[1] లెబానోను! నీ ద్వారాలు తెరువు. మంటలు నీ దేవదారు చెట్లను కాల్చివేస్తాయి.
[2] దేవదారుచెట్లు కూలాయి, ఘన వృక్షాలు పాడైపోయాయి గనుక సరళ వృక్షాల్లారా! విలపించండి. దట్టమైన అడవిని నరకడం జరిగింది గనుక బాషానులో ఉన్న సిందూర వృక్షాల్లారా! విలపించండి.
[3] గొర్రెల కాపరుల రోదనం వినబడుతూ వుంది వారి శ్రేష్ఠమైన పచ్చిక మైదానాలు నాశనం అయ్యాయి. సింహాల గర్జనం వినబడుతూ ఉంది యొర్దాను లోయలోని దట్టమైన పొదల ప్రాంతం పాడైపోయింది.
[4] నా దేవుడు యెహోవా చెప్పేదేమంటే “వధకు గురి కాబోయే మందకు కాపరిగా ఉండు.
[5] వారిని కొనేవారు వారిని చంపినా శిక్ష పొందకుండా ఉన్నారు. వారిని అమ్మివేసేవారు ‘మేము ధనికులమయ్యాం. యెహోవాకు స్తుతి కలుగుతుంది గాక’ అంటారు. వారి కాపరులు వారిమీద జాలిపడరు.
[6] ఇది యెహోవా వాక్కు. ఇకనుంచి నేను ఈ దేశ నివాసులమీద జాలిపడను. ఒకరి వశం ఒకరిని చేస్తాను, రాజు వశం అందరినీ చేస్తాను. వారు దేశాన్ని పాడు చేస్తారు. నేను వారి వశంనుంచి విడిపించను.”
[7] అందుచేత వధకు గురి కాబోయే మందకు విశేషంగా బాధలు అనుభవిస్తున్న గొర్రెలకు నేను కాపరినయ్యాను. రెండు కర్రలు చేతపట్టుకొని ఆ పని చేశాను. ఒక కర్రనేమో “దయ” రెండోదానిని “ఐక్యం” అన్నాను.
[8] ఒకే నెలలో నేను ముగ్గురు కాపరులను పనిలోనుంచి తీసివేశాను. నేనంటే మందకు అసహ్యం పుట్టింది. మందను నేను సహించలేకపోయాను.
[9] గనుక “నేను మీకు కాపరిగా ఉండను. చావబోయేవారు చావవచ్చు. నశించబోయేవారు నశించవచ్చు. మిగతావారు ఒకరి శరీరాన్ని ఒకరు తింటే తినవచ్చు” అన్నాను.
[10] అప్పుడు నేను జనులందరితో చేసిన ఒడంబడికను రద్దు చేయడానికి “దయ” అనే కర్రను చేతపట్టుకొని విరిచాను.
[11] ఆ రోజున ఆ ఒడంబడిక రద్దయింది. గనుక నేను చెప్పినది యెహోవా వాక్కని మందలో బాధలు అనుభవిస్తూ, నావైపు చూస్తూ ఉన్నవారికి తెలిసింది.
[12] వారితో నేనిలా అన్నాను: “మీకు మంచిది అనిపిస్తే నా జీతం నాకివ్వండి. లేకపోతే దాన్ని ఉంచుకోండి.” అందుచేత వారు నా జీతం నాకిచ్చారు. అది ముప్ఫయి వెండి నాణేలు.
[13] అప్పుడు యెహోవా నాతో “వాటిని కుమ్మరికి పారవేయి. వారు నా విలువను ఎంత గొప్పగా అంచనా వేశారు!” అన్నాడు. కనుక నేను ఆ ముప్ఫయి వెండి నాణేలు చేతపట్టుకొని యెహోవా ఆలయంలో కుమ్మరికి పడవేశాను.
[14] ఆ తరువాత, యూదావారికీ ఇస్రాయేల్‌వారికీ కలిగిన సహోదర బంధాన్ని తెగతెంపులు చేయడానికి “ఐక్యం” అనే నా రెండో కర్రను చేత పట్టుకొని విరిచాను.
[15] అప్పుడు యెహోవా నాతో చెప్పేదేమంటే “మరోసారి కాపరి సామాను తీసుకొని బుద్ధిలేని కాపరిలాగా ప్రవర్తించు.
[16] ఎందుకంటే, ఈ దేశంలో అలాంటి కాపరి పైస్థానానికి వచ్చేలా చేస్తాను. వాడు నశిస్తూ ఉన్న గొర్రెలను లక్ష్యపెట్టడు, చెదరిపోయిన వాటిని వెదకడు, గాయపడ్డ వాటిని బాగుచేయడు. ఆరోగ్యమైన వాటిని పోషించడు. కానీ క్రొవ్విన వాటి డెక్కలను చీల్చివేసి వాటి మాంసం దిగమింగివేస్తాడు.
[17] మందను వదలివేసే ఆ పనికిమాలిన కాపరికి బాధ తప్పదు! వాడి చెయ్యి, కుడి కన్ను కత్తి దెబ్బకు గురి అవుతాయి. వాడి చెయ్యి పూర్తిగా ఎండిపోతుంది, వాడి కుడి కన్ను గుడ్డిది అవుతుంది.”