Skip to content
Opens in a new window
Listen to this chapter • 9:25

[1] సృష్టికి ముందు నుండి జీవంగల వాక్యము ఉండెను. ఆ వాక్యము దేవునితో ఉండెను. ఆ వాక్యమే దేవుడు.

[2] ఆయన సృష్టికి ముందు దేవునితో ఉండేవాడు.

[3] ఆయన ద్వారా అన్నీ సృష్టింపబడ్డాయి. సృష్టింపబడినదేదీ ఆయన లేకుండా సృష్టింపబడలేదు.

[4] ఆయన జీవానికి మూలం. ఆ జీవం మానవ జాతికి వెలుగునిచ్చెను.

[5] వెలుగు చీకట్లో వెలుగుతోంది, కాని చీకటి దాన్ని అర్థం చేసుకోలేదు.

[6] దేవుడు ఒక వ్యక్తిని పంపాడు. అతని పేరు యోహాను.

[7] తన ద్వారా మానవులు వెలుగును గురించి విని, విశ్వసించాలని అతడు ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చాడు.

[8] అతడు ఆ వెలుగు కాదు. ఆ వెలుగును గురించి చెప్పటానికి వచ్చిన సాక్షి మాత్రమే అతడు.

[9] ప్రతి ఒక్కరికి వెలుగునిచ్చే ఆ నిజమైన వెలుగు ప్రపంచంలోకి~వస్తూ వుండెను.

[10] ఆయన ప్రపంచంలోకి వచ్చాడు. ఆయన ద్వారా ప్రపంచం సృష్టింపబడినా, ప్రపంచం ఆయన్ని గుర్తించలేదు.

[11] ఆయన తన స్వంత వాళ్ళ దగ్గరకు వచ్చాడు. కాని వాళ్ళాయనను ఒప్పుకోలేదు.

[12] అయినా, తనను ఒప్పుకొన్న వాళ్ళందరికి, అంటే తనను నమ్మిన వాళ్ళకందరికి, దేవుని సంతానమయ్యే హక్కును ఇచ్చాడు.

[13] కాని వీళ్ళు మానవుల రక్తం వలనకాని, శారీరక వాంఛలవల్ల కాని, మనుష్యుని నిర్ణయంవల్ల కాని, జన్మించలేదు. వీళ్ళు దేవుని సంతానం.

[14] ఆ జీవంగల వాక్యము మానవరూపం దాల్చి మానవుల మధ్య జీవించాడు. ఆయనలో కృప, సత్యము సంపూర్ణంగా ఉన్నాయి. ఆయన తండ్రికి ఏకైక పుత్రుడు. కనుక ఆయనలో ప్రత్యేకమైన తేజస్సు ఉంది. ఆ తేజస్సును మేము చూసాము.

[15] యోహాను ఆయన్ని గురించి ఈ విధంగా నొక్కి చెప్పాడు: “ఈయన గురించి నేను యిదివరకే ఈ విధంగా చెప్పాను, ‘నా తర్వాత రానున్నవాడు నాకన్నా ముందునుండి ఉన్నావాడు. కనుక ఆయన నాకన్నా గొప్పవాడు.’”

[16] ఆయన పరిపూర్ణతవల్ల మనమంతా అనుగ్రహం మీద అనుగ్రహం పొందాము.

[17] దేవుడు మోషే ద్వారా ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. యేసు క్రీస్తు ద్వారా కృపను, సత్యాన్ని ఇచ్చాడు.

[18] ఎవ్వరూ ఎన్నడూ దేవుణ్ణి చూడలేదు. దేవుని ప్రక్కనవున్న ఆయన ఏకైక పుత్రుడు దేవునితో సమానము. ఆయన మనకు దేవుణ్ణి గురించి తెలియచేసాడు.

[19] యోహానును అడిగి, అతడెవరన్న విషయం కనుక్కురావటానికి, యెరూషలేములోని యూదులు యాజకులను లేవీయులను అతని దగ్గరకు పంపారు.

[20] యోహాను సమాధానం చెప్పటానికి నిరాకరించలేదు. పైగా ఏదీ దాచకుండా స్పష్టంగా సమాధానం చెప్పాడు. యోహాను, “నేను క్రీస్తును కాదు!” అని~చెప్పాడు.

[21] వాళ్ళు అతణ్ణి, “మరి నీవెవరు? ఏలీయావా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు. వాళ్ళు, “ప్రవక్తవా?” అని అడిగారు. అతడు, “కాదు” అని అన్నాడు.

[22] చివరకు వాళ్ళు, “మరి నీవెవరవు? మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి మాకో సమాధానం చెప్పండి. మమ్మల్ని పంపిన వాళ్ళకు చెప్పటానికి నీ గురించి నీవేమని చెప్పుచున్నావు?” అని అడిగారు.

[23] యోహాను యిలా సమాధానం చెప్పాడు: “ప్రభువు కోసం చక్కటి మార్గం వేయుమని ఎడారి ప్రాంతాల్లో ఒక స్వరం ఎలుగెత్తి పలికింది.” ఇవి యెషయా ప్రవక్త అన్న మాటలు.

[24] వీళ్ళను పంపింది పరిసయ్యులు.

[25] వాళ్ళు మరొక ప్రశ్న వేస్తూ, “నీవు క్రీస్తువు కానంటున్నావు, ఏలీయావుకానంటున్నావు, ప్రవక్తవుకానంటున్నావు. అటువంటప్పుడు నీవు ప్రజలకు బాప్తిస్మము ఎందుకిస్తున్నావు?” అని అడిగారు.

[26] యోహాను సమాధానం చెబుతూ, “నేను నీళ్ళ ద్వారా బాప్తిస్మము యిస్తున్నాను. కాని మీరెరుగని వాడొకాయన మీ మధ్య ఉన్నాడు.

[27] నా తర్వాత రానున్నవాడు ఆయనే. ఆయన చెప్పులు విప్పటానికి కూడా నేను తగను” అని అన్నాడు.

[28] ఈ సంఘటనలన్నీ బేతనియ గ్రామంలో జరిగాయి. అది యోహాను బాప్తిస్మము ఇచ్చిన యొర్దాను నదికి అవతల వైపున ఉంది.

[29] మరుసటి రోజు యోహాను యేసు తన వైపురావటం చూసి, “అదిగో! దేవుని గొఱ్ఱెపిల్ల! ఆయన ప్రజల పాపాలను తన మీద వేసుకొంటాడు.

[30] నేను యిదివరలో, ‘నా తర్వాత రానున్న వాడొకడున్నాడు. ఆయన నాకన్నా ముందు నుండి ఉన్నవాడు. అందువలన ఆయన నాకన్నా గొప్పవాడు’ అని నేను చెప్పింది ఈయన్ని గురించే!

[31] అప్పుడాయన ఎవరో నాక్కూడా తెలియదు. కాని, ఆయన్ని ఇశ్రాయేలు ప్రజలకు తెలియ చేయటానికి బాప్తిస్మము నిస్తూ వచ్చాను” అని అన్నాడు.

[32] ఆ తర్వాత యోహాను మళ్ళీ ఈ విధంగా చెప్పాడు: “ఆకాశం నుండి పవిత్రాత్మ ఒక పావురంలా వచ్చి ఆయనపై వాలటం చూసాను.

[33] బాప్తిస్మము నివ్వటానికి దేవుడు నన్ను పంపాడు. ‘పవిత్రాత్మ క్రిందికి వచ్చి ఎవరి మీద వ్రాలుతాడో ఆ వ్యక్తి పవిత్రాత్మ ద్వారా బాప్తిస్మము యిస్తాడు’ అని దేవుడు నాకు ముందే చెప్పక పోయివుంటే ఆయనెవరో నాకు తెలిసేది కాదు.

[34] నేను ఈ సంఘటనను చూసాను. ఈయన దేవుని కుమారుడని సాక్ష్యం చెబుతున్నాను.”

[35] మరుసటి రోజు యోహాను అక్కడ నిలబడి ఉన్నాడు. అతని శిష్య బృందానికి చెందిన యిద్దరు అతనితో ఉండినారు.

[36] అదే సమయాన యేసు అలా వెళ్ళటం చూసి, “అదిగో దేవుని గొఱ్ఱెపిల్లను చూడండి!” అని అన్నాడు.

[37] ఆ యిద్దరు శిష్యులు అతడీమాట అనటం విని, యేసును అనుసరించారు.

[38] యేసు వాళ్ళ వైపు తిరిగి, వాళ్ళు రావటం చూసి, “మీకేం కావాలి?” అని అడిగాడు. వాళ్ళు, “రబ్బీ! మీరెక్కడ ఉంటున్నారు?” అని అడిగారు. (రబ్బీ అంటే గురువు అని అర్థం.)

[39] యేసు, “వచ్చి చూడండి” అని సమాధానం చెప్పాడు. వాళ్ళు వెళ్ళి ఆయనెక్కడ ఉంటున్నాడో చూసారు. ఆ రోజు ఆయనతో గడిపారు. అప్పుడు సుమారు సాయంకాలం నాలుగు గంటలు అయింది.

[40] యోహాను చెప్పింది విని, యేసును అనుసరించిన యిద్దరిలో

[41] అంద్రెయ ఒకడు. అంద్రెయ సీమోను పేతురు సోదరుడు. అంద్రెయ వెంటనే తన సోదరుడైన సీమోనును కనుగొని అతనితో, “మెస్సీయను కనుగొన్నాము” అని అన్నాడు.

[42] తర్వాత సీమోనును యేసు దగ్గరకు పిలుచుకువచ్చాడు. యేసు అతణ్ణి చూసి, “నీ పేరు సీమోను! నీవు యోహాను కుమారుడవు. ఇప్పటి నుండి నీవు కేఫా అని పిలువబడుతావు” అని అన్నాడు. కేఫా అంటే పేతురు అని అర్థం.

[43] మరుసటి రోజు యేసు గలిలయకు వెళ్ళాలని నిశ్చయించుకున్నాడు. ఫిలిప్పు దగ్గరకు వెళ్ళి అతనితో, “నన్ను అనుసరించు” అని అన్నాడు.

[44] అంద్రెయ, పేతురులాగే, ఫిలిప్పు కూడా బేత్సయిదా గ్రామస్థుడు.

[45] ఫిలిప్పు నతనయేలు కోసం వెతికి అతనితో, “మేము మోషే ధర్మశాస్త్రంలో ఎవర్ని గురించి వ్రాయబడివుందో ఆయన్ని కనుగొన్నాము. ప్రవక్తలు వ్రాసింది ఈయన్ని గురించే. ఈయన పేరు యేసు. ఈయన యోసేపు కుమారుడు. నజరేతు గ్రామస్థుడు” అని చెప్పాడు.

[46] నతనయేలు, “నజరేతు గ్రామం నుండి మంచి జరగటం సంభవమా!” అని అడిగాడు. “వచ్చి చూడు!” అని ఫిలిప్పు అన్నాడు.

[47] నతనయేలు తన వైపు రావటం యేసు చూసాడు. అతణ్ణి గురించి, “అదిగో! నిజమైన ఇశ్రాయేలీయుడు! అతనిలో ఏ కపటమూ లేదు” అని అన్నాడు.

[48] “మీకు నేనెలా తెలుసు?” అని నతనయేలు అడిగాడు. యేసు, “ఫిలిప్పు నిన్ను పిలువక ముందే, నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూసాను” అని అన్నాడు.

[49] నతనయేలు, “రబ్బీ! మీరు నిజముగా దేవుని కుమారుడు. ఇశ్రాయేలు జనాంగానికి ప్రభువు” అని అన్నాడు.

[50] యేసు, “నీవు అంజూరపు చెట్టు క్రింద ఉండటం చూసానని చెప్పినందుకు విశ్వసిస్తున్నావా? వీటికన్నా గొప్ప వాటిని చూస్తావు!” అని అన్నాడు.

[51] ఆయన మళ్ళీ, “ఇది నిజం. ఆకాశం తెరచుకోవటం, దేవదూతలు మనుష్యకుమారుని యొద్దకు దిగటం, మరల ఎక్కిపోవటం చూస్తావు” అని అన్నాడు.

యోహాను సువార్త — Chapters