Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:47

[1] ఆయన ఏడో ముద్ర విప్పినప్పుడు పరలోకంలో సుమారు అరగంట సేపు నిశ్శబ్దం ఆవరించింది.

[2] దేవుని ముందర నిలుచుండే ఏడుగురు దేవదూతలను చూశాను. వారికి ఏడు బూరలు ఇవ్వడం జరిగింది.

[3] అప్పుడు మరో దేవదూత వచ్చి ధూపవేదిక ఎదుట నిలిచాడు. అతడు బంగారు ధూపార్తి చేతపట్టుకొని ఉన్నాడు. అతనికి చాలా ధూపం ఇవ్వబడింది. అతడు దానిని పవిత్రులందరి ప్రార్థనలతో కలిపి సింహాసనం ఎదుట ఉన్న బంగారు ధూపవేదిక మీద అర్పించాలని ఉద్దేశం.

[4] ధూపం పొగ పవిత్రుల ప్రార్థనలతో కలిసి ఆ దేవదూత చేతిలోనుంచి పైకి పోయి దేవుని సన్నిధానం చేరింది.

[5] అప్పుడా దేవదూత ధూపార్తిని తీసుకొని దానిని ధూపవేదిక మీద ఉన్న నిప్పుతో నింపి భూమి మీద పడవేశాడు. వెంటనే ధ్వనులూ ఉరుములూ మెరుపులూ ఒక భూకంపమూ కలిగాయి.

[6] అప్పుడు ఏడు బూరలు ఉన్న ఆ ఏడుగురు దేవదూతలు ఊదడానికి తమను సిద్ధం చేశారు.

[7] మొదటి దేవదూత బూర ఊదాడు. అప్పుడు రక్తంతో కలిసిన నిప్పు, వడగండ్లు కలిగాయి. వాటిని భూమిమీదికి విసిరివేయడం జరిగింది. అప్పుడు చెట్లలో మూడో భాగం కాలిపోయింది, పచ్చగడ్డి అంతా కాలిపోయింది.

[8] రెండో దేవదూత బూర ఊదాడు. అప్పుడు అగ్నితో మండుతూ ఉన్న పెద్ద పర్వతంలాంటిది ఒకటి సముద్రంలో పడవేయడం జరిగింది, సముద్రంలో మూడో భాగం రక్తమయింది.

[9] సముద్రంలోని ప్రాణులలో మూడో భాగం చచ్చింది, ఓడల్లో మూడో భాగం నాశనమయింది.

[10] మూడో దేవదూత బూర ఊదాడు. అప్పుడు దివిటీలాగా మండుతూ ఉన్న పెద్ద నక్షత్రం ఒకటి ఆకాశం నుంచి రాలి నదులలో మూడో భాగంమీదా నీటి బుగ్గలమీదా పడింది.

[11] ఆ నక్షత్రం పేరు “చేదు”. దానివల్ల నీళ్ళలో మూడో భాగం చేదయింది. నీళ్ళు చేదు కావడం మూలాన, వాటివల్ల మనుషులు అనేకులు చనిపోయారు.

[12] నాలుగో దేవదూత బూర ఊదాడు. అప్పుడు సూర్యగోళంలో మూడో భాగం, చంద్రబింబంలో మూడో భాగం, నక్షత్రాలలో మూడో భాగం చీకటి అయి, పగటిలో మూడో భాగమూ రాత్రిలో మూడో భాగమూ ప్రకాశించకుండా వాటిలో మూడో భాగం దెబ్బ తిన్నది.

[13] నేను చూస్తూ ఉంటే, ఆకాశం మధ్య ఒక దేవదూత ఎగిరిపోతూ పెద్ద స్వరంతో ఇలా చెప్పడం విన్నాను: “ఇంకా బూరలు ఊదబోతున్న ముగ్గురు దేవదూతల బూరల ధ్వనులను బట్టి భూనివాసులకు అయ్యో, విపత్తు! విపత్తు! విపత్తు!”

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters