.

[28] ఐగుప్తు దేశంలో యెహోవా మోషేతో మాట్లాడాడు.

[29] “నేను యెహోవాను. యెహోవా నీతో చెప్పినది మొత్తం నువ్వు ఐగుప్తు రాజు ఫరోతో చెప్పు.”

[30] అందుకు మోషే “నాకు వాక్చాతుర్యం లేదు. నా మాట ఫరో ఎలా వింటాడు?” అని యెహోవా సముఖంలో అన్నాడు.

నిర్గమకాండం — Chapters