Skip to content
Opens in a new window
Listen to this chapter • 2:56

[1] ఈ సంగతుల తరువాత నేను చూస్తూ ఉంటే పరలోకంలో తెరచి ఉన్న ఒక తలుపు కనిపించింది. నేను మొదట విన్న స్వరం బూర ధ్వని లాగే నాతో మాట్లాడడం విన్నాను. ఆ స్వరం “ఇక్కడికి ఎక్కి రా, తరువాత ఉండవలసినవి నీకు చూపుతాను” అంది.

[2] వెంటనే నేను దేవుని ఆత్మవశుడనయ్యాను. అప్పుడు పరలోకంలో నిలిచి ఉన్న సింహాసనాన్ని, సింహాసనం మీద కూర్చుని ఉన్న ఒక వ్యక్తిని చూశాను.

[3] అక్కడ కూర్చుని ఉన్న ఆ వ్యక్తి చూడడానికి సూర్య కాంతం లాగా, కెంపులాగా ఉన్నాడు. సింహాసనాన్ని రంగుల విల్లు ఒకటి చుట్టుకొని ఉంది. అది పచ్చరాయిలాగా కనిపించింది.

[4] సింహాసనం చుట్టూరా ఇరవై నాలుగు సింహాసనాలు ఉన్నాయి. ఆ సింహాసనాలమీద తెల్లని దుస్తులు తొడుక్కొన్న ఇరవై నలుగురు పెద్దలు కూర్చుని ఉండడం చూశాను. వారి తలలమీద బంగారు కిరీటాలు ఉన్నాయి.

[5] సింహాసనంనుంచి మెరుపులూ ఉరుములూ శబ్దాలూ బయలుదేరుతూ ఉన్నాయి. సింహాసనం ఎదుట ఏడు కాగడాలు మండుతూ ఉన్నాయి. అవి దేవుని ఏడు ఆత్మలు.

[6] సింహాసనానికి ఎదురుగా స్ఫటికాన్ని పోలిన గాజు సముద్రం ఉంది. సింహాసనం మధ్య, దాని చుట్టూ నాలుగు ప్రాణులు ఉన్నాయి. ఆ ప్రాణులకు ముందూ వెనుకా అంతటా కండ్లు ఉన్నాయి.

[7] మొదటి ప్రాణి సింహంలాంటిది. రెండో ప్రాణి కోడెదూడలాంటిది. మూడో ప్రాణి మనిషి ముఖంలాంటి ముఖం గలది. నాలుగో ప్రాణి ఎగురుతూ ఉన్న గరుడపక్షిలాంటిది.

[8] ఈ నాలుగు ప్రాణులలో ప్రతిదానికీ ఆరు రెక్కలు ఉన్నాయి. వాటి చుట్టూ, రెక్కలక్రింద కూడా, కళ్ళతో నిండి ఉన్నాయి. ఆ ప్రాణులు రాత్రింబగళ్ళు మానక ఇలా అంటూ ఉన్నాయి: “పూర్వముండి, ప్రస్తుతముంటూ, భవిష్యత్తులో వచ్చేవాడూ, అమిత శక్తిగల ప్రభువూ అయిన దేవుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు!”

[9] శాశ్వతంగా జీవిస్తూ సింహాసనంమీద కూర్చుని ఉన్న వ్యక్తికి ఆ ప్రాణులు మహిమ, ఘనత, కృతజ్ఞతలు అర్పిస్తూ ఉన్నప్పుడు,

[10] ఆ ఇరవై నలుగురు పెద్దలు సింహాసనం మీద కూర్చుని ఉన్న వ్యక్తి ఎదుట సాగిలపడి శాశ్వతంగా జీవిస్తూ ఉన్న ఈయనను ఆరాధిస్తారు. తమ కిరీటాలు సింహాసనం ఎదుట పడవేసి ఇలా అంటారు:

[11] “ప్రభూ! నీవు సమస్తాన్ని సృజించావు. నీ ఇష్టాన్ని బట్టే అవి ఉన్నాయి, సృజించబడ్డాయి గనుక మహిమ, ఘనత, ప్రభావం పొందడానికి నీవే యోగ్యుడవు.”

ప్రకటన (ప్రత్యక్షం) — Chapters