[1] యేసు యొర్దాను నది ప్రాంతం నుండి తిరిగి వచ్చాడు. ఆయన పవిత్రాత్మపూర్ణుడై యుండి ఎడారి ప్రాంతానికి ఆత్మ చేత నడిపించబడ్డాడు.
[2] అక్కడ సైతాను ఆయన్ని నలభై దినాలు శోధించాడు. ఆ నలభై రోజులు యేసు ఉపవాసం చేశాడు. ఆ తర్వాత ఆయనకు ఆకలి వేసింది.
[3] సైతాను ఆయనతో, “నీవు దేవుని కుమారుడవైతే ఈ రాయిని రొట్టెగా మారుమని ఆజ్ఞాపించు!” అని అన్నాడు.
[4] యేసు, “‘మనిషి జీవించటానికి ఆహారం మాత్రమే చాలదు’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
[5] ఆ సైతాను ఆయన్ని ఎత్తైన స్థలానికి తీసుకు వెళ్ళాడు. ఒక్క క్షణంలో ప్రపంచంలోని రాజ్యాలన్ని ఆయనకు చూపించాడు.
[6] ఆయనతో, “వీటిపై అధికారము, వాటివల్ల లభించే గౌరవము నీకిస్తాను. అవి నావి. నా కిష్టం వచ్చిన వానికివ్వగలను.
[7] నా కాళ్ళ మీద పడితే వీటిని నీకిస్తాను.” అని అన్నాడు.
[8] యేసు, “‘నీ ప్రభువైన దేవుని ముందు మాత్రమే మోకరిల్లి, ఆయన సేవ మాత్రమే చెయ్యి’ అని వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
[9] సైతాను ఆయన్ని యెరూషలేములో ఉన్న ఆలయానికి తీసుకెళ్ళి ఎత్తైన స్థలంలో నిలుచోబెట్టి “నీవు దేవుని కుమారుడవైతే యిక్కడి నుండి క్రిందికి దూకు.
[10] ‘దేవుడు తన దూతలతో నిన్ను కాపాడుమని ఆజ్ఞాపిస్తాడు’
[11] అంతేకాక: ‘ఆ దూతులు నీ కాళ్ళు రాతికి తగలకుండా నిన్నుతమ చేతుల్తో ఎత్తి పట్టుకుంటారు’ అని వ్రాయబడింది” అని అన్నాడు.
[12] యేసు, “‘నీ ప్రభువైన దేవుణ్ణి పరీక్షించరాదు’ అని కూడా వ్రాయబడింది” అని సమాధానం చెప్పాడు.
[13] ఆ సైతాను యేసును పరీక్షించటం మానేసి అప్పటికి ఆయన్ని వదిలి పొయ్యాడు.
[14] యేసు పవిత్రాత్మ శక్తితో గలిలయకు తిరిగి వచ్చాడు. ఆయన్ని గురించి ఆ చుట్టూ ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు తెలిసింది.
[15] ఆయన ఆ ప్రాంతాల్లో ఉన్న సమాజ మందిరాల్లో బోధించాడు. ప్రతి ఒక్కరూ ఆయన్ని స్తుతించారు.
[16] ఆ తర్వాత తాను పెరిగిన నజరేతు గ్రామానికి వెళ్ళాడు. ఒక విశ్రాంతి రోజున అలవాటు ప్రకారం సమాజమందిరానికి వెళ్ళి, చదవటానికి నిలుచున్నాడు.
[17] అక్కడున్న వాళ్ళు, ప్రవక్త యెషయా గ్రంథాన్ని ఆయన చేతికి ఇచ్చారు. ఆయన ఆ గ్రంథములో ఈ వాక్యాలున్న పుటను తెరిచి చదవటం మొదలు పెట్టాడు:
[18] “ప్రభువు నన్నభిషేకించి పేదవాళ్ళకు నన్ను సువార్త ప్రకటించుమన్నాడు. అందుకే ప్రభువు ఆత్మ నాలో ఉన్నాడు. బంధితులకు స్వేచ్ఛ ప్రకటించుమని, గుడ్డివారికి చూపు కలిగించాలని, హింసింపబడే వారికి విడుదల కలిగించాలని, నన్ను పంపాడు.
[19] ప్రభువు ‘తాను దయ చూపే సంవత్సరం’ ప్రకటించుమని నన్ను పంపాడు.”
[20] ఆ తదుపరి యేసు గ్రంథం మూసేసి దాన్ని తెచ్చిన వానికి యిచ్చి కూర్చున్నాడు. సమాజ మందిరంలో ఉన్నవాళ్ళందరి కళ్ళు ఆయనపై ఉన్నాయి.
[21] ఆయన వాళ్ళతో, “ఈ రోజు గ్రంథములో వ్రాయబడిన ఈ వాక్యాలు మీరు వింటుండగానే నెరవేరాయి” అని అన్నాడు.
[22] అంతా ఆయన్ని మెచ్చుకున్నారు. అంతే కాక ఆయన నోటినుండి వచ్చిన ఆ చక్కటి మాటలు విని అందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు, “ఈయన యోసేపు కుమారుడు కదా!” అని అన్నారు.
[23] యేసు వాళ్ళతో ఈ విధంగా అన్నాడు: “‘వైద్యుడా! నిన్ను నీవు నయం చేసుకో!’ అన్న సామెత మీరు నాకు చెబుతారని తెలుసు. పైగా మీరు, ‘కపెర్నహూములో చేసిన మహాత్యాల్ని గురించి మేము విన్నాము. వాటిని యిక్కడ నీ స్వగ్రామంలో కూడా చెయ్యి!’ అని అంటారని నాకు తెలుసు.
[24] ఇది నిజం. ఏ ప్రవక్తనూ అతని స్వగ్రామపు ప్రజలు అంగీకరించలేదు.
[25] “ఏలీయా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలామంది వితంతువులుండినారని ఖచ్చితంగా చెప్పగలను. ఆ కాలంలో మూడున్నర సంవత్సరాలు వర్షాలు కురియలేదు. దేశమంతటా తీవ్రమైన కరువు వ్యాపించి ఉంది.
[26] సీదోను రాష్ట్రంలోని సారెపతు అనే గ్రామంలో ఒక వితంతువు ఉండేది. దేవుడు ఏలీయాను ఆమె దగ్గరకు తప్పమరెవ్వరి దగ్గరకు పంపలేదు.
[27] “ప్రవక్త ఎలీషా కాలంలో ఇశ్రాయేలు దేశంలో చాలా మంది కుష్టురోగులుండే వాళ్ళు. కాని సిరియ దేశానికి చెందిన నయమాను అనేవాణ్ణి తప్ప దేవుడు వీళ్ళలో ఒక్కరిని కూడా నయం చేయలేదు.”
[28] సమాజ మందిరములో వున్న వాళ్ళందరికి యిది విని ఆయనపై చాలా కోపం వచ్చింది.
[29] వాళ్ళు లేచి ఆయన్ని గ్రామం నుండి వెళ్ళగొట్టారు. ఆ గ్రామం కొండ మీద ఉంది. వాళ్ళు ఆయన్ని క్రిందికి త్రోయాలని కొండ చివరకు తీసుకు వెళ్ళారు.
[30] కాని ఆయన వాళ్ళ మధ్యనుండి నడిచి తన దారిన తాను వెళ్ళి పోయాడు.
[31] అక్కడి నుండి ఆయన గలిలయలోని కపెర్నహూము అనే పట్టణానికి వెళ్ళాడు. అక్కడ విశ్రాంతి రోజున బోధించటం మొదలు పెట్టాడు.
[32] ఆయన అధికారమున్న వానిలా బోధించటం వల్ల వాళ్ళు ఆశ్చర్యపోయారు.
[33] అదే సమయంలో దయ్యం పట్టిన వాడొకడు ఆ సమాజ మందిరంలోకి వచ్చాడు. ఆ దయ్యం బిగ్గరగా,
[34] “ఓ నజరేయుడైన యేసూ! మాతో నీకేంపని? మమ్మల్ని నాశనం చెయ్యటానికి వచ్చావా? నీవెవరో నాకు తెలుసు. నీవు దేవుని పరిశుద్ధుడవు” అని అన్నది.
[35] యేసు, “నోరు మూసుకొని అతని నుండి బయటకు రా!” అని గద్దించాడు. ఆ దయ్యం తాను పట్టిన వాణ్ణి క్రింద పడవేసి ఏ హానీ చెయ్యకుండా ఆ దయ్యం వెలుపలికి వచ్చింది.
[36] అక్కడున్న ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. వాళ్ళు పరస్పరం, “ఏమిటిది? దయ్యాలను కూడా ఆయన అధికారంతో ఆజ్ఞాపిస్తున్నాడే? అవి బయటికి రావటానికి ఈయన మాటల్లో ఎంత శక్తి ఉందో కదా?” అని మాట్లాడుకున్నారు.
[37] ఆ చుట్టు ఉన్న ప్రాంతాల్లో ఈయన్ని గురించి అందరికి తెలిసింది.
[38] యేసు సమాజమందిరాన్ని వదిలి సీమోను యింటికి వెళ్ళాడు. సీమోను అత్తకు జ్వరం తీవ్రంగా ఉంది. వాళ్ళు ఆమె జ్వరాన్ని గురించి యేసుకు చెప్పారు.
[39] యేసు, ఆమె దగ్గరకు వచ్చి జ్వరాన్ని వదిలి పొమ్మని గద్దించాడు. జ్వరం ఆమెను వదిలి వెళ్ళిపోయింది. వెంటనే ఆమె లేచి అందరిని ఆదరించటం మొదలు పెట్టింది.
[40] సూర్యాస్తమయమౌతుండగా ప్రజలు రక రకాల రోగాలున్న వాళ్ళను ఆయన దగ్గరకు తీసుకు వచ్చారు. ఆయన ప్రతి ఒక్కరి మీద తన చేతుల్ని ఉంచి అందరిని నయం చేశాడు.
[41] “నీవు దేవుని కుమారుడవు” అని బిగ్గరగా కేకలు వేస్తూ చాలా మంది నుండి దయ్యాలు బయటకు వచ్చాయి. వాటికి తాను క్రీస్తు అని తెలియటం వల్ల యేసు వాటిని మాట్లాడవద్దని గద్దించాడు.
[42] తెల్లవారుతుండగా యేసు గ్రామం వదిలి ఎడారిలో ఒంటరిగా ఒక ప్రత్యేక స్థలానికి వెళ్ళాడు. ప్రజలాయన కోసం వెతుకుతూ ఆయనున్న చోటికి వచ్చారు. ఆయన తమను మళ్ళీ వదిలి వెళ్ళకుండా చెయ్యాలని ప్రయత్నించారు.
[43] కాని యేసు, “దేవుని రాజ్యం యొక్క సువార్త నేను యితర పట్టణాల్లో కూడా ప్రకటించాలి. దేవుడు నన్ను అందుకే పంపాడు” అని అన్నాడు.
[44] ఆయన యూదయ ప్రాంతాల్లోని సమాజ మందిరాల్లో బోధించాడు.