Skip to content
Opens in a new window
Listen to this chapter • 4:29

[1] దేవుడు ఈ ఆజ్ఞలన్నిటినీ వివరించి చెప్పాడు,

[2] నేను యెహోవాను, మీ దేవుణ్ణి. ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న మిమ్మల్ని బయటకు తీసుకు వచ్చిన దేవుణ్ణి నేనే.

[3] నేను కాక వేరే దేవుడు మీకు ఉండకూడదు.

[4] పైన ఆకాశంలో గానీ, కింద భూమి మీద గానీ, భూమి కింద ఉండే నీళ్లలో గానీ ఎలాంటి ఆకారాన్నీ, ప్రతిమను తయారు చేసుకోకూడదు, వాటి ముందు సాష్టాంగపడ కూడదు, వాటిని పూజించ కూడదు.

[5] ఎందుకంటే నీ దేవుడనైన నేను రోషం గలవాణ్ణి. నన్ను లక్ష్యపెట్టని వారి విషయంలో వాళ్ళ మూడు నాలుగు తరాల దాకా వాళ్ళ పూర్వికుల దుష్టత్వం వారి సంతతి పైకి రప్పిస్తాను.

[6] నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు పాటించే వారిపై వెయ్యి తరాల వరకూ నా కరుణ చూపిస్తాను.

[7] నీ దేవుడైన యెహోవా నామాన్ని వ్యర్థంగా పలకకూడదు. తన నామాన్ని వ్యర్థంగా పలికే వాణ్ణి యెహోవా దోషిగా పరిగణిస్తాడు.

[8] విశ్రాంతి దినాన్ని పవిత్రంగా ఆచరించాలని జ్ఞాపకం ఉంచుకోవాలి.

[9] నువ్వు కష్టపడి ఆరు రోజుల్లో నీ పని అంతా ముగించాలి.

[10] ఏడవ రోజు నీ దేవుడైన యెహోవాకు విశ్రాంతి దినం. ఆ రోజున నువ్వు, నీ కొడుకు, కూతురు, సేవకుడు, దాసీ, నీ ఇంట్లో ఉన్న విదేశీయుడు, నీ పశువులు ఎవ్వరూ ఏ పనీ చెయ్యకూడదు.

[11] ఆరు రోజుల్లో యెహోవా ఆకాశాన్ని, భూమిని, సముద్రాన్ని, సముద్రంలో ఉన్న సమస్తాన్నీ సృష్టించాడు. ఏడవ రోజున విశ్రాంతి తీసుకున్నాడు. అందువల్ల యెహోవా విశ్రాంతి దినాన్ని దీవించి తనకోసం పవిత్ర పరిచాడు.

[12] నీ దేవుడైన యెహోవా మీకివ్వబోయే దేశంలో నువ్వు దీర్ఘకాలం జీవించేలా నీ తండ్రిని, తల్లిని గౌరవించాలి.

[13] హత్య చెయ్యకూడదు.

[14] వ్యభిచారం చెయ్యకూడదు.

[15] దొంగతనం చెయ్యకూడదు.

[16] నీ పొరుగువాడిపై తప్పుడు సాక్ష్యం చెప్పకూడదు.

[17] నీ పొరుగువాడి ఇల్లు గానీ, అతని భార్యను గానీ, దాస దాసీలను గానీ, అతని ఎద్దును గానీ, గాడిదను గానీ, నీ పొరుగు వాడికి చెందిన దేనినీ ఆశించకూడదు.

[18] ప్రజలంతా ఆ ఉరుములు, మెరుపులు, భీకరమైన బూర శబ్దం, ఆ కొండ నుండి రగులుతున్న పొగ చూసి భయపడ్డారు. భయంతో దూరంగా తొలగిపోయి మోషేతో,

[19] “దేవుడే గనక మాతో మాట్లాడితే మేమంతా చచ్చిపోతాం. నువ్వే మాతో మాట్లాడు, మేము వింటాం” అన్నారు.

[20] అందుకు మోషే “భయపడకండి. మిమ్మల్ని పరీక్షించడానికి, ఇక నుంచి మీరు పాపం చేయకుండా ఆయన భయం మీకు ఉండేలా దేవుడు వచ్చాడు” అని ప్రజలతో చెప్పాడు.

[21] ప్రజలు దూరంగా నిలబడ్డారు. మోషే దేవుడు ఉన్న కారుమబ్బుల దగ్గరికి చేరుకున్నాడు.

[22] యెహోవా మోషేతో ఇలా చెప్పాడు. “ఇశ్రాయేలు ప్రజలతో ఇలా చెప్పు. నేను ఆకాశంలో నుండి దిగి వచ్చి మీతో మాట్లాడాను అనడానికి మీరే సాక్షులు.

[23] మీరు నన్ను ఆరాధించడానికి వెండి, లేదా బంగారపు ప్రతిమలను తయారు చేసుకోకూడదు.

[24] మట్టితో నా కోసం బలిపీఠం నిర్మించి దాని మీద మీ హోమబలులూ, శాంతిబలులూ, మీ గొర్రెలూ, ఎద్దులూ అర్పించాలి. నా పేరు గుర్తుంచుకొనేలా నేను దాన్ని ఉంచే ప్రతి స్థలం లో మీ దగ్గరికి వచ్చి మిమ్మల్ని ఆశీర్వదిస్తాను.

[25] ఒకవేళ మీరు నాకు రాళ్లతో బలిపీఠం నిర్మించే పక్షంలో చెక్కిన రాళ్లతో దాన్ని కట్టకూడదు, దానికి నీ చేతి పనిముట్టు తగిలితే అది అపవిత్రం అవుతుంది.

[26] అంతేకాదు, నా బలిపీఠం సమీపించేటప్పుడు మీ నగ్నత్వం కనిపించకూడదు కాబట్టి మెట్ల మీదుగా ఎక్కకూడదు.”

నిర్గమకాండం — Chapters