Skip to content
Opens in a new window

[1] వానకాలంలో వాన దయచేయాలని యెహోవాను వేడుకోండి. పిడుగులను పుట్టించేవాడు యెహోవాయే. ప్రతివాడి పొలంలో మొక్కలు మొలిచేలా వాన కురిపించేవాడు ఆయనే.

[2] గృహదేవతలు మోసం మాటలు పలుకుతాయి. శకునాల సోదెగాండ్లకు కలిగిన దర్శనాలు భ్రమ. వాళ్ళు వ్యర్థమైన కలల భావాలు చెపుతారు. వారు పలికే ఓదార్పు మాట వట్టిదే. అందుచేత కాపరి లేకుండా బాధకు గురి అయిన మందలాగా ప్రజలు తిరుగులాడుతూ ఉన్నారు.

[3] “కాపరులమీద నా కోపాగ్ని రగులుకొంది. మందలో నాయకులను శిక్షిస్తాను” అని యెహోవా అంటున్నాడు. తన మందగా ఉన్న యూదా వంశంవారిని సందర్శిస్తాడు, వారిని తనకు రాజయోగ్యమైన యుద్ధాశ్వంలాగా చేస్తాడు.

[4] ఆ వంశంలోనుంచే మూలరాయి, డేరా మేకు, యుద్ధ ధనుస్సు కలుగుతాయి, అధికారులంతా దానిలో నుంచే బయలుదేరుతారు.

[5] వారు యుద్ధంలో వీధుల బురదలో శత్రువులను త్రొక్కివేసే బలాఢ్యులలాగా ఉంటారు. యెహోవా వారికి తోడుగా ఉంటాడు గనుక వారు యుద్ధం చేస్తూ రౌతులను సిగ్గుపాలు చేస్తారు.

[6] యెహోవా చెప్పేదేమంటే “నేను యూదా వంశాన్ని బలపరుస్తాను, యోసేపువంశాన్ని రక్షిస్తాను. ఆ ప్రజ అంటే నాకు కనికరం గనుక వారికి మునుపటి క్షేమ స్థితిని మళ్ళీ రప్పిస్తాను. నేను వారి దేవుడు యెహోవాను. వారి ప్రార్థనకు జవాబిస్తాను గనుక నేను వారిని ఎన్నడూ నిరాకరించక పోయినట్టే ఉంటుంది.

[7] ఎఫ్రాయింవారు వీరులలాంటి వారవుతారు. ద్రాక్షరసం త్రాగి సంతోషించే వారిలాగా వారు హృదయంలో ఆనందిస్తారు.

[8] నేను వారిని విముక్తులను చేసి వారిని ఈల వేసి పిలిచి సమకూరుస్తాను. ఇంతకుముందు వారి సంఖ్య పెరిగినట్టు పెరుగుతుంది.

[9] నేను వారిని ఇతర జనాల మధ్యలో చెదరగొట్టినా, వారు దూర దేశాలలో ఉండి నన్ను జ్ఞాపకం చేసుకొంటారు. వారూ వారి సంతానమూ బ్రతికి ఉండి తిరిగి వస్తారు.

[10] నేను వారిని ఈజిప్ట్‌నుంచి తిరిగి తీసుకువస్తాను, అష్షూరు నుంచి సమకూరుస్తాను. వారిని గిలాదు లెబానోనులకు తోడుకువస్తాను. ఆ స్థలాలు వారికి చాలేటంత విశాలంగా ఉండవు.

[11] వారు దుఃఖ సముద్రం దాటవలసి వచ్చినా సముద్రం అలలు అణగారిపోతాయి. నైలు నది లోతులు ఇంకిపోతాయి. అష్షూరువారి గర్వాన్ని అణగద్రొక్కడం, ఈజిప్ట్ రాజదండాన్ని తీసివేయడం జరుగుతుంది.

[12] నేను వారిని యెహోవామూలంగా బలపరుస్తాను. ఆయన పేర వారు ముందుకు సాగుతారు. ఇది యెహోవా వాక్కు.”

జెకర్యా — Chapters