[1] వినండి! మీ దోపిడీసొమ్మును మీ మధ్య పంచిపెట్టే యెహోవా దినం రాబోతుంది.
[2] “జనాలన్నిటినీ జెరుసలంమీద యుద్ధం చేయడానికి వాటిని సమకూర్చి రప్పిస్తాను.” వారు నగరాన్ని పట్టుకొంటారు. ఇండ్లను దోచుకొంటారు. స్త్రీలను చెరుపుతారు. నగరవాసులలో సగంమంది బందీలుగా దేశాంతరం పోతారు. అయితే తక్కినవారు నాశనం కాకుండా నగరంలో ఉండిపోతారు.
[3] అప్పుడు యెహోవా బయలుదేరి యుద్ధకాలంలో పోరాడే విధంగా ఆ జనాలతో యుద్ధం చేస్తాడు.
[4] ఆ రోజున ఆయన జెరుసలంకు తూర్పుగా ఉన్న ఆలీవ్ కొండమీద పాదాలు ఉంచుతాడు. ఆలీవ్‌కొండ తూర్పు దిక్కుకూ పడమటి దిక్కుకూ నడిమికి చీలిపోతుంది. సగం కొండ ఉత్తర దిక్కుకు, సగం కొండ దక్షిణ దిక్కుకు జరిగిపోతుంది, మధ్యలో మహా గొప్ప లోయ ఏర్పడుతుంది.
[5] కొండల మధ్య నేను చేసే ఆ లోయ ఆజీల్ వరకు ఉంటుంది. మీరు ఆ లోయగుండా పారిపోతారు. యూదా రాజైన ఉజ్జియా కాలంలో భూకంపం వచ్చినప్పుడు ప్రజలు పారిపోయినట్టు మీరు పారిపోతారు. అప్పుడు నా దేవుడు యెహోవా వస్తాడు. నీతోపాటు పవిత్రులందరూ వస్తారు.
[6] ఆ రోజున వెలుగు ఉండదు జ్యోతుల ప్రకాశం తగ్గిపోతుంది.
[7] అది వింతైన రోజుగా ఉంటుంది పగలు కాదు, రాత్రీ కాదు. ఆ రోజు యెహోవాకు తెలుసు. సాయంకాలం సమయాన వెలుగు ఉంటుంది.
[8] ఆ రోజున క్రొత్త నీటి ధారలు జెరుసలంలో నుంచి వెలువడతాయి. సగం తూర్పు సముద్రానికి, సగం పడమటి సముద్రానికి పారుతుంది. ఎండకాలంలోను చలికాలంలోను అలాగే పారుతూ ఉంటుంది.
[9] యెహోవా సర్వలోకానికి రాజై ఉంటాడు. ఆ కాలంలో యెహోవా ఒక్కడే ప్రభువై ఉంటాడు. ఆయన పేరు ఒక్కటే ఉంటుంది.
[10] అప్పుడు గెబనుంచి జెరుసలంకు దక్షిణంగా ఉన్న రిమ్మోనువరకు ఆ ప్రదేశమంతా మైదానం అవుతుంది. జెరుసలం ఎత్తుగా ఉంటుంది. “బెన్యామీను ద్వారం” నుంచి “మూలద్వారం” (మొదటిద్వారం ఉన్నస్థలం) వరకూ, హననయేల్ గోపురంనుంచి రాజు ద్రాక్ష గానుగవరకూ జెరుసలం దాని స్థలంలోనే నిలుస్తుంది.
[11] మనుషులు దానిలో నివాసం ఉంటారు. అప్పటినుంచి అది ఎన్నడూ నాశనానికి గురి కాదు. జెరుసలం సురక్షితంగా ఉంటుంది.
[12] జెరుసలంమీద యుద్ధం చేసిన జనాలన్నీ యెహోవాచేత ఇలా దెబ్బ తింటాయి: వారు నిలబడి ఉండగానే వారి శరీరాలు కుళ్ళిపోతాయి. వారి కండ్లు కనుతొర్రలలో ఉండికూడా కుళ్ళిపోతాయి. వారి నాలుకలు నోళ్ళలో ఉండి కూడా కుళ్ళిపోతాయి.
[13] ఆ రోజున యెహోవా వల్ల వారికి గొప్ప భయాందోళన ముంచుకు వస్తుంది. వారంతా ఒకరినొకరు పట్టుకొంటారు. ఒకరినొకరు దెబ్బ తీస్తారు.
[14] యూదావారు కూడా జెరుసలందగ్గర యుద్ధం చేస్తారు. చుట్టూరా ఉన్న ఇతర జనాల ధనమంతా చాలా బంగారం, వెండి, వస్త్రాలు అక్కడ పోగు చేయడం జరుగుతుంది.
[15] ఆ దెబ్బలాంటిది వారి శిబిరాలలో ఉన్న గుర్రాలకూ కంచరగాడిదలకూ ఒంటెలకూ గాడిదలకూ పశువులన్నిటికీ తగులుతుంది.
[16] జెరుసలం పైబడ్డ ఆ జనాలలో మిగిలేవారంతా ఏటేటా జెరుసలంకు వస్తారు. రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి పర్ణశాల పండుగ ఆచరించడానికి వస్తారు.
[17] ఒకవేళ లోక జనాలలో ఏ జనమైనా రాజూ సేనలప్రభువూ అయిన యెహోవాను ఆరాధించడానికి జెరుసలంకు రాకపోతే వారికి వాన కురియదు.
[18] ఈజిప్ట్ ప్రజ రాకపోతే, ఆరాధనలో పాల్గొనకపోతే వారికి వర్షం ఉండదు. పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలకు యెహోవా నియమించిన ఆ దెబ్బ వారికి తగులుతుంది.
[19] ఈజిప్ట్‌వారూ పర్ణశాల పండుగ ఆచరించడానికి రాని ఇతర జనాలన్నీ పొందవలసిన శిక్ష అదే.
[20] ఆ కాలంలో గుర్రాలకు కట్టిన గంటలమీద “యెహోవాకు పవిత్రమైనది” అని వ్రాసి ఉంటుంది. యెహోవా ఆలయంలో ఉన్న వంట పాత్రలు బలి పీఠం ఎదుట ఉన్న గిన్నెల్లాగే పవిత్రంగా ఎంచబడతాయి.
[21] జెరుసలంలోను యూదాలోను ఉన్న పాత్రలన్నీ సేనలప్రభువు యెహోవాకు పవిత్రం అవుతాయి. బలి అర్పించడానికి వచ్చేవారంతా ఆ పాత్రల్లో కావలసినవాటిని తీసుకొని వంట చేసుకొంటారు. ఆ కాలంలో కనాను జాతివాడెవడూ సేనలప్రభువు యెహోవా ఆలయంలో ఉండడు.