Skip to content
Opens in a new window
Listen to this chapter • 8:33

[1] ఆదివారం తెల్లవారుఝామున ఆ స్త్రీలు తాము సిద్ధం చేసిన సుగంధ ద్రవ్యాలను తీసుకొని సమాధి దగ్గరకు వెళ్ళారు.

[2] సమాధికి ఉన్న రాయి త్రోసి వేయబడి ఉండటం గమనించి లోపలికి వెళ్ళి చూసారు.

[3] అక్కడ వాళ్ళకు యేసు ప్రభువు దేహం కనిపించ లేదు.

[4] దీన్ని గురించి వాళ్ళింకా ఆశ్చర్యపడుతుండగా అకస్మాత్తుగా యిద్దరు వ్యక్తులు ప్రత్యక్షమై వాళ్ళ ప్రక్కన నిలుచున్నారు. వాళ్ళ దుస్తులు మెరుపువలె మెరుస్తూ ఉన్నాయి.

[5] భయంతో ఆ స్త్రీలు ముఖాల్ని వంచుకొన్నారు. ఆ దేవదూతలు, “మీరు బ్రతికి ఉన్నవాని కోసం చనిపోయిన వాళ్ళ మధ్య ఎందుకు వెతుకుతున్నారు?

[6] ఆయన బ్రతికి, యిక్కడినుండి వెళ్లిపోయాడు. ఆయన మీతో కలిసి గలిలయలో ఉన్నప్పుడు, ‘మనుష్యకుమారుడు పాపాత్ములకు అప్పగింపబడాలి; సిలువ మీద చంపబడాలి. మూడవ రోజు బ్రతికి రావాలి!’ అని అన్న విషయం మీకు జ్ఞాపకం లేదా!” అని అన్నారు.

[8] అప్పుడు వాళ్ళకు ఆయన మాటలు జ్ఞాపకం వచ్చాయి.

[9] మగ్దలేనే మరియ, యోహాన్న, యాకోబుల తల్లి మరియ, మరియు మిగతా స్త్రీలు సమాధినుండి వెళ్ళి ఈ విషయాలు ఆ పదకొండుగురికి, మిగతా వాళ్ళకు చెప్పారు.

[11] ఆ స్త్రీల మాటలకు అర్థం లేదనుకొని శిష్యులు వాళ్ళ మాటలు నమ్మలేదు.

[12] అయినా పేతురు లేచి ఆ సమాధి దగ్గరకు పరుగెత్తాడు. లోనికి తొంగి చూసి, కట్టబడిన వస్త్రాలు అక్కడ పడివుండటం గమనించాడు. ఏమి జరిగి ఉంటుందా? అని ఆశ్చర్యపడ్తూ వెళ్ళిపోయాడు.

[13] అదే రోజు వాళ్ళలో ఇద్దరు ఎమ్మాయు అనే గ్రామానికి వెళ్తూవున్నారు. అది యెరూషలేముకు ఏడుమైళ్ళ దూరంలో ఉంది.

[14] వాళ్ళు జరిగిన సంఘటనలను గురించి మాట్లాడుకొంటున్నారు.

[15] వాళ్ళు ఈ విషయాన్ని గురించి చర్చిస్తూండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో కలిసి నడవటం మొదలు పెట్టాడు.

[16] కాని తానెవ్వరో వాళ్ళను గుర్తుపట్టనివ్వలేదు.

[17] యేసు వాళ్ళతో, “మీరు ఏం మాట్లాడుకొంటున్నారు?” అని అడిగాడు. వాళ్ళు ఆగిపొయ్యారు. వాళ్ళ ముఖంల్లో దుఃఖం ఉంది.

[18] వాళ్ళలో క్లెయొపా అనేవాడు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “ఈ మధ్య జరిగిన సంఘటనలు తెలుసుకోకుండా యెరూషలేములో నివసిస్తూన్న వాడివి నీవొక్కడివేనా!”

[19] “ఏ సంఘటనలు?” అని యేసు అడిగాడు. వాళ్ళు, “నజరేతు నివాసియైన యేసును గురించి. ఆయన ఒక ప్రవక్త. గొప్ప విషయాలు చెప్పాడు. గొప్ప పనులు చేశాడు. ప్రజల మెప్పు, దేవుని మెప్పు పొందాడు.

[20] మా ప్రధాన యాజకులు, పాలకులు, మరణ దండన విధించుమని ఆయన్ని అధికారులకు అప్పగించారు. వాళ్ళు ఆయన్ని సిలువకు వేసారు.

[21] ఆయన ఇశ్రాయేలును రక్షిస్తాడని ఆశించాము. “పైగా యివన్నీ మూడు రోజుల క్రితం జరిగాయి.

[22] అంతేకాక మాతో ఉన్న కొందరు స్త్రీలు ఆశ్చర్యం కలిగించే విషయం మాకు చెప్పారు. వాళ్ళు ఈ రోజు తెల్లవారు ఝామున సమాధిదగ్గరకు వెళ్ళారు.

[23] కాని, అక్కడ వాళ్ళకు యేసు దేహం కనిపించలేదు. తాము దేవ దూతల్ని చూసినట్లు, ఆ దేవదూతలు యేసు బ్రతికి వచ్చాడని చెప్పినట్లు మాకు చెప్పారు.

[24] మాతో ఉన్న వాళ్ళు కొందరు సమాధి దగ్గరకు వెళ్ళి అది ఆ స్త్రీలు వర్ణించిన విధంగా ఉండటం గమనించారు. కాని అక్కడ యేసు కనిపించలేదు” అని అన్నారు.

[25] యేసు వాళ్ళతో, “అజ్ఞానులారా! ప్రవక్తలు చెప్పిన విషయాలు నమ్మటానికి యింత ఆలస్యం ఎందుకు చేస్తున్నారు?

[26] క్రీస్తు చనిపోయి తర్వాత కదా తేజస్సు పొందాలి!” అని అన్నాడు.

[27] ఆ తదుపరి మోషే గ్రంథాలతో, ప్రవక్తల వ్రాతలతో మొదలు పెట్టి తనను గురించి లేఖనాల్లో వ్రాసినవన్నీ వాళ్ళకు అర్థమయ్యేటట్లు చెప్పాడు.

[28] వాళ్ళు వెళ్ళనున్న గ్రామం దగ్గరకు వచ్చింది. యేసు తాను యింకా ముందుకు వెళ్ళనున్న వానిలా కనిపించాడు.

[29] కాని వాళ్ళు, “సాయంకాలమైంది. చీకటి కాబోతోంది. మాతో ఉండిపొండి!” అని అన్నారు. యేసు సరేనని వాళ్ళతో వాళ్ళ యింటికి వెళ్ళాడు.

[30] వాళ్ళతో భోజనానికి కూర్చున్నాక ఆయన రొట్టె తీసుకొని దేవునికి కృతజ్ఞత చెప్పి దాన్ని విరిచి వాళ్ళకిచ్చాడు.

[31] అప్పుడు వాళ్ళ కండ్లు తెరిపించాడు. వెంటనే వాళ్ళు ఆయన్ని గుర్తించారు. కాని ఆయన అదృశ్యమయ్యాడు.

[32] ఆ తర్వాత ఆ యిద్దరూ, “దారిపై నడుస్తుండగా ఆయన మాట్లాడి, లేఖనాల్లో నిజమైన అర్థాన్ని మనకు చెప్పినప్పుడు గుండెల్లో మండుతున్నట్లు అనిపించలేదా?” అని మాట్లాడుకున్నారు.

[33] వాళ్ళు లేచి వెంటనే యెరూషలేము వెళ్ళారు. అక్కడ ఆ పదకొండుగురు శిష్యులు, మిగతా వాళ్ళు సమావేశమై ఉన్నారు.

[34] వాళ్ళలో ఒకడు, “ఔను! ఇది నిజం. ప్రభువు బ్రతికి వచ్చి సీమోనుకు కనిపించాడు” అని అన్నాడు.

[35] ఆ తదుపరి ఆ వచ్చిన వాళ్ళు దారిపై జరిగిన సంఘటనను, యేసు రొట్టెను విరిచినప్పుడు తాము ఆయన్ని గుర్తించిన విషయము చెప్పారు.

[36] వాళ్ళు ఈ విషయాన్ని గురించి యింకా మాట్లాడుతుండగా యేసు స్వయంగా వచ్చి వాళ్ళతో నిలుచుని, “శాంతి కలుగుగాక” అని అన్నాడు.

[37] వాళ్ళు భూతాన్ని చూసామనుకొని వణికి భయపడిపోయారు.

[38] యేసు వాళ్ళతో, “మీరెందుకు భయపడ్తున్నారు. మీకు సందేహాలు ఎందుకు కలుగుతున్నాయి?

[39] నా చేతులు, కాళ్ళు చూడండి. నేనే ఆయనను. తాకి చూడండి. నాకు మాంసము, ఎముకలు ఉన్నాయి. భూతానికి అవి ఉండవు” అని అన్నాడు.

[40] ఆయన ఈ మాటలు అంటూ తన చేతులు, కాళ్ళు వాళ్ళకు చూపాడు.

[41] వాళ్ళకు ఆశ్చర్యము, ఆనందము కలిగాయి. వాళ్ళు నమ్మలేకపొయ్యారు. అప్పుడు యేసు, “మీ దగ్గర తినటానికి ఏమైనా ఉందా?” అని అడిగాడు.

[42] వాళ్ళు ఒక కాల్చిన చేపను తెచ్చి యిచ్చారు.

[43] ఆయన దాన్ని తీసుకొని వాళ్ళ సమక్షంలో తిన్నాడు.

[44] ఆయన, “నేను మీతో కలిసి ఉన్నప్పుడు మోషే ధర్మశాస్త్రంలో, ప్రవక్తల గ్రంథాలలో, కీర్తనలలో నన్ను గురించి వ్రాసినవన్నీ జరుగుతాయి అని చెప్పాను” అని అన్నాడు.

[45] అప్పుడు వాళ్ళు లేఖనాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశ్యంతో వాళ్ళ కండ్లు తెరిపించాడు.

[46] ఆయన వాళ్ళతో, “ఈ విధంగా వ్రాయబడి ఉంది: క్రీస్తు చనిపోయి మూడవరోజున బ్రతికి వస్తాడు!

[47] పశ్చాత్తాపాన్ని గురించి, పాప క్షమాపణ గురించి ఆయన పేరిట ప్రకటించటం మొదట యెరూషలేములో మొదలౌతుంది. ఆ పిదప అది అన్ని దేశాల్లో ప్రకటింపబడుతుంది.

[48] మీరు వీటికి సాక్షులు.

[49] నా తండ్రి వాగ్దానం చేసిన ఆయన్ని నేను పంపుతాను. కాని పరలోకం నుండి మీకు పరిశుద్ధాత్మ శక్తి లభించే దాకా ఈ పట్టణంలోనే ఉండండి” అని చెప్పాడు.

[50] ఆ తర్వాత వాళ్ళను అక్కడి నుండి బేతనియ దాకా తీసుకు వెళ్ళి తన చేతులెత్తి వాళ్ళను ఆశీర్వదించాడు.

[51] వాళ్ళను ఆశీర్వదిస్తుండగా ఆయన వాళ్ళ నుండి దూరం చేయబడ్డాడు. ఆ తర్వాత పరలోకానికి తీసుకు వెళ్ళబడ్డాడు.

[52] ఆ తర్వాత వాళ్ళాయనకు నమస్కరించి చాలా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళారు.

[53] వాళ్ళు మందిరంలో ఉండి విరామం లేకుండా దేవుని స్తుతించారు.

లూకా సువార్త — Chapters