Skip to content
Opens in a new window
Listen to this chapter • 6:22

[1] అతడు తుమ్మకర్రతో హోమ బలిపీఠం తయారుచేశాడు. దాని పొడవు, వెడల్పు ఐదు మూరలు. ఎత్తు మూడు మూరలు, దాన్ని చతురస్రంగా చేశారు.

[2] దాని నాలుగు మూలలా ఏకాండంగా నాలుగు కొమ్ములు చేశాడు. దానికి ఇత్తడి రేకు పొదిగించాడు.

[3] బలిపీఠం సంబంధిత సామగ్రి అంటే, బూడిద ఎత్తే గిన్నెలూ, గరిటెలు, పళ్ళేలూ, ముళ్ళూ, నిప్పులు వేసే పళ్ళాలు అన్నీ కంచుతో చేశాడు.

[4] బలిపీఠానికి ఇత్తడి జల్లెడను దాని అంచుల కింద దాని మధ్య భాగం వరకూ లోతుగా చేశాడు.

[5] ఆ ఇత్తడి జల్లెడ నాలుగు మూలల్లో దాని మోతకర్రలు ఉంచే నాలుగు గుండ్రని కొంకీలు పోతపోశాడు.

[6] ఆ మోతకర్రలను తుమ్మకర్రతో చేశాడు. వాటికి రాగిరేకులు పొదిగించాడు.

[7] ఆ బలిపీఠం మోసేందుకు దాని నాలుగు వైపులా గుండ్రని కొంకీల్లో మోసే కర్రలు చొప్పించాడు. బలిపీఠాన్ని పలకలతో గుల్లగా చేశాడు.

[8] గంగాళాన్నీ, పీటనూ ఇత్తడితో చేశాడు. వాటిని చెయ్యడానికి సన్నిధి గుడారం ద్వారం దగ్గర సేవించడానికి వచ్చిన స్త్రీల అద్దాలను ఉపయోగించాడు.

[9] అప్పుడు అతడు ప్రహరీ నిర్మించాడు. ప్రహరీ కుడి వైపున, అంటే దక్షిణం దిక్కున 100 మూరల పొడవు ఉన్న నారతో నేసిన సన్నని తెరలు ఉంచాడు.

[10] ఆ తెరల స్తంభాలు ఇరవై, వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, పెండెబద్దలు వెండితో చేశారు.

[11] ఉత్తర దిక్కున ఉన్న తెరల పొడవు 100 మూరలు. వాటి స్తంభాలు ఇరవై. వాటి ఇత్తడి దిమ్మలు ఇరవై. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు.

[12] పడమటి దిక్కున తెరల పొడవు ఏభై మూరలు. వాటి స్తంభాలు పది, వాటి దిమ్మలు పది, ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండె బద్దలు వెండితో చేశారు.

[13] తూర్పువైపు అంటే ఉదయం దిక్కున వాటి పొడవు ఏభై మూరలు.

[14] ద్వారం ఒక వైపు తెరల పొడవు పదిహేను మూరలు. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

[15] ఆ విధంగా రెండవ వైపున అంటే రెండు వైపులా ఆవరణ ద్వారానికి పదిహేను మూరల పొడవైన తెరలు ఉన్నాయి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.

[16] ప్రహరీ చుట్టూ ఉన్న తెరలన్నీ సన్నని నారతో నేశారు.

[17] స్తంభాల దిమ్మలు రాగివి, వాటి కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండితో చేశారు. వాటి పైభాగాలకు వెండి రేకులు పొదిగించారు. ప్రహరీలోని స్తంభాలన్నీ వెండి రేకులతో కూర్చారు.

[18] ప్రహరీ ద్వారంలో ఉంచిన తెర నీలం ఊదా ఎర్రని రంగు గలది. అది సన్నని నారతో నేసి అల్లిక పని చేసి ఉంది. దాని పొడవు ఇరవై మూరలు. దాని వెడల్పు ప్రహరీ తెరలతో సరిగా ఐదు మూరలు.

[19] వాటి స్తంభాలు నాలుగు, వాటి ఇత్తడి దిమ్మలు నాలుగు. వాటి కొక్కేలు వెండితో చేశారు.

[20] వాటి పైభాగాలకు వెండి రేకు పొదిగించారు. వాటి పెండె బద్దలు వెండివి, మందిరానికి, మందిరం చుట్టూ ఉన్న ప్రహరీకీ కొట్టిన మేకులన్నీ ఇత్తడివి.

[21] మందిరం సామాను మొత్తం, అంటే శాసనాల గుడార మందిరం సామగ్రి మొత్తం ఇదే. యాజకుడైన అహరోను కొడుకు ఈతామారు లేవీ గోత్రికుల చేత మోషే ఆజ్ఞ ప్రకారం ఆ వస్తువులు లెక్క పెట్టించాడు.

[22] యూదా గోత్రికుడు హూరు మనుమడు, ఊరీ కొడుకు బెసలేలు యెహోవా మోషేకు ఆజ్ఞాపించినదంతా పూర్తి చేశాడు.

[23] దాను గోత్రికుడు అహీసామాకు కొడుకు అహోలీయాబు అతనికి సహాయకుడుగా ఉన్నాడు. ఇతడు చెక్కడంలో నేర్పు గలవాడు. నిపుణత గల పనివాడు, నీలం ఊదా ఎర్ర రంగుల సన్నని నారతో అల్లిక పని చేయడంలో నేర్పరి.

[24] పవిత్ర స్థలాన్ని పూర్తి స్థాయిలో నిర్మించే పని అంతటిలో ఉపయోగించిన బంగారం పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం సుమారు 29 తలాంతులు, 730 షెకెల్.

[25] జాబితాలో చేరినవారి సమాజపు ప్రజలు ఇచ్చిన వెండి పవిత్ర స్థలం తులం కొలత ప్రకారం 100 తలాంతులు, 1, 775 షెకెల్.

[26] ఇరవై సంవత్సరాలు పైబడి లెక్కలో చేరినవారు 6,03,550 మంది. వీరి అర్పణ ఒక్కొక్కటి అర తులం.

[27] అడ్డతెరల కోసం, ఆరాధన గుడారం కోసం దిమ్మలు పోత పోయడంలో ఒక్కో దిమ్మకు నాలుగు మణుగుల వెండి ఉపయోగించారు. అంటే ఒక దిమ్మకు నాలుగు మణుగుల చొప్పున నూరు దిమ్మలు పోతపోశారు.

[28] 1, 575 తులాల వెండితో అతడు స్తంభాలకు కొక్కేలు చేసి, వాటిని స్తంభాల పైభాగాలకు తొడిగించి వాటిని పెండెబద్దలతో కట్టాడు.

[29] అర్పించిన ఇత్తడి మొత్తం 280 మణుగుల 2, 400 తులాలు.

[30] అతడు ఆ ఇత్తడితో సన్నిధి గుడారం ద్వారం కోసం దిమ్మలు, బలిపీఠం, జల్లెడ, బలిపీఠం సామగ్రి చేశాడు.

[31] ఇంకా ప్రహరీ చుట్టూ ఉన్న దిమ్మలు, ప్రహరీ ద్వారం దిమ్మలు, దైవ నివాసం మేకులు, ప్రహరీ చుట్టూ వాడిన మేకులన్నిటినీ ఆ ఇత్తడితో చేశాడు.

నిర్గమకాండం — Chapters