[1] అంతలో వేలమంది ప్రజలు సమావేశమవటం వలన ఒకళ్ళనొకళ్ళు త్రోసు కోవటం మొదలు పెట్టారు. యేసు మొదట తన శిష్యులతో మాట్లాడుతూ ఈ విధంగా అన్నాడు: “పరిసయ్యుల ప్రభావానికి గురికాకుండా జాగ్రత్తపడండి.
[2] బయట పడకుండా ఏదీ దాగివుండదు. దాచబడింది ఏదీ బహిరంగం కాకుండా పోదు.
[3] చీకట్లో మాట్లాడుకున్న మాటలు అందరికీ వినిపిస్తాయి. గది తలుపులు వేసుకొని రహస్యంగా మాట్లాడుకున్న విషయాలు ఇంటి కప్పుల మీదినుండి ప్రకటింపబడతాయి.
[4] “మిత్రులారా! నేను చెబుతున్నది వినండి: ఈ శరీరాన్ని చంపేవాళ్ళను చూసి భయపడకండి. దాన్ని చంపాక వాళ్ళేమీ చెయ్యలేరు.
[5] ఎవరికి భయపడాలో నేను చెబుతున్నాను. శరీరం చనిపోయాక మిమ్మల్ని నరకంలో పారవేయటానికి అధికారమున్న వానికి భయపడండి! ఔను, ఆయనకు భయపడుమని చెబుతున్నాను.
[6] “రెండు కాసులకు ఐదు పిచ్చుకలు అమ్ముడు పోతాయి కదా! అయినా, ఒక్క పిచ్చుకనైనా దేవుడు మరచిపోలేదు.
[7] మీ తల మీద ఎన్ని వెంట్రుకలు ఉన్నాయో కూడా దేవునికి తెలుసు. పిచ్చుకలకన్నా మీ విలువ ఎక్కువే! కనుక భయపడకండి.
[8] “బహిరంగంగా నన్ను అంగీకరించిన వాణ్ణి మనుష్యకుమారుడు దేవదూతల సమక్షంలో అంగీకరిస్తాడని నేను చెబుతున్నాను.
[9] కాని ప్రజల సమక్షంలో నన్ను కాదన్న వాణ్ణి మనుష్యకుమారుడు దేవుని సమక్షంలో కాదంటాడు.
[10] “మనుష్యకుమారుణ్ణి దూషించిన వాణ్ణి దేవుడు క్షమించవచ్చునేమో కాని పవిత్రాత్మను దూషించినవాణ్ణి దేవుడు క్షమించడు.
[11] “సమాజమందిరాల ముందు, లేక పాలకుల ముందు, లేక అధికారుల ముందు మిమ్మల్ని నిలబెడితే ఏ విధంగా మాట్లాడాలో, నిర్దోషులని ఏ విధంగా ఋజువు చేసుకోవాలో చింతించకండి.
[12] మీరు ఏమి మాట్లాడాలో అప్పుడు పవిత్రాత్మ మీకు చెబుతాడు.”
[13] ప్రజల నుండి ఒకడు, “అయ్యా! నా సోదరుణ్ణి ఆస్తి పంచిపెట్టమని చెప్పండి” అని అన్నాడు.
[14] యేసు, “నన్ను మీ న్యాయాధిపతిగా లేక మీ మధ్యవర్తిగా ఎవరు నియమించారు?” అన్నాడు.
[15] ఆ తర్వాత వాళ్ళతో, “జాగ్రత్త! అత్యాసలకు పోకండి. మానవుని జీవితం అతడు ఎంత ఎక్కువ కూడబెట్టాడన్న దానిపై ఆధారపడి ఉండదు” అని యేసు అన్నాడు.
[16] ఆయన వాళ్ళకు ఈ ఉపమానం చెప్పాడు: “ఒక ధనికుడు ఉండేవాడు. అతని పొలంలో బాగాపంట పండింది.
[17] అతడు ‘నేనేం చేయాలి? నా దగ్గర ఈ ధాన్యం దాచటానికి స్థలం లేదే’ అని తన మనస్సులో ఆలోచించసాగాడు.
[18] “‘ఆ! ఇలా చేస్తాను. నా ధాన్యపు కొట్టుల్ని పడగొట్టి యింకా పెద్దవి కట్టిస్తాను. వాటిలో నా ధాన్యాన్ని, వస్తువుల్ని దాస్తాను’ అని అనుకొన్నాడు. ఆ తర్వాత అతడు, తనతో
[19] ‘అదృష్టవంతుడివి, సంవత్సరాలదాకా సరిపోయే వస్తువుల్ని కూడబెట్టుకున్నావు. ఇక జీవితాన్ని సుఖంగా గడుపు. తిను, త్రాగు, ఆనందించు’ అని చెప్పుకుంటానని అనుకొన్నాడు.
[20] “కాని దేవుడు అతనితో, ‘మూర్ఖుడా! ఈ రాత్రే నీ ప్రాణం పోతుంది. అప్పుడు నీవు నీకోసం దాచుకొన్నవి ఎవరు అనుభవిస్తారు?’ అని అడిగాడు.
[21] “ఐహిక సంపదల్ని కూడబెట్టుకొని, ఆధ్యాత్మిక సంపదల్ని నిర్లక్ష్యం చేసినవాని గతి అదే విధంగా ఉంటుంది.”
[22] ఈ విధంగా చెప్పి యేసు తన శిష్యులతో ఇలా అన్నాడు: “అందువల్ల నేను చెప్పేదేమిటంటే జీవించటానికి ఏమి తినాలి? మీ దేహాలకు ఏ దుస్తులు ధరించాలి? అని చింతించకండి.
[23] మీ జీవితం ఆహారాని కన్నా ముఖ్యమైనది. దేహం దుస్తులకన్నా విలువైనది.
[24] పక్షుల్ని చూడండి. అవి విత్తనాలు నాటవు. పంటకోయవు. వాటిదగ్గర ఎలాంటి ధాన్యపు కొట్లు లేవు. దేవుడు వాటికి ఆహారం చూపిస్తున్నాడు. మీరాపక్షుల కన్నా విలువైన వాళ్ళు.
[25] చింతించి తన జీవితాన్ని ఒక గంట పొడిగించగల వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా?
[26] మీరింత చిన్న విషయం సాధించ లేనప్పుడు మిగతా వాటిని గురించి ఎందుకు చింతిస్తున్నారు?
[27] “పువ్వులు ఏ విధంగా పెరుగుతున్నాయో గమనించండి. అవి పని చేయవు. దారం వడకవు. నేను చెప్పేదేమిటంటే ఖరీదైన దుస్తులు వేసుకొనే సొలొమోను రాజుకూడా ఏ ఒక్క పువ్వుతో సరితూగలేడు.
[28] మీలో కొంతకూడా విశ్వాసం లేదు. ఎందుకు? ఈ రోజు ఉండి, రేపు అగ్నిలో కాలిపోయే గడ్డిని దేవుడు అంత అందంగా అలంకరించాడు కదా! మరి మిమ్మల్నెంత అందంగా అలంకరిస్తాడో ఆలోచించండి.
[29] “అందువల్ల ఏమి తినాలి, ఏమి త్రాగాలి అని ప్రాకులాడకండి. వాటిని గురించి చింతించకండి.
[30] ప్రపంచం లోవున్న ప్రతి ఒక్కడూ వాటికోసం ప్రాకులాడుతాడు. మీ తండ్రికి మీకేవి అవసరమో తెలుసు.
[31] ఆయన రాజ్యాన్ని, నీతిని సంపాదించుకోండి. అప్పుడు దేవుడు మీకు యివి కూడా యిస్తాడు.
[32] “మీరు అమాయకమైన చిన్న మందలాంటి వాళ్ళు. కాని భయపడకండి. మీ తండ్రి తన రాజ్యాన్ని మీకు ఆనందంగా ఇస్తాడు.
[33] మీ ఆస్థి అమ్మి పేదవాళ్ళకు దానం చెయ్యండి. పాతబడని డబ్బుల సంచి సిద్దం చేసుకోండి. మీ ధనాన్ని పరలోకంలో దాచండి. అక్కడ అది తరగదు. దొంగలు దాన్ని ముట్టలేరు. ఆ సంపదకు చెదలు పట్టవు.
[34] మీ ధనమున్న చోటే మీ మనస్సు కూడా ఉంటుంది.
[35] “మీ నడికట్టుతో నడుముకు చుట్టి, దీపాలు వెలిగించి సిద్దంగా ఉండండి.
[36] పెళ్ళి విందుకు వెళ్ళి యింటికి వస్తున్న యజమాని కోసం కాచుకొని ఉండే సేవకుల్లా ఉండండి. అలా చేస్తే యజమాని వచ్చి తలుపు తట్టిన వెంటనే అతనికోసం మీరు తలుపు తీయకలుగుతారు.
[37] యజమాని వచ్చినప్పుడు మెలుకువతో ఉన్న సేవకులు ధన్యులు. ఇది నిజం. యజమాని వచ్చి తానే నడుము బిగించుకొని స్వయంగా సేవ చేస్తాడు. సేవకుల్ని కూర్చోబెట్టి వాళ్ళకు వడ్డించటానికి సిద్ధమౌతాడు.
[38] అతడు ఏ అర్థరాత్రికో లేక తెల్లవారుఝామునో వచ్చినప్పుడు అతని కోసం సిద్దంగావున్న సేవకులు ధన్యులు. వాళ్ళకు శుభం కలుగుతుంది.
[39] “కాని యిది అర్థంచేసుకోండి. దొంగ ఏ ఘడియలో వస్తాడో యింటి యజమానికి తెలిస్తే అతడు తన యింట్లోకి దొంగల్ని రానివ్వడు.
[40] మీరు కూడా సిద్ధంగా వుండండి. ఎందుకంటే మనుష్య కుమారుడు మీరు అనుకోని సమయంలో వస్తాడు.”
[41] పేతురు, “ప్రభూ! మీరీ ఉపమానం మాకోసం చెబుతున్నారా లేక అందరి కోసమా?” అని అడిగాడు.
[42] ప్రభువు ఈ విధంగా సమాధానం చెప్పాడు: “తెలివిగల ఉత్తమ సేవకుడు ఎవడు? ఆ యజమాని తిరిగి వచ్చినప్పుడు తాను విశ్వసించగల వాణ్ణి, తెలివి గలవాణ్ణి తన యితర సేవకులకు సరియైన ఆహారం ఇవ్వటానికి వాళ్ళపై అధికారిగా నియమిస్తాడు.
[43] ఆ యజమాని వచ్చినప్పుడు, అతడు చెప్పిన విధంగా నడుచుకొన్న సేవకుడు ధన్యుడు.
[44] ఇది నిజం. ఆ యజమాని అతణ్ణి తన ఆస్థికంతటికి అధికారిగా నియమిస్తాడు.
[45] “కాని ఒకవేళ ఆ సేవకుడు తనలో తాను, ‘నా యజమాని త్వరలో రాడు’ అని అనుకొని తన క్రింద పనిచేసేవాళ్ళను ఆడా మగా అనే భేదం లేకుండా కొట్టి, తిని త్రాగటం మొదలు పెడతాడనుకోండి.
[46] యజమాని ఆ సేవకుడు ఎదురుచూడని రోజున అనుకోని సమయంలో వచ్చి ఆ సేవకుణ్ణి నరికించి భక్తిహీనుల గుంపులో చేరుస్తాడు.
[47] “తన యజమాని మనస్సు తెలిసి కూడా, అతని యిష్టానుసారం పని చెయ్యని సేవకుడికి ఎక్కువ దెబ్బలు తగులుతాయి.
[48] కాని తెలియక శిక్షార్హమైన పనులు చేసిన వాడికి తక్కువ దెబ్బలు తగులుతాయి. దేవుడు తాను ఎక్కువగా యిచ్చిన వాళ్ళనుండి ఎక్కువ కోరుతాడు. ఎక్కువ అప్పగించినవాళ్ళ నుండి యిచ్చిన దానికన్నా ఎక్కువ ఆశిస్తాడు.
[49] “నేను ఈ భూమ్మీద అగ్ని వేయడానికి వచ్చాను. ఆ అగ్ని యిదివరకే రగిలి ఉండాలని ఆశించాను.
[50] కాని నేను పొందవలసిన బాప్తిస్మము ఉంది. అది జరిగే వరకు నాకీ వేదన తప్పదు.
[51] శాంతిని కలుగ జేయుటకు నేనీ భూమ్మీదికి వచ్చాననుకొంటున్నారా? కాదు. దీన్ని విభజించటానికి వచ్చాను.
[52] ఇప్పటి నుండి ఒక కుటుంబంలో ఐదుగురు ఉంటే, వాళ్ళు విడిపోయి, ముగ్గురు ఒకవైపుంటే ఇద్దరొకవైపు: యిద్దరొక వైపుంటే ముగ్గురొక వైపు చేరి పోట్లాడుతారు.
[53] తండ్రి కుమారునితో, కుమారుడు తండ్రితో, తల్లి కూతురుతో, కూతురు తల్లితో, అత్త కోడలితో, కోడలు అత్తతో పోట్లాడుతారు.”
[54] యేసు అక్కడున్న ప్రజలతో, “మీరు పడమరన మేఘాలు కమ్ముకోవటం చూసిన వెంటనే, ‘వర్షం కురుస్తుంది’ అని అంటారు.
[55] దక్షిణం నుండి గాలివీయగానే, ‘వేడి ఎక్కువౌతుంది’ అని అంటారు. మీరన్నట్లే జరుగుతుంది.
[56] కాని మీరు వంచకులు. భూమివైపు, ఆకాశం వైపు చూసి ఏమి జరుగబోతుందో చెప్పగలరు. కాని ప్రస్తుతం జరుగుతున్న దాన్ని చూసి ఏమి జరుగబోతుందో ఎందుకు చెప్పలేరు?
[57] “ఏది న్యాయమో స్వయంగా మీరే నిర్ణయించండి.
[58] మీ ప్రతి వాదితో కలిసి న్యాయాధిపతి దగ్గరకు వెళ్ళటానికి ముందు దారి మీద ఉన్నప్పుడే అతనితో రాజీ పడటానికి గట్టిగా ప్రయత్నించండి. అలా చెయ్యకపోతే అతడు మిమ్మల్ని న్యాయధిపతి ముందుకు లాగవచ్చు. ఆ న్యాయాధిపతి మిమ్మల్ని భటులకు అప్పగించవచ్చు. ఆ భటులు మిమ్మల్ని కారాగారంలో వేయవచ్చు.
[59] నేను చెప్పేది వినండి. మీ దగ్గర ఉన్న చివరి పైసా చెల్లించే దాకా మీరు బయటపడరు.”