[1] నిరంతరం ప్రార్థిస్తూ ఉండాలని, నిరుత్సాహం చెందరాదని, బోధించటానికి యేసు తన శిష్యులకు ఈ ఉపమానం చెప్పాడు:
[2] “ఒక గ్రామంలో ఒక న్యాయాధిపతి ఉండేవాడు. అతనికి దేవుడంటే భయంకాని, ప్రజలు తనని గురించి ఏమనుకొంటారనే భీతికాని లేకుండెను.
[3] అదే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. ఆమె ఆ న్యాయాధిపతి దగ్గరకు ప్రతిరోజు వచ్చి ‘నాకు ఒకడు అన్యాయం చేశాడు. నాకు న్యాయం చేకూర్చండి’ అని అడుగుతూ ఉండేది.
[4] చాలా కాలం అతడు ఆమె మాటలు పట్టించుకోలేదు. కాని చివరకు ‘నాకు దేవుడంటే భయంకాని, ప్రజలంటే భీతికాని లేదు.
[5] కాని ఈ వితంతువు వచ్చి నన్ను విసిగిస్తోంది. కాబట్టి ఈమె మళ్ళీ మళ్ళీ నా దగ్గరకు రాకుండ ఈమెకు న్యాయం జరిగేలా చూస్తాను’ అని తన మనస్సులో అనుకున్నాడు.”
[6] ఇలా చెప్పి ప్రభువు, “ఆ నీతి నియమం లేని న్యాయాధిపతి అనుకొన్న మాటలు విన్నారు కదా!
[7] మరి దేవుడు తనను రాత్రింబగళ్ళు ప్రార్థించే తన వాళ్ళకు న్యాయం చేకూర్చకుండా ఉంటాడా? వాళ్ళకు న్యాయం చెయ్యటంలో ఆలస్యం చేస్తాడా!
[8] ఆయన వాళ్ళకు వెంటనే న్యాయం చేకూరుస్తాడని నేను చెబుతున్నాను. కాని మనుష్యకుమారుడు వచ్చినప్పుడు ఈ ప్రపంచంలోని ప్రజలలో విశ్వాసాన్ని కనుగొంటాడా?” అని అన్నాడు.
[9] తాము మాత్రమే నీతిమంతులమని అనుకొని యితర్లను చిన్నచూపు చూసేవాళ్ళకు యేసు ఈ ఉపమానం చెప్పాడు:
[10] “ఇద్దరు మనుష్యులు మందిరానికి వెళ్ళారు. ఒకడు పరిసయ్యుడు, ఒకడు పన్నులు వసూలు చేసేవాడు.
[11] పరిసయ్యుడు ఒక ప్రక్కనిలుచొని ఈ విధంగా ప్రార్థించటం మొదలు పెట్టాడు: ‘ప్రభూ! నేను యితరుల్లా, అంటే మోసగాళ్ళల్లా, దుర్మార్గుల్లా, వ్యభిచారుల్లా ఉండనందుకు నీకు కృతజ్ఞుణ్ణి. ఈ పన్నులు సేకరించేవానిలా నేను ఉండనందుకు కూడా కృతజ్ఞుణ్ణి.
[12] నేను వారానికి రెండుసార్లు ఉపవాసాలు చేస్తాను. నా సంపదలో పదవవంతు దేవుని పేరిట యిస్తాను.’
[13] “ఆ పన్నులు సేకరించేవాడు మరొక ప్రక్క నిలుచొని ఆకాశం వైపు కూడా చూడటానికి ధైర్యము లేక గుండెలు బాదుకుంటూ, ‘దేవుడా! నేనొక పాపిని, నాపై దయచూపు’ అని అన్నాడు.
[14] దేవుని దృష్టిలో పరిసయ్యునికి మారుగా ఇతడు నీతిమంతుడనిపించుకొని ఇంటికి వెళ్ళాడు. ఎందుకంటే గొప్పలు చెప్పుకొన్నవాడు అణచబడతాడు. అణుకువతో ఉన్నవాడు గొప్ప స్థానానికి ఎత్తబడతాడు.”
[15] యేసు వారిని తాకాలని ప్రజలు చిన్న పిల్లల్ని ఆయన దగ్గరకు పిలుచుకు వచ్చారు. శిష్యులు యిది చూసి ప్రజల్ని వారించారు.
[16] కాని, యేసు ఆ చిన్న పిల్లల్ని తన దగ్గరకు పిలుస్తూ, “చిన్న పిల్లల్ని నా దగ్గరకు రానివ్వండి. వాళ్ళను ఆపకండి. దేవుని రాజ్యం వాళ్ళలాంటి వారిదే.
[17] యిది నిజం. దేవుని రాజ్యాన్ని చిన్న పిల్లల్లా అంగీరించనివాడు ఆందులోకి ప్రవేశించలేడు” అని అన్నాడు.
[18] ఒక యూదుల నాయకుడు యేసును, “బోధకుడా! మీరు మంచివాళ్ళు. నేను అనంత జీవితం పొందాలంటే ఏమి చెయ్యాలి?” అని అడిగాడు.
[19] “నేను మంచివాణ్ణని ఎందుకంటున్నావు? దేవుడు తప్ప మరెవ్వరూ మంచివాళ్ళు కాదు.
[20] నీకు దేవుని ఆజ్ఞలు తెలుసు కదా: ‘వ్యభిచారం చెయ్యరాదు, హత్య చెయ్యరాదు. దొంగతనము చెయ్యరాదు. దొంగ సాక్ష్యాలు చెప్పరాదు. తల్లి తండ్రుల్ని గౌరవించవలెను’” అని యేసు సమాధానం చెప్పాడు.
[21] “నేను చిన్ననాటినుండి ఈ నియమాలు పాటిస్తూనేవున్నాను” అని ఆ యూదుల పెద్ద అన్నాడు.
[22] ఇది విని యేసు అతనితో, “నీలో యింకొక లోపం ఉంది. నీ దగ్గరున్నవన్నీ అమ్మేసి పేదవాళ్ళకు దానం చెయ్యి. అది నీకు పరలోకంలో సంపద అవుతుంది. ఆ తదుపరి నన్ను అనుసరించు” అని అన్నాడు.
[23] ఆ యూదుల పెద్ద చాలా ధనవంతుడు. అందువల్ల యిది విని అతనికి చాలా దుఃఖం కలిగింది.
[24] యేసు అతడు దుఃఖపడటం చూసి, “ధనవంతులు దేవుని రాజ్యంలో ప్రవేశించటం చాలా కష్టం.
[25] ధనవంతుడు దేవుని రాజ్యంలోకి ప్రవేశించటంకన్నా ఒంటె సూది రంధ్రం ద్వారా వెళ్ళటం సులభం” అని అన్నాడు.
[26] ఇది విని వాళ్ళు, “మరి ఎవరు రక్షింపబడుతారు?” అని అడిగారు.
[27] “మానవునికి సాధ్యంకానిది దేవునికి సాధ్యమౌతుంది” అని యేసు అన్నాడు.
[28] పేతురు, “మిమ్మల్ని అనుసరించటానికి మాకున్నవన్నీ వదిలివేసాము” అని అన్నాడు.
[29] యేసు, “ఇది నిజం. దేవుని రాజ్యం కొరకు తన యింటిని, భార్యను, సోదరుల్ని, తల్లితండ్రుల్ని, సంతానాన్ని వదిలినవాడు ఏ మాత్రం నష్టపోడు.
[30] ఇప్పుడు ఎన్నోరెట్లు ఫలం పొందటమే కాకుండా మున్ముందు అనంత జీవితం పొందుతాడు.” అని అన్నాడు.
[31] యేసు పన్నెండుమందిని ప్రక్కకు పిలుచుకు వెళ్ళి, “మనం యెరూషలేము వెళ్ళాలి. మనుష్యకుమారుణ్ణి గురించి ప్రవక్తలు వ్రాసినవన్నీ నిజం కాబోతున్నాయి.
[32] ఆయన యూదులుకాని వాళ్ళకు అప్పగింపబడతాడు. వాళ్ళాయన్ని హేళన చేస్తారు. అవమానిస్తారు, ఆయనపై ఉమ్మి వేస్తారు,
[33] కొరడా దెబ్బలు కొడతారు. చివరకు చంపివేస్తారు. మూడవ రోజు ఆయన బ్రతికి వస్తాడు” అని అన్నాడు.
[34] శిష్యులకు ఆయన చెప్పింది ఏ మాత్రం అర్థం కాలేదు. ఆయన చెప్పిన దానిలో గూఢార్థం ఉంది. కాని వాళ్ళకది బోధపడలేదు.
[35] యేసు యెరికో పట్టణాన్ని సమీపిస్తున్నాడు. అదే సమయానికి ఒక గ్రుడ్డివాడు దారిప్రక్కన భిక్షమెత్తుకుంటూ కూర్చొని ఉన్నాడు.
[36] అతడు ప్రజల గుంపు వెళ్తుండటం గమనించి ఏమి జరుగుతోందని అడిగాడు.
[37] వాళ్ళు, “నజరేతు నివాసి యేసు ఈ దారిలో వెళ్తున్నాడు” అని చెప్పారు.
[38] ఆ గ్రుడ్డివాడు బిగ్గరగా, “యేసూ! దావీదు కుమారుడా! నామీద దయ చూపు!” అని అన్నాడు.
[39] ముందున్న వాళ్ళు అతణ్ణి గద్దిస్తూ నోరు మూసుకోమని చెప్పారు. కాని, అతడు యింకా బిగ్గరగా, “దావీదు కుమారుడా! నా మీద దయ చూపు” అని అన్నాడు.
[40] యేసు ఆగి ఆ గ్రుడ్డివాణ్ణి తన దగ్గరకు పిలుచుకురమ్మని ఆజ్ఞాపించాడు. అతడు దగ్గరకు రాగానే యేసు అతణ్ణి
[41] “ఏమి కావాలి?” అని అడిగాడు. “ప్రభూ! నాకు దృష్టి కావాలి!” అని గ్రుడ్డివాడు సమాధానం చెప్పాడు.
[42] యేసు, “నీకు దృష్టి కలగాలి! నీవు విశ్వసించావు కనుక నీకు దృష్టి కలిగింది” అని అన్నాడు.
[43] వెంటనే అతడు చూడగలిగాడు. ఆ గ్రుడ్డివాడు దేవుణ్ణి స్తుతిస్తూ యేసును అనుసరించాడు. ప్రజలందరూ యిది చూసి వారుకూడా దేవుణ్ణి స్తుతించారు.