[1] సార్దీస్‌లో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: దేవుని ఏడు ఆత్మలూ ఏడు నక్షత్రాలూ “ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే, నీ క్రియలు నాకు తెలుసు. బ్రతుకుతున్నావనే పేరు నీకుంది గాని నీవు చచ్చినవాడివే.
[2] మేలుకో! నీ క్రియలు దేవుని దృష్టిలో సంపూర్ణమై ఉన్నట్టు నాకు కనబడలేదు గనుక మిగిలినవాటిని దృఢపరచుకో! అవి చావనై ఉన్నాయి.
[3] అందుచేత నీవు అంగీకరించినదీ విన్నదీ జ్ఞాపకం చేసుకో! దానిని గట్టిగా చేపట్టుకొని పశ్చాత్తాపపడు! ఒకవేళ నీవు మేల్కోకపోతే దొంగ వచ్చినట్టు నేను నీమీదికి వస్తాను. నీ మీదికి నేను వచ్చే ఘడియ నీకు తెలిసిపోదు.
[4] “తమ వస్త్రాలు అపవిత్రం చేసుకోనివారు కొందరు సార్దీస్‌లో కూడా ఉన్నారు. వారు అర్హులు గనుక తెల్లని వస్త్రాలు తొడుక్కొని నాతో కూడా నడుస్తారు.
[5] “జయించే వ్యక్తికి తెల్లని వస్త్రాలు తొడగడం జరుగుతుంది. అంతేకాదు, జీవ గ్రంథంలో నుంచి ఆ వ్యక్తి పేరు నేనెంత మాత్రమూ తుడుపు పెట్టను గాని నా తండ్రి సమక్షంలో, ఆయన దూతల సమక్షంలో ఆ వ్యక్తి పేరు ఒప్పుకొంటాను.
[6] “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!
[7] “ఫిలదెల్ఫియలో ఉన్న సంఘం దూతకు ఇలా వ్రాయి: ఈ విషయాలు చెప్పే వ్యక్తి ఎవరంటే, పవిత్రుడూ సత్యస్వరూపీ దావీదు తాళంచెవి గలవాడూ అయిన వ్యక్తి. ఆయన తెరిచాడూ అంటే ఎవ్వరూ మూయలేరు, మూశాడూ అంటే ఎవ్వరూ తెరవలేరు.
[8] నీ క్రియలు నాకు తెలుసు. ఇదిగో విను. నీకు కొద్ది బలం ఉంది, నీవు నా వాక్కు ఆచరణలో పెట్టావు. నా పేరు ఎరగననలేదు గనుక నీ ముందర తలుపు తెరచి ఉంచాను. దానిని ఎవ్వరూ మూయలేరు.
[9] “ఇదిగో విను, తాము యూదులు కాకపోయినా యూదులమే అని అబద్ధమాడుతున్నవారిని – అంటే సైతాను సమాజంవారిని – బలవంతాన తెచ్చి, అవును వారిని బలవంతాన తెచ్చి నీ పాదాల దగ్గర సాష్టాంగపడి గౌరవించేలా చేస్తాను, నీవంటే నాకు ప్రేమ అని వారికి తెలిసిపోయేలా చేస్తాను.
[10] నా ఓర్పును గురించిన వాక్కు ఆచరణలో పెట్టావు గనుక పరీక్ష ఘడియనుంచి – భూమిమీద నివసించేవారిని పరీక్షించడానికి లోకమంతటి మీదికీ రానై ఉన్న ఆ ఘడియనుంచి – నిన్ను కాపాడుతాను.
[11] “ఇదిగో విను, నేను త్వరగా వస్తున్నాను. నీ కిరీటం ఎవ్వరూ తీసుకోకుండా నీకున్నదానిని గట్టిగా చేపట్టుకొని ఉండు.
[12] “జయించే వ్యక్తిని నా దేవుని ఆలయంలో స్తంభంగా చేస్తాను. అతడు దానినుంచి బయటికి ఇంకెన్నడూ వెళ్ళడు. ఆ వ్యక్తిమీద నా దేవుని పేరు రాస్తాను, పరలోకంనుంచీ నా దేవుని దగ్గరనుంచీ దిగివచ్చే కొత్త జెరుసలమనే నా దేవుని నగరం పేరు రాస్తాను. నా కొత్త పేరు కూడా ఆ వ్యక్తి మీద రాస్తాను.
[13] “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!
[14] “లవొదికయ వారి సంఘం దూతకు ఇలా వ్రాయి: ఆమేన్, నమ్మకమైన సత్యసాక్షి, దేవుని సృష్టికి మూలమై ఉన్న వ్యక్తి చెప్పే విషయాలేవంటే,
[15] నీ క్రియలు నాకు తెలుసు. నీవు చల్లగా లేవు, వేడిగా లేవు. నీవు చల్లగా గానీ వేడిగా గానీ ఉండాలని నా కోరిక.
[16] నీవు చల్లగా గానీ వేడిగా గానీ ఉండకుండా నులివెచ్చగా ఉన్నావు గనుక నా నోటినుంచి నిన్ను ఉమ్మివేస్తాను.
[17] నీవంటావు – ‘నేను ధనవంతుణ్ణి, నాకు చాలా ఆస్తిపాస్తులు కలిగాయి, నాకు కొదువ అంటూ ఏమీ లేదు.’ నీవే దిక్కుమాలినవాడివి, దురవస్థలో మునిగినవాడివి, దరిద్రుడివి, గుడ్డివాడివి, దిగంబరంగా ఉన్నావు గానీ ఇదంతా నీకు తెలియదు.
[18] అందుచేత నేను నీకు చెప్పే సలహా ఏమంటే, నీవు ధనవంతుడివయ్యేలా నిప్పులో పుటం వేసిన బంగారం నా దగ్గర కొనుక్కో. నీ దిసమొల సిగ్గు కనిపించకుండా తొడుక్కోవడానికి తెల్లని దుస్తులూ, చూడగలిగేలా నీ కళ్ళకు మందూ నా దగ్గర కొనుక్కో.
[19] నేను ప్రేమించేవారందరినీ మందలించి శిక్షిస్తాను. గనుక ఆసక్తి కలిగి పశ్చాత్తాపపడు.
[20] “ఇదిగో, నేను తలుపు దగ్గర నిలుచుండి తట్టుతూ ఉన్నాను. ఎవరైనా సరే నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను. ఆ వ్యక్తితో నేను, నాతో ఆ వ్యక్తి భోజనం చేస్తాం.
[21] “నేను జయించి నా తండ్రితోకూడా ఆయన సింహాసనంమీద కూర్చుని ఉన్నట్టే, జయించే వ్యక్తిని నాతోకూడా నా సింహాసనంమీద కూర్చోనిస్తాను.
[22] “సంఘాలకు ఆత్మ చెప్పేది చెవిగలవాడు వింటాడు గాక!”