[1] యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ధూపం వేయడానికి తుమ్మకర్రతో మందసాన్ని తయారు చెయ్యాలి.
[2] దాని పొడవు ఒక మూర, వెడల్పు ఒక మూర, ఎత్తు రెండు మూరలు ఉండాలి. అది చదరంగా ఉండాలి. దాని కొమ్ములు దానితో ఏకాండంగా ఉండాలి.
[3] దాని లోపల, బయటా నాలుగు పక్కలా స్వచ్ఛమైన బంగారం రేకు పొదిగించాలి. దాని అంచును బంగారంతో అలంకరించాలి.
[4] దానికి బంగారంతో నాలుగు గుండ్రని కొంకీలు తగిలించి, ఒక వైపు రెండు కమ్మీలు, ముందు భాగంలో రెండు గుండ్రని కమ్మీలు ఉండేలా దాని నాలుగు కాళ్లకు వాటిని తగిలించాలి.
[5] తుమ్మకర్రతో మందసాన్ని మోసే కర్రలు సిద్ధం చేసి వాటికి బంగారం రేకులు పొదిగించాలి.
[6] వేదికను శాసనాల పెట్టెకు ముందు ఉన్న తెర బయట, శాసనాలపై ప్రాయశ్చిత్త స్థానం ఎదురుగా ఉంచాలి. అక్కడ నేను నిన్ను కలుసుకుంటాను.
[7] అహరోను ఆ వేదికపై పరిమళ ద్రవ్యాల ధూపం వెయ్యాలి. అతడు ప్రతిరోజూ ఉదయం దీపాలను సర్దే సమయంలో దాని మీద ధూపం వెయ్యాలి.
[8] అలాగే సాయంత్రాలు అహరోను దీపాలు వెలిగించే సమయంలో కూడా వేదికపై ధూపం వెయ్యాలి. యెహోవా సన్నిధిలో మీ తరతరాలకూ నిత్యంగా ఆ ధూపం ఉండాలి.
[9] దాని మీద నిషిద్ధమైన వేరే ధూపాలు వెయ్యకూడదు. హోమాన్ని గానీ, నైవేద్య ద్రవ్యాలను గానీ అర్పించకూడదు. పానార్పణలు అర్పించ కూడదు.
[10] అహరోను ఆ వేదిక కొమ్ముల మీద సంవత్సరానికి ఒకసారి ప్రాయశ్చిత్తం చెయ్యాలి. పాప పరిహారార్థబలి రక్తంతో దాని కొమ్ముల కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. మీ తరతరాలకూ సంవత్సరానికి ఒకసారి అతడు వేదిక కోసం ప్రాయశ్చిత్తం చెయ్యాలి. అది యెహోవాకు అతి పవిత్రమైనదిగా ఉంటుంది.”
[11] యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
[12] “నువ్వు ఇశ్రాయేలు ప్రజల సంఖ్య లెక్కబెట్టాలి. వాళ్ళను లెక్కించే సమయానికి తమపై ఎలాంటి కీడు రాకుండా ప్రతి ఒక్కరూ తమ ప్రాణం కోసం విడుదల పరిహార ధనం యెహోవాకు చెల్లించాలి.
[13] జాబితాలో నమోదు అయిన ప్రతివాడూ అర తులం వెండి చెల్లించాలి. పవిత్ర స్థలం లెక్క చొప్పున పూర్తి బరువు ఇవ్వాలి. యెహోవాకు అర్పణగా దాన్ని చెల్లించాలి.
[14] ఇరవై సంవత్సరాలు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్నవాళ్ళంతా జన సంఖ్యలో నమోదు కావాలి. జన సంఖ్యలో చేర్చే ప్రతి ఒక్కరూ యెహోవాకు అర్పణ చెల్లించాలి.
[15] విడుదల పరిహార ధనంగా యెహోవాకు మీరు చెల్లించే అర్పణ ధనవంతుడైనా, పేదవాడైనా సమానంగా ఉండాలి. ఇద్దరూ అర తులం చొప్పున చెల్లించాలి.
[16] ఇశ్రాయేలు ప్రజలు విడుదల పరిహార ధనంగా చెల్లించిన వెండిని సన్నిధి గుడారం సేవ కోసం ఉపయోగించాలి. అది ప్రాయశ్చిత్త పరిహారంగా ప్రజల పక్షంగా యెహోవా సన్నిధానంలో ఇశ్రాయేలు ప్రజలకు జ్ఞాపకార్ధంగా ఉంటుంది.”
[17] యెహోవా మోషేతో ఇంకా ఇలా అన్నాడు. “నువ్వు ఇత్తడితో ఒక గంగాళం సిద్ధం చేసి ఇత్తడి పీటపై ఉంచాలి.
[18] సన్నిధి గుడారానికి, బలిపీఠానికి మధ్యలో ఆ గంగాళం ఉంచి దాన్ని నీళ్లతో నింపాలి.
[19] ఆ నీళ్లతో అహరోను, అతని కొడుకులు తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి.
[20] వాళ్ళు సన్నిధి గుడారం లోపలికి వెళ్ళే సమయంలో చనిపోకుండా ఉండేలా నీళ్ళతో తమను శుభ్రం చేసుకోవాలి. సేవ చేయడానికి బలిపీఠం సమీపించి యెహోవాకు హోమం అర్పించే ముందు వారు నీళ్ళతో శుభ్రం చేసుకోవాలి. అలా చెయ్యని పక్షంలో చనిపోతారు.
[21] వాళ్ళు చనిపోకుండా ఉండేలా తమ కాళ్ళు, చేతులు కడుక్కోవాలి. ఇది వారికి, అంటే అహరోనుకి, అతని సంతానానికి, తరతరాలకు నిలిచి ఉండే చట్టం.”
[22] యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు,
[23] “నువ్వు సుగంధ ద్రవ్యాల్లో ముఖ్యమైన వాటిని తీసుకుని అభిషేకం చెయ్యాలి. పవిత్ర స్థలానికి సంబంధించిన కొలతల ప్రకారం స్వచ్ఛమైన గోపరసం 500 షెకెల్, సుగంధం గల దాల్చిన చెక్క సగం అంటే 250 షెకెల్,
[24] నిమ్మగడ్డి నూనె 250 షెకెల్, లవంగిపట్ట 500 షెకెల్, మూడు పాళ్ళు ఒలీవ నూనె తీసుకోవాలి.
[25] పరిమళ ద్రవ్యాలు మిళితం చేసే నిపుణుడైన పనివాడి చేత పరిమళ ద్రవ్యం సిద్ధపరచాలి. అది యెహోవాకు ప్రతిష్ఠి అభిషేక తైలం అవుతుంది.
[26] ఆ తైలంతో నువ్వు సన్నిధి గుడారాన్ని అభిషేకించాలి. దానితోపాటు సాక్ష్యపు గుడారాన్ని,
[27] సన్నిధి బల్లను, దాని సామగ్రిని, దీపస్తంభాన్ని, దాని సామగ్రిని,
[28] హోమ బలిపీఠాన్ని, దాని సామగ్రిని, గంగాళాన్ని, దాని పీటను అభిషేకించాలి.
[29] అవన్నీ అతి పవిత్రమైనవిగా ఉండేలా వాటిని పవిత్రపరచాలి. వాటికి తగిలే ప్రతి వస్తువూ పవిత్రం అవుతుంది.
[30] అహరోను, అతని కొడుకులు నాకు యాజకులై నాకు సేవ చేసేలా వాళ్ళను అభిషేకించి ప్రతిష్ఠించాలి.
[31] నీవు ఇశ్రాయేలు ప్రజలతో, ‘ఇది మీ తరతరాలకు నాకు పవిత్ర అభిషేక తైలంగా ఉండాలి.
[32] దాన్ని యాజకులు కాని వాళ్ళ మీద పోయకూడదు. దాని పాళ్ళ ప్రకారం అలాంటి వేరే దాన్ని చెయ్యకూడదు. అది పవిత్రమైనది. దాన్ని మీరు పవిత్రంగా ఎంచాలి.
[33] దాని వంటి దాన్ని కలిపే వాణ్ణి గానీ, యాజకుడు కాని వారిపై దాన్ని చల్లే వాణ్ణి గానీ తన ప్రజల్లో లేకుండా చెయ్యాలి’ అని చెప్పు.”
[34] యెహోవా మోషేతో ఇంకా ఇలా చెప్పాడు “నువ్వు జటామాంసి, గోపిచందనం, గంధం, సాంబ్రాణి సమపాళ్ళలో తీసుకుని వాటితో పరిమళ ద్రవ్యాలను, ధూపద్రవ్యం సిద్ధపరచాలి.
[35] పరిమళ ద్రవ్యాల నిపుణుడైన పనివాడు దాన్ని కలపాలి. దానికి ఉప్పు కలపాలి. ఆ ధూప మిబాధం స్వచ్ఛమైనదిగా, పవిత్రంగా ఉంటుంది.
[36] దానిలో కొంచెం పొడి తీసి నేను నిన్ను కలుసుకొనే సన్నిధి గుడారంలో శాసనాల మందసం ఎదుట ఉంచాలి. మీరు దాన్ని పరిశుద్ధమైనదిగా భావించాలి.
[37] నీవు చేయవలసిన ఆ ధూప ద్రవ్యాల వంటి ధూపాలను మీ కోసం కలుపుకోకూడదు. అది కేవలం యెహోవాకు ప్రత్యేకమైనది అని భావించాలి.
[38] దాని వాసన చూద్దామని అలాంటి దాన్ని తయారు చేసేవాణ్ణి ప్రజల్లో లేకుండా చెయ్యాలి.”