Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:59

[1] అయిదో దేవదూత బూర ఊదాడు. అప్పుడు ఆకాశం నుంచి భూమిమీదికి రాలిన నక్షత్రాన్ని చూశాను. అతడికి అగాధం తాళంచెవి ఇవ్వబడింది.

[2] అతడు అగాధం తెరిచాడు. అప్పుడు బ్రహ్మాండమైన కొలిమినుంచి లేచే పొగలాంటి పొగ అగాధంనుంచి లేచింది. అగాధం పొగతో సూర్యగోళం, వాయుమండలం చీకటిమయం అయ్యాయి.

[3] ఆ పొగలోనుంచి మిడతలు భూమిమీదికి వచ్చిపడ్డాయి. వాటికి భూమిలోని తేళ్ళకున్న శక్తిలాంటి శక్తి ఇవ్వడం జరిగింది.

[4] భూమి గడ్డికి గానీ ఎలాంటి మొక్కకూ చెట్టుకూ గానీ హాని చేయకూడదనీ నొసళ్ళమీద దేవుని ముద్ర లేని మనుషులకే హాని చేయాలనీ వాటికి ఆజ్ఞ వచ్చింది.

[5] ఆ మనుషులను అయిదు నెలలపాటు వేధించడానికి వాటికి అధికారం ఇచ్చి ఉంది గాని చంపడానికి మాత్రం కాదు. వాటివల్ల కలిగే వేదన తేలు మనిషిని కుట్టినట్టుంది.

[6] ఆ రోజులలో మనుషులు చావుకోసం దేవులాడుతూ ఉంటారు గాని అది దొరకదు. చావాలని తహతహలాడుతూ ఉంటారు గాని చావు వారి దగ్గరనుంచి పారిపోతుంది.

[7] ఆ మిడతల ఆకారాలు యుద్ధానికి సిద్ధమైన గుర్రాల్లాంటివి. వాటి తలలమీద బంగారు కిరీటాల లాంటివి ఉన్నాయి. వాటి ముఖాలు మనుషుల ముఖాలలాంటివి.

[8] వాటికి స్త్రీల తల వెంట్రుకలలాంటి వెంట్రుకలున్నాయి. వాటి పళ్ళు సింహాల కోరలలాంటివి.

[9] వాటికి ఇనుప ఛాతీ కవచంలాంటి కవచాలున్నాయి. వాటి రెక్కల చప్పుడు యుద్ధానికి పరుగెత్తుతూ ఉన్న అనేక గుర్రాలున్న రథాల చప్పుడులాంటిది.

[10] వాటికి తేళ్ళలాంటి తోకలు ఉన్నాయి. వాటి తోకలకు కొండ్లు ఉన్నాయి. అయిదు నెలలవరకు మనుషులకు హాని చేయడానికి వాటికి అధికారం ఉంది.

[11] వాటి మీద ఒక రాజు ఉన్నాడు. వాడు అగాధం దూత. హీబ్రూ భాషలో వాడి పేరు “అబద్దోన్” గాని గ్రీక్ భాషలో వాడి పేరు “అపొల్లుయోన్”.

[12] మొదటి విపత్తు గతించింది. ఇదిగో, ఈ సంగతుల తరువాత ఇంకా రెండు విపత్తులు రాబోతున్నాయి.

[13] ఆరో దేవదూత బూర ఊదాడు. అప్పుడు దేవుని ముందర ఉన్న బంగారు వేదిక నాలుగు కొమ్ములనుంచి ఒక స్వరం నాకు వినవచ్చింది.

[14] ఆ స్వరం, బూర ఉన్న ఆ ఆరో దేవదూతతో “యూఫ్రటీసు అనే మహానది దగ్గర బంధించి ఉన్న నలుగురు దేవదూతలను విడిపించు” అంది.

[15] ఆ సంవత్సరానికీ నెలకూ రోజుకూ గంటకూ సిద్ధంగా ఉంచబడ్డ ఆ నలుగురు దేవదూతలను మనుషులలో మూడో భాగాన్ని చంపడానికి విడిపించడం జరిగింది.

[16] సైన్యంలో ఉన్న రౌతుల లెక్క ఇరవై కోట్లు. వారి లెక్క విన్నాను.

[17] ఆ దర్శనంలో ఆ గుర్రాలూ వాటి మీద కూర్చుని ఉన్నవారూ నాకు ఇలా కనిపించారు: వారికి నిప్పు రంగు, నీలం, గంధకం రంగు గల కవచాలున్నాయి. ఆ గుర్రాల తలలు సింహాల తలల్లాంటివి. వాటి నోళ్ళనుంచి మంటలు, పొగ, గంధకాలు బయలుదేరుతూ ఉన్నాయి.

[18] ఈ మూడు దెబ్బలచేత, అంటే వాటి నోళ్ళనుంచి బయలుదేరుతున్న మంటలు, పొగ, గంధకాలచేత మనుషులలో మూడో భాగం చంపబడ్డారు.

[19] వాటి శక్తి వాటి నోళ్ళలో, వాటి తోకలలో ఉంది. ఎందుకంటే వాటి తోకలు తలలు గలవై పాముల్లాంటివి. ఆ తోకలతో అవి హాని చేస్తాయి.

[20] ఈ దెబ్బలతో చావకుండా మనుషులలో మిగిలినవారు తమ చేతులతో చేసిన పనులను గురించి పశ్చాత్తాపపడలేదు. అంటే, దయ్యాలనూ, చూడలేని వినలేని నడవలేని బంగారు వెండి కంచు రాయి కొయ్యలతో చేసిన విగ్రహాలనూ పూజించడం మానలేదు.

[21] తమ హత్యలూ తమ మంత్రప్రయోగాలూ తమ వ్యభిచారాలూ తమ దొంగతనాల గురించి కూడా వారు పశ్చాత్తాపపడలేదు.

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters