[1] నేను మళ్ళీ తలెత్తి చూస్తే రెండు పర్వతాల మధ్యనుంచి బయలు దేరుతూ ఉన్న నాలుగు రథాలు కనిపించాయి. ఆ పర్వతాలు కంచు పర్వతాలు.
[2] మొదటి రథానికి ఎర్రని గుర్రాలు కట్టి ఉన్నాయి, రెండో రథానికి నల్లని గుర్రాలు,
[3] మూడో రథానికి తెల్లని గుర్రాలు, నాలుగో రథానికి పొడల గుర్రాలు పూన్చి ఉన్నాయి. ఆ గుర్రాలు బలమైనవి.
[4] నాతో మాట్లాడే దేవదూతను చూచి “స్వామీ, వీటి భావమేమిటి?” అని అడిగాను.
[5] అందుకు దేవదూత ఇలా జవాబిచ్చాడు: “ఇవి సర్వలోక నాథుడైన యెహోవా సన్నిధానంనుంచి బయలుదేరిన నాలుగు పరలోక ఆత్మలను సూచిస్తాయి.
[6] నల్లని గుర్రాలున్న రథం ఉత్తర దేశానికి పోతూ ఉంది, తెల్లని గుర్రాలున్న రథం వాటివెంట పోతూ వుంది, పొడల గుర్రాలు గల రథం దక్షిణ దేశానికి పోతూ వుంది.”
[7] ఆ బలమైన గుర్రాలు బయలుదేరి లోకమంతటా గస్తీ తిరగడానికి ఆత్రపడుతూ ఉంటే, ఆయన “లోకమంతటా గస్తీ తిరగండి” అన్నాడు గనుక అవి లోకమంతటా గస్తీ తిరిగాయి.
[8] అప్పుడాయన నన్ను పిలిచి “ఉత్తర దేశానికి పోయేవాటిని చూడు. అవి ఉత్తర దేశంలో నా ఆత్మను నెమ్మదిపరుస్తాయి” అన్నాడు.
[9] యెహోవానుంచి నాకు ఇలా వాక్కు వచ్చింది:
[10] “బందీలుగా వెళ్ళినవారిలో బబులోనునుంచి వచ్చిన హెల్‌దయి, టోబీయా, యెదాయాలను అడిగి వెండి బంగారాలు తీసుకో. ఆ రోజే జెఫన్యా కొడుకు యోషియా ఇంటికి వెళ్ళు. ఆ వెండి బంగారాలు తీసుకొని కిరీటం చెయ్యి.
[11] అప్పుడు ప్రముఖ యాజీ యెహోజాదాక్ కొడుకూ అయిన యెహోషువ తలమీద కిరీటం పెట్టి అతనితో ఇలా చెప్పు:
[12] ‘సేనలప్రభువు యెహోవా చెప్పేదేమంటే, “కొమ్మ” అనే పేరు గల వ్యక్తి ఉన్నాడు. ఆయన తన స్థలంలోనుంచి అంకురించి యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు.
[13] ఆయనే యెహోవా ఆలయాన్ని నిర్మిస్తాడు. ఆయన హోదా కలిగి సింహాసనంమీద కూర్చుని పరిపాలన చేస్తాడు. అంతేగాక, ఆయన తన సింహాసనం మీద యాజిగా ఉంటాడు. ఈ రెంటికి పొందిక ఉంటుంది.
[14] ఆ కిరీటం హేలెంకూ టోబీయాకూ యెదాయాకూ జెఫన్యా కొడుకు హేన్‌కూ జ్ఞాపకార్థంగా యెహోవా ఆలయంలో ఉంచాలి.
[15] యెహోవా ఆలయాన్ని కట్టడంలో సహాయం చేయడానికి దూరంగా ఉన్నవారు వస్తారు. అప్పుడు సేనలప్రభువు యెహోవా నన్ను మీ దగ్గరికి పంపాడని మీరు తెలుసుకొంటారు. మీరు జాగ్రత్తగా మీ దేవుడు యెహోవా మాట వింటే ఇలా జరుగుతుంది.”