Skip to content
Opens in a new window
Listen to this chapter • 3:35

[1] అప్పుడు ఒక దేవదూత పరలోకంనుంచి దిగిరావడం నాకు కనిపించింది. అతని చేతిలో అగాధానికి తాళంచెవి, పెద్ద గొలుసు ఉన్నాయి.

[2] అతడు రెక్కలున్న సర్పాన్ని – అపనింద పిశాచమూ సైతానూ అయి ఉన్న ఆ ఆది సర్పాన్ని పట్టుకొని వెయ్యేళ్ళకు బంధించి

[3] వాణ్ణి అగాధంలో పడవేశాడు. ఆ వెయ్యేళ్ళు గడిచేంతవరకూ వాడు ఇక జనాలను మోసగించకుండా ఆ దేవదూత అగాధం మూసివేసి వాడిపైగా ముద్ర వేశాడు. ఆ తరువాత వాణ్ణి కొద్ది కాలానికి విడుదల చేయడం జరిగితీరాలి.

[4] అప్పుడు సింహాసనాలనూ వాటిమీద కూర్చుని ఉన్నవారినీ చూశాను. తీర్పు తీర్చడానికి అధికారం వారికివ్వబడింది. యేసును గురించిన సాక్ష్యం చెప్పినందుకూ దేవుని వాక్కును బట్టీ శిరచ్ఛేదం పాలైనవారి ఆత్మలను కూడా చూశాను. వారు ఆ మృగాన్నయినా వాడి విగ్రహాన్నయినా పూజ చేయకుండా వాడి ముద్ర తమ నొసట గానీ చేతిమీద గానీ పడనివ్వకుండా ఉన్నవారు. వారు బ్రతికి క్రీస్తుతో కూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపరిపాలన చేసారు.

[5] చనిపోయిన వారిలో తక్కినవారు ఆ వెయ్యి సంవత్సరాలు గడిచేంతవరకూ మళ్ళీ బ్రతకలేదు. ఇది మొదటి పునర్జీవితం.

[6] ఈ మొదటి పునర్జీవితంలో పాల్గొన్నవారు ధన్యులూ పవిత్రులూ. అలాంటివారిమీద రెండో చావుకు అధికారం ఉండదు. వారు దేవునికీ క్రీస్తుకూ యాజులై ఆయనతోకూడా వెయ్యి సంవత్సరాలు రాజ్యపరిపాలన చేస్తారు.

[7] ఆ వెయ్యి సంవత్సరాలు గడిచిన తరువాత సైతానుకు తన ఖైదులోనుంచి విడుదల కలుగుతుంది.

[8] భూమి నలుదిక్కులా ఉన్న జనాలను – గోగు, మాగోగులను – మోసపుచ్చి యుద్ధానికి పోగు చేయడానికి వాడు బయలుదేరిపోతాడు. లెక్కకు వారు సముద్రం ఇసుక రేణువులలాంటివారు.

[9] వారు భూమి విశాలంమీద సాగిపోయి పవిత్రుల శిబిరమైన ఆ ప్రియ నగరం చుట్టుముట్టారు. అప్పుడు దేవుని దగ్గర నుంచి పరలోకంలోనుంచి మంటలు దిగివచ్చి వారిని మ్రింగివేస్తాయి.

[10] వారిని మోసపుచ్చిన అపనింద పిశాచాన్ని మృగమూ కపట ప్రవక్తా ఉన్న అగ్నిగంధకాల సరస్సులో పడవేయడం జరిగింది. వారు యుగయుగాలకు రాత్రింబగళ్లు వేదనపాలై ఉంటారు.

[11] అప్పుడు తెల్లని మహా సింహాసనాన్నీ దానిమీద కూర్చుని ఉన్న వ్యక్తినీ చూశాను. ఆయన సముఖంనుంచి భూమి, ఆకాశం పారిపోయాయి. వాటికి నిలువ చోటు ఎక్కడా దొరకలేదు.

[12] అప్పుడు దేవుని ముందర చనిపోయినవారు – ఘనులైనా అల్పులైనా నిలుచుండడం చూశాను. అప్పుడు గ్రంథాలు విప్పబడ్డాయి. మరో గ్రంథం కూడా విప్పబడింది – అదే జీవ గ్రంథం. ఆ గ్రంథాలలో రాసి ఉన్న విషయాల ప్రకారం, వారి పనులనుబట్టి, చనిపోయినవారు తీర్పుకు గురి అయ్యారు.

[13] సముద్రం తనలో ఉన్న చనిపోయినవారిని అప్పగించింది. మృత్యువు, పాతాళం తమలో ఉన్న చనిపోయినవారిని అప్పగించాయి. ప్రతి ఒక్కరూ తమ పనుల ప్రకారమే తీర్పుకు గురి అయ్యారు.

[14] అప్పుడు మృత్యువూ పాతాళమూ అగ్ని సరస్సులో పడవేయబడ్డాయి. ఇది రెండో చావు.

[15] ఏ వ్యక్తి పేరు జీవ గ్రంథంలో రాసి ఉన్నట్టు కనబడలేదో ఆ వ్యక్తి అగ్ని సరస్సులో పడవేయడం జరిగింది.

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters