[1] అప్పుడతడు స్ఫటికమంత స్వచ్ఛంగా శుద్ధంగా ఉన్న జీవజల నది నాకు చూపించాడు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనంలోనుంచి ఆ నది బయలుదేరి
[2] ఆ నగర వీధి మధ్యగా పారుతూ ఉంది. ఆ నదికి అటూ ఇటూ జీవ వృక్షం ఉంది. అది నెలనెలకు ఫలిస్తూ పన్నెండు కాపులు కాస్తుంది. ఆ చెట్టు ఆకులు జనాల స్వస్థతకోసం.
[3] అప్పటినుంచి శాపం అంటూ ఏమీ ఉండదు. దేవునిదీ గొర్రెపిల్లదీ అయి ఉన్న సింహాసనం ఆ నగరంలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనకు సేవ చేస్తారు.
[4] వారాయన ముఖాన్ని చూస్తారు. ఆయన పేరు వారి నొసళ్ళమీద ఉంటుంది.
[5] అక్కడ రాత్రి ఏమీ ఉండదు. దీప కాంతి గానీ సూర్యకాంతి గానీ వారికక్కర ఉండదు. ఎందుకంటే ప్రభువైన దేవుడే వారికి కాంతి ఇస్తాడు. వారు శాశ్వతంగా రాజ్యపరిపాలన చేస్తారు.
[6] అప్పుడతడు నాతో “ఈ మాటలు నమ్మకమైనవి, సత్యమైనవి. పవిత్ర ప్రవక్తలకు ప్రభువైన దేవుడు త్వరగా జరగవలసినవాటిని తన దాసులకు చూపించడానికి తన దూతను పంపాడు” అన్నాడు.
[7] “ఇదిగో, నేను త్వరగా రాబోతున్నాను. దేవుని మూలంగా వచ్చిన ఈ గ్రంథంలోని మాటలను పాటించే వ్యక్తి ధన్యజీవి.”
[8] నేను – యోహానును – ఈ విషయాలు చూశాను, విన్నాను, విని చూచినప్పుడు ఈ విషయాలు నాకు చూపించిన దేవదూత పాదాలదగ్గర ఆరాధన చేయడానికి సాగిలపడ్డాను.
[9] అయితే అతడు “అలా చేయకూడదు! నేనూ నీలాగే దేవుని దాసుణ్ణి. నీ సోదర ప్రవక్తలతోపాటు, ఈ గ్రంథంలోని మాటలను పాటించేవారితోపాటు దాసుణ్ణి. దేవుణ్ణే ఆరాధించు” అని నాతో చెప్పాడు.
[10] అతడు ఇంకా నాతో “దేవుని మూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలను మూసి ముద్ర వేయకు, సమయం సన్నిహితం.
[11] అన్యాయస్థుడు ఇంకా అన్యాయస్థుడుగా ఉండనియ్యి, నీచుడు ఇంకా నీచంగా ఉండనియ్యి. నీతిమంతుడు ఇంకా నీతిమంతుడుగా ఉండనియ్యి. పవిత్రుడు ఇంకా పవిత్రుడుగా ఉండనియ్యి” అని చెప్పాడు.
[12] “ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. ప్రతి వ్యక్తికీ తాను చేసినదాని ప్రకారమే ప్రసాదించడానికి నేనిచ్చే ప్రతిఫలం నా దగ్గర ఉంటుంది.
[13] నేను ‘అల్ఫా’ను, ‘ఒమేగ’ను, ఆదిని, అంతాన్ని, మొదటివాణ్ణి, చివరివాణ్ణి.
[14] జీవ వృక్షానికి హక్కుగలవారై ద్వారాల గుండా నగరంలో ప్రవేశించేలా ఆయన ఆదేశాల ప్రకారం ప్రవర్తించే వారు ధన్యజీవులు.
[15] నగరం బయట కుక్కలూ, మాంత్రికులూ, లైంగిక అవినీతిపరులూ, హంతకులూ, విగ్రహపూజ చేసేవారూ, అబద్ధాలంటే ఇష్టమున్న వారంతా, వాటిని అభ్యసించే వారంతా ఉంటారు.
[16] నేను – యేసును – సంఘాలలో ఈ విషయాలు మీకు సాక్ష్యం చెప్పడానికి నా దూతను పంపాను. నేను దావీదు వేరునూ సంతానాన్నీ ప్రకాశమానమైన వేకువచుక్కనూ.”
[17] దేవుని ఆత్మ, పెళ్ళి కుమార్తె రమ్మని అంటున్నారు. ఇది విన్న వ్యక్తి రమ్మనాలి. దప్పిక వేసిన వ్యక్తి రావాలి. ఇష్టమున్న వ్యక్తి ఎవరైనా సరే జీవ జలం ఉచితంగానే పుచ్చుకోవచ్చు.
[18] దేవునిమూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలు వినే ప్రతి వ్యక్తికీ నేనిలా సాక్ష్యం చెపుతున్నాను: ఎవరైనా సరే ఈ విషయాలతో ఏదైనా కలిపితే ఈ గ్రంథంలో రాసి ఉన్న ఈతిబాధలు దేవుడు ఆ వ్యక్తిమీదికి రప్పిస్తాడు.
[19] దేవునిమూలంగా వచ్చిన వాక్కయిన ఈ గ్రంథంలోని మాటలలో నుంచి ఏదైనా ఎవరైనా తీసివేస్తే ఈ గ్రంథంలో రాసి ఉన్న జీవ గ్రంథంలో నుంచి, పవిత్ర నగరంలో నుంచి, ఈ గ్రంథంలో రాసి ఉన్న విషయాలలో నుంచి ఆ వ్యక్తి భాగం దేవుడు తీసివేస్తాడు.
[20] ఈ విషయాల గురించి సాక్ష్యం చెప్పేవాడు “అవును, నేను త్వరగా రాబోతున్నాను” అంటున్నాడు. తథాస్తు! అవును, యేసుప్రభూ! వచ్చెయ్యి!
[21] ప్రభువైన యేసు క్రీస్తు అనుగ్రహం మీకందరికీ తోడై ఉంటుంది గాక! తథాస్తు!