[1] “నీవు తుమ్మచెక్కతో ఐదు మూరల పొడవు ఐదు మూరల వెడల్పు గల బలిపీఠం చెయ్యాలి. ఆ బలిపీఠం నలుచదరంగా ఉండాలి. దాని యెత్తు మూడు మూరలు.
[2] దాని నాలుగు మూలలా దానికి కొమ్ములు చెయ్యాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి. దానికి ఇత్తడి రేకు పొదిగించాలి.
[3] దాని బూడిద ఎత్తడానికి కుండలను, గరిటెలను, గిన్నెలను, ముళ్ళను, అగ్నిపాత్రలను చెయ్యాలి. ఈ ఉపకారణాలన్నిటినీ ఇత్తడితో చెయ్యాలి.
[4] దానికి వలలాంటి ఇత్తడి జల్లెడ చెయ్యాలి.
[5] ఆ వల మీద దాని నాలుగు మూలలా నాలుగు ఇత్తడి రింగులు చేసి ఆ వల బలిపీఠం మధ్యకి చేరేలా కిందిభాగంలో బలిపీఠం గట్టు కింద దాన్ని ఉంచాలి.
[6] బలిపీఠం కోసం మోతకర్రలను చెయ్యాలి. ఆ మోతకర్రలను తుమ్మచెక్కతో చేసి వాటికి ఇత్తడి రేకు పొదిగించాలి.
[7] ఆ మోతకర్రలను ఆ రింగుల్లో చొప్పించాలి. బలిపీఠం మోయడానికి ఆ మోతకర్రలు దాని రెండువైపులా ఉండాలి.
[8] పలకలతో గుల్లగా దాన్ని చెయ్యాలి. కొండ మీద నీకు చూపించిన నమూనా ప్రకారం దాన్ని చెయ్యాలి.
[9] నీవు మందిరానికి ఆవరణం ఏర్పాటు చెయ్యాలి. కుడివైపున, అంటే దక్షిణ దిక్కున ఆవరణం నూరు మూరల పొడవు ఉండాలి. పేనిన సన్న నార తెరలు ఒక వైపుకు ఉండాలి.
[10] దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
[11] అలాగే పొడవులో ఉత్తర దిక్కున నూరు మూరల పొడవు గల తెరలు ఉండాలి. దాని ఇరవై స్తంభాలు, వాటి ఇరవై దిమ్మలు ఇత్తడివి. ఆ స్తంభాల కొక్కేలు, వాటి పెండెబద్దలు వెండివి.
[12] పడమటి దిక్కున ఆవరణం వెడల్పులో ఏభై మూరల తెరలు ఉండాలి. వాటి స్తంభాలు పది. వాటి దిమ్మలు పది.
[13] తూర్పు వైపున, అంటే తూర్పు దిక్కున ఆవరణం వెడల్పు ఏభై మూరలు.
[14] ఒక వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
[15] రెండవ వైపు పదిహేను మూరల తెరలుండాలి. వాటి స్తంభాలు మూడు, వాటి దిమ్మలు మూడు.
[16] ఆవరణ ద్వారానికి నీల ధూమ్ర రక్త వర్ణాల తెరలు ఇరవై మూడు ఉండాలి. అవి పేనిన సన్ననారతో కళాకారుని పనిగా ఉండాలి. వాటి స్తంభాలు నాలుగు, వాటి దిమ్మలు నాలుగు.
[17] ఆవరణం చుట్టూ ఉన్న స్తంభాలన్నీ వెండి పెండెబద్దలు కలవి. వాటి కొక్కేలు వెండివి. వాటి దిమ్మలు ఇత్తడివి.
[18] ఆవరణం పొడవు నూరు మూరలు. దాని వెడల్పు ఏభై మూరలు. దాని ఎత్తు ఐదు మూరలు. అవి పేనిన సన్ననారతో చేశారు. వాటి దిమ్మలు ఇత్తడివి.
[19] మందిరంలో వాడే ఉపకరణాలన్నీ ఆవరణపు మేకులన్నీ ఇత్తడివై యుండాలి.
[20] దీపం నిత్యం వెలుగుతుండేలా ప్రమిదలకు దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవల నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
[21] సాక్ష్యపు మందసం ఎదుట ఉన్న తెర బయట ప్రత్యక్ష గుడారంలో అహరోను, అతని కుమారులు సాయంకాలం మొదలు ఉదయం దాకా యెహోవా సన్నిధిలో దాన్ని సవరిస్తూ ఉండాలి. అది ఇశ్రాయేలీయులకు వారి తరతరాల వరకూ నిత్య శాసనం.”