Skip to content
Opens in a new window

[1] ఆ తరువాత నేను తలెత్తి చూస్తే నా ఎదుట కొలనూలు చేతపట్టుకొని ఉన్న వ్యక్తి నాకు కనబడ్డాడు.

[2] “మీరు ఎక్కడికి వెళ్తున్నారు?” అని అడిగాను. ఆయన “జెరుసలం పరిమాణం తెలుసుకోవడానికి దాని వెడల్పూ పొడుగూ ఎంతో చూడడానికి వెళ్తున్నాను” అన్నాడు.

[3] అప్పుడు నాతో మాట్లాడే దేవదూత బయలుదేరుతూ ఉంటే మరో దేవదూత ఆయనను కలుసుకోవడానికి వచ్చి ఇలా అన్నాడు:

[4] “నీవు ఆ యువకుడి దగ్గరికి పరుగెత్తి ఇలా చెప్పు: జెరుసలంలో మనుషులూ పశువులూ అత్యధికం కావడంచేత అది గోడలు లేని నగరం అవుతుంది.

[5] యెహోవా చెప్పేదేమంటే, నేనే దాని చుట్టూరా మంటల గోడలాగా ఉంటాను. దానిలో నేనే శోభా ప్రకాశంగా ఉంటాను.

[6] యెహోవా చెప్పేదేమంటే, రండి, రండి! ఉత్తర దేశంనుంచి తప్పించుకురండి! ఆకాశంలో వీచే నాలుగు గాలుల దిక్కులకు నేను మిమ్ములను చెదరగొట్టాను. ఇది యెహోవా వాక్కు.

[7] సీయోను ప్రజలారా! రండి! బబులోను దేశంలో ఉంటున్న మీరు తప్పించుకు రండి!

[8] సేనల ప్రభువు యెహోవా నన్ను ఘనపరచి మిమ్ములను దోచుకున్న ఇతర జనాల దగ్గరికి నన్ను పంపాడు. ఎవరైనా మిమ్ములను ముట్టితే యెహోవా కనుగుడ్డును ముట్టినట్టే.

[9] ఆయన చెప్పేదేమంటే, నేను ఆ జనాలకు వ్యతిరేకంగా నా చెయ్యి ఎత్తుతాను. వారి దాసులు వారిని దోచుకొంటారు. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను పంపాడని మీరు తెలుసుకొంటారు.”

[10] యెహోవా ఇలా అంటున్నాడు: “సీయోనుకుమారీ! నేను వచ్చి మీమధ్య నివాసం చేస్తాను గనుక సంతోషంగా ఉండండి, ఆనంద గీతాలు పాడండి.

[11] ఆ రోజున అనేక ఇతర జనాలు యెహోవా దగ్గరికి చేరి నా ప్రజ అవుతారు. నేను మీమధ్య నివాసం చేస్తాను. అప్పుడు సేనల ప్రభువు యెహోవా నన్ను మీదగ్గరికి పంపాడని మీరు తెలుసుకొంటారు.

[12] పవిత్ర దేశంలో యెహోవా యూదాప్రదేశాన్ని స్వాధీనం చేసుకొంటాడు. అది ఆయనకు ప్రత్యేక భాగంగా ఉంటుంది. ఆయన జెరుసలంను మళ్ళీ ఎన్నుకొంటాడు.

[13] సర్వ మానవ కోటీ! యెహోవా తన పవిత్ర నివాసం విడిచి బయలుదేరాడు గనుక ఆయన ఎదుట మౌనంగా ఉండండి.”

జెకర్యా — Chapters